అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా టాలీవుడ్ టు బాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా సాగుతోంది. ఇప్పుడు చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్‘తో డెబ్యూ ఇచ్చిన ఖుషి కపూర్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు వారసులతో నటించడానికి సిద్ధమైంది.
సైఫ్ ఆలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ఆలీ ఖాన్ తో కలిసి ‘నాదనియాన్‘ సినిమాలో నటించబోతుంది. బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు లేటెస్ట్ గా ఖుషీ కపూర్ మరో వారసుడితోనూ హీరోయిన్ గా నటించబోతుందట. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో తమిళ హిట్ మూవీ ‘లవ్ టుడే‘ రీమేక్ లో నటించనుందట ఖుషి కపూర్.
2022లో విడుదలైన ‘లవ్ టుడే‘ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ప్రదీప్ రంగనాథన్ నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది. అనువాద రూపంలో తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాని అమీర్ ఖాన్ తనయుడు జునైద్, శ్రీదేవి తనయ ఖుషీ కపూర్ లతో హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఇప్పటికే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఆమధ్య జపాన్ లో ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.