Abhiram : దగ్గుబాటి కుర్రాడు దమ్ము చూపిస్తాడా..?

తెలుగు సినిమా స్వర్ణయుగపు దశ తర్వాత కూడా నిర్మాతకు అత్యంత గౌరవాన్ని ఆపాదించిన వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు. విలువలతో కూడిన చిత్రాలను, కథా బలం ఉన్న సినిమాలను నిర్మించిన వ్యక్తి ఆయన. సినిమా నిర్మాణాన్ని వ్యాపారంలా కాక వ్యాపకంగా మలచుకున్న నిర్మాత రామానాయుడు.

తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ సాయం చేసే వ్యక్తి. అలాంటి నిర్మాత ఇంకా రాలేదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పటికీ చివరి స్టార్ ప్రొడ్యూసర్ అంటే నాయుడుగారినే చెబుతాం.

నిర్మాతగా తను టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడే చిన్న కొడుకు వెంకటేష్‌ ను హీరోగా, పెద్దబ్బాయి సురేష్‌ బాబును నిర్మాతగా సెటిల్ చేశారు. వీరు కూడా ఆయన గౌరవానికి భంగం రాకుండా తమదైన బాటల్లో వెళుతున్నారు.

ఇక నాయుడుగారి పేరు పెట్టుకుని ఆయన్లా ముందు నిర్మాతగా కాక నటుడుగా మారాడు రానా. తర్వాత తనూ నిర్మాత అయ్యాడు. దేశవ్యాప్తంగా రానాకు మంచి పేరు ఉంది. కాకపోతే నటుడుగా ఇంకా స్టార్డమ్ రాలేదు. బాహుబలి విలన్ గా ప్రపంచానికీ పరిచయం అయినా.. ఎందుకో హీరోగా మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆ లోటును తీర్చేందుకు అతని తమ్ముడు.. సురేష్‌ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా మార్చారు. వీర సీరియస్, వెరీ స్ట్రిక్ట్ అని చెప్పుకునే తేజ దర్శకత్వంలో ఈ కుర్రాడిని లాంచ్ చేశారు. అహింస పేరుతో రూపొందిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కాబోతోంది. ఎప్పట్లానే తేజ మార్క్ రొటీన్ ఫార్ములా ట్రైలర్ లో కనిపించింది.


ఇక సినిమా ఫ్యామిలీ నుంచి వస్తున్నా.. అభిరామ్ మాత్రం నటన పరంగా ఏం మెళకువలు నేర్చుకోలేదు.. అని ట్రైలర్ తోనే తెలిసిపోతుంది. ఇక కాస్త గట్టి సీన్ పడితే సులువుగా తేలిపోతాడు అనుకోవచ్చు. పైగా ఆ ప్రమాదం తనకు క్లైమాక్స్ లో ఎదురైతే అతని సజెషన్ షాట్స్ తో ఎక్స్ ప్రెషన్ లేకుండా పదినిమిషాలు షూట్ చేశానని.. కుర్రాడి “ప్రతిభ” గురించి చెప్పకనే చెప్పాడు తేజ. కాకపోతే ఇలాంటి కుర్రాళ్లకు హిట్ పడితే ఆ మాటున అన్నీ మర్చిపోతారు. అంటే ఫస్ట్ మూవీతోనే హిట్ కొడితే.. తనకు యాక్టింగ్ రాకపోయినా పాస్ అయిపోతాడు. తర్వాత్తర్వాత సెట్ అవుతాడు అనే రొటీన్ డైలాగ్ ఒకటి విమర్శకుల నుంచి కూడా వస్తుంది.

ఒకవేళ ఫ్లాప్ పడితే మాత్రం ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా.. మళ్లీ వస్తాడు అని కూడా అనుకుంటారు. ఏదేమైనా వారసులు హీరోగాలుగా వస్తున్నప్పుడు అన్ని విషయాలకూ ఎక్కువ ఆరాలు తీస్తుంటారు.. అవన్నీ దాటుకుని నిలవడం అంత సులువేం కాదు. ప్రస్తుతం అభిరామ్ కూడా ఈ టఫ్ సిట్యుయేషన్ లోనే ఉన్నాడు.
అహింస కథ చూస్తే బలంగానూ.. బరువైనదిగానూ ఉంది. మరి ఈ బరువైన కథను ఈ కుర్రాడు ఎలా మోశాడు. ఆ మోయడం ద్వారా తన దమ్మేంటో జనానికి చూపిస్తాడా అనేది వేచి చూడాలి.

Related Posts