పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ తెలుగు మూవీస్ తెలుసా..?

పునర్జన్మ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ అప్పుడప్పుడూ.. అక్కడక్కడా పునర్జన్మకు సంబంధించిన వార్తలు వింటుంటాం. అలా విన్నప్పుడు తెలియకుండానే ఎంతో ఆసక్తి చూపుతాం. ఆ ఆసక్తినే వెండితెర కూడా క్యాష్ చేసుకుంటూ వస్తోంది. అయితే పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో తొలి బ్లాక్ బస్టర్ గా మూగ మనసులు చిత్రాన్నే చెప్పాలి.
పడవ నడుపుకునే నాగేశ్వరరావు జమీందారుగారి అమ్మాయి అయిన సావిత్రిపై ఒక రకమైన అభిమానాన్ని పెంచుకుంటాడు. ఆమెకూ అతనంటే అలాంటి అభిమానమే. కానీ ప్రేమగా గుర్తించే సరికి ఆమెకు పెళ్లవుతుంది. ఆ పెళ్లి సంతోషం ఎంతో కాలం నిలవకుండానే ఆమె భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ఇటు ఈ ఇద్దరూ కలిసి ఓ సారి పడవలో వెళుతుండగా.. ప్రమాదానికి గురై చనిపోతారు. అలా పోయిన వాళ్లు వేరే ప్రాంతాల్లో మళ్లీ పుడతారు. ప్రేమించి పెళ్లీ చేసుకుంటారు. అనుకోకుండా మళ్లీ ఆ ఊరు వచ్చిన వారికి గత జన్మ తాలూకూ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అయితే వీరి తొలిజన్మలో ఉన్నప్పుడు నాగేశ్వరరావును జమున ప్రేమిస్తుంది. ఆమె ముసలి అయిపోయిన తర్వాత వీళ్లు రెండో జన్మతో ఎంటర్ అవుతారు. జమున గుర్తుపడుతుంది. వీరిని చూశాక ఆమె చనిపోతుంది.
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మూగమనసులు సంచలన విజయం సాధించింది. ఆత్రేయ పాటలు, కెవి మహదేవన్ సంగీతంలో వచ్చిన పాటలు కూడా విజయంలో భాగం పంచుకున్నాయి.
ఇక 1978లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన దేవదాసు మళ్లీపుట్టాడు కూడా దాదాపు మూగమనసులు పాటర్న్ లోనే సాగే చిత్రం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. నిజానికి ఈ చిత్రాన్ని అక్కినేని, సావిత్రి నటించిన దేవదాసుకు సీక్వెల్ గానూ ప్రకటించాడు దాసరి. ఆ ఇద్దరి జంటను అలా వదిలేయడం ఆయనకు నచ్చలేదట. అందుకే మరో జన్మ పెట్టి ఇద్దరినీ కలిపేశాడు దాసరి.
1988లో మరో పునర్జన్మ చిత్రం వచ్చింది. నాగార్జున, విజయశాంతి, జీవిత ప్రధాన పాత్రల్లో నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకుడు. ఇందులో కూడా జీవిత.. నాగార్జునను లవ్ చేస్తుంది. అతను విజయశాంతిని ఇష్టపడతాడు. మొదటి జన్మలో కలవలేకపోయినా రెండో జన్మలో అచ్చంగా మూగమనసులు చిత్రంలోలాగా కలుస్తారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కెవి మహదేవన్ సంగీతం మరో హైలెట్.
ఆ మధ్యలోనూ కొన్ని చిత్రాలు వచ్చినా.. అవేవీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. తర్వాత అదే పాయింట్ ను తనదైన శైలిలో టచ్ చేస్తూ.. రాజమౌళి మగధీరతో వచ్చాడు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ మగధీరలో మరో హీరోయిన్ లేదు కానీ.. కథను ఏకంగా నాలుగువందల యేళ్లు వెనక్కి తీసుకువెళ్లాడు. అప్పట్లో ఆమె రాకుమారి. అతను సైన్యాధిపతి. వీళ్లూ కలుసుకోకుండానే రాకుమారి మేనబావ వల్ల చనిపోతారు. మళ్లీ 400యేళ్ల తర్వాత పుట్టినా.. ఆమెకు గతం గుర్తుండదు. అతనికి గుర్తొస్తుంది. తనలాగే ఆమెకూ గతాన్ని గుర్తు చేయాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇటు ఆమె మేనబావ కూడా మళ్లీ పుడతాడు. అతనికీ గతం గుర్తుంటుంది. మొత్తంగా ఈ జన్మలో కథను సుఖాంతం చేస్తాడు రాజమౌళి. దీనికి ఆయన తరహా హంగులూ అనేకం అద్దాడంతో పాటు అదనంగా వచ్చిన గ్రాఫిక్స్ తో మాయ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
మగధీర వచ్చిన ఇన్నేళ్లకు మళ్లీ నాని ఆ తరహా కథతో వచ్చాడు. బట్ ఈ సారి విచిత్రంగా కేవలం హీరో మాత్రమే పునర్జన్మ పొందుతాడు. తొలి జన్మలో ప్రేయసికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మళ్లీ పుట్టాడు అన్నట్టుగా చూపించారు. ఈ పునర్జన్మ కథ కూడా బాగానే ఆకట్టుకుంటోంది. సో పునర్జన్మ అనే పాయింట్ మన తెలుగువారికి మంచి కమర్షియల్ ఎలిమెంట్ గా మారిందన్నమాట.

Related Posts