విరాట పర్వం మూవీ రివ్యూ ..

విరాట పర్వం కొన్ని సినిమాలు ఎక్కువ ఎదురు చూసేలా చేస్తాయి. ఎంతలా అంటే తీసిన వారికంటే చూడాలనుకుంటోన్న వారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువమంది వెయిట్ చేసేలా చేసిన సినిమా విరాటపర్వం. నీదీనాదీ ఒకే కథ సినిమాతో ఓవర్ నైట్ తెలుగులో పాపులర్ అయిన దర్శకుడు వేణు ఊడుగుల రూపొందించిన ఈ సినిమాలో సాయి పల్లవి, రానా, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. మరి మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విరాటపర్వం ఎలా ఉందో ఈ ప్రీ రివ్యూలో చూద్దాం..

కథ ః
వెన్నెల(సాయి పల్లవి) ఒకానొక యుద్ధ సమయంలో పుడుతుంది. చిన్న తనం నుంచే కాస్త అభ్యుదయ భావాలున్న యువతి. అలాంటి భావజాలం ఉన్నవారంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే నక్సలైట్స్ లో సాహిత్యంతో సమాజాన్ని జాగృతం చేయాలని గుండెలను మండించే రచనలు చేస్తోన్న రవన్న రచనల పట్ల అట్రాక్ట్ అవుతుంది. అందుకే అతన్ని కలవాలని తపిస్తుంది. ఆ తపనతోనే రవన్నను వెదుక్కుంటూ అడవికి పయనిస్తుంది. ఈ ప్రయాణంలోఅనేక అవరోధాలు ఎదుర్కొంటుంది. పోలీస్ నిర్బందాలు, నక్సలైట్ల అనుమానాలూ చూస్తుంది. చివరికి రవన్నను చేరుతుంది. కానీ అక్కడే ఆమె జీవితంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అవేంటీ.. అసలు తను అడవికి వెళ్లింది కేవలం రవన్నను కలవడానికేనా ఇంకేదైనా రీజన్ ఉందా అనేది మిగతా కథ.

విశ్లేషణ ః
కొన్న కథల్లో మట్టి వాసన ఉంటుంది. మరికొన్ని కథల్లో మనతనం ఉంటుంది. ఈ రెండూ కనిపించే కథ విరాటపర్వం. 16990ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా వేణు ఊడుగుల రూపొందించిన ఈ మూవీ అడుగడుగునా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. ఇలాంటి సినిమా కోసం కదా మనం ఇన్నాళ్లూ మనం ఎదురుచూసింది అని ప్రతి ప్రేక్షకుడూ ఫీలయ్యేలా చేస్తుంది. రివల్యూషన్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్‌లవ్ అనే ట్యాగ్ కు అద్భుతమైన కంక్లూషన్ ఇస్తూ సాగుతుంది. అడవిలో నక్సలైట్ల జీవిత విధానాల నుంచి వారిని వెదికే పోలీస్ ల జీవితాలూ కనిపిస్తాయి. ఇద్దరి మధ్య యుద్ధానికి సంబంధించిన తర్క, వితర్కాలూ కనిపిస్తాయి. అలాగని ఇది ఏ వాదాన్నీ సమర్థించే కథ కాదు. కానీ ఆకట్టుకుంటుంది. నక్సలైట్స్ అంటే నచ్చనివారిక సైతం సినిమా నచ్చుతుంది. పోలీస్ యాక్ట్ పై కోపం తెచ్చుకునేవారు కూడా ఆ కోణంలో ఆలోచించేలా చేస్తుంది.

ఓ చిన్న ప్రాంతం నుంచి రవన్నను వెదుకుతూ తరలి వెళ్లే వెన్నెల ప్రయాణంలో మనమూ భాగస్వాములవుతాం. తనతో పాటే చూస్తోన్న ప్రతి ప్రేక్షకుడి అడుగూ పడుతున్న భావన కలుగుతుంది. వెన్నెల నవ్వితే మనం నవ్వడం, తను బాధపడితే మనం బాధపడటం.. తను ఏడిస్తే.. చూస్తున్నవారి కంట నీరు రావడం సహజంగా జరిగిపోయే సంఘటనలుగా కనిపిస్తాయి. ఇలా పాత్రతో ప్రేక్షకుడు కూడా ప్రయాణం చేసే సినిమాలు అత్యంత అరుదుగా వస్తుంటాయి. విరాటపర్వం ఆ అరుదైన కోవలోనూ అద్భుతం అనిపించుకునే సినిమా. ఇరు వర్గాల్లో కనిపించే సంఘర్షణలు ఈ సినిమాలో ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తాయి. కమిట్మెంట్ అంటే అర్థం చెబుతూనే ఆ వెనకే జరిగే సంఘటనలకు బాధ్యత అనేది జీవిత కాల తప్పిదంగా వెంటాడటం కనిపిస్తుంది.

వెన్నెల పాత్రలో ఎప్పట్లానే సాయి పల్లవి కనిపించదు. ఆ పాత్రను తను ఆవాహన చేసుకుంది. తను ఇప్పటి వరకూ చేసిన సినిమాల కంటే కూడా చాలా భిన్నమైన పాత్ర, టఫ్ గా కనిపించే క్యారెక్టరైజేషన్ తనకు సవాల్ గా నిలిస్తే.. ఆ సవాల్ ను అద్భుత నటనతో అధిగమించింది. ఇక భళ్లాల దేవుడుగా, అరణ్యగా, రాజుమంత్రిగా కనిపించిన రానా ఫస్ట్ టైమ్ తన పాత్ర, నటనతో ఆశ్చర్యపరిచాడు. రవన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్యారెక్టర్ లోని బేస్ కు అతని వాయిస్ కూడా సూట్ కావడంతో ఆ పాత్రలోని గాంభీర్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరో కీలక పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర పాత్ర ఈ సారి ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ లో అతని పాత్రతో ప్రేక్షకులు ఓ రకమైన కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ప్రియమణి నటన చాలా బావుంది. నందితా దాస్, జరీనా పాత్రలకూ మంచి ప్రాధాన్యత ఉంది. వారెలాగూ మంచి నటులే కాబట్టి సులువుగానే ఇమిడిపోయారు.

విరాట పర్వం మూవీ టెక్నికల్ గా బ్రిలియంట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సురేష్‌ బొబ్బిలి పాటలు సాధారణం అనిపించినా నేపథ్య సంగీతం చాలా బావుంది. ఎడిటింగ్ కూడా బావుంది. ఆర్ట్ వర్క్, సెట్స్, ప్రాపర్టీస్ అన్నీ 90ల కాలాన్ని గొప్పగా ప్రెజెంట్ చేసేలా ఉన్నాయి. ఈవిషయంలో ఆ డిపార్ట్ మెంట్స్ ఎఫర్ట్ ను మెచ్చుకోవాల్సిందే. దర్శకుడుగా వేణు ఊడుగుల ది బెస్ట్ ఇచ్చాడు. ఓ గొప్ప దర్శకుడు కాగల అన్ని లక్షణాలూ అతనిలో ఉన్నాయి. కాకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో మరీ వెనకబడి ఉండటం కొంత మైనస్ గా కనిపిస్తోంది. ఆ మైనస్ ను అధిగమిస్తే రాబోయే కాలంలో వేణు గ్రేట్ డైరెక్టర్ అనిపించుకుంటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

మొత్తంగా ”హార్టిస్టిక్ గా సాగే రియలిస్టిక్ డ్రామా విరాట పర్వం”

– అన్వేషి

Related Posts