విలక్షణ నటుడు సుహాస్ బయోగ్రఫీ

సినీ వినీలాకాశంలో ధృవతారలుగా వెలగాలని ఆశపడే వాళ్లు చాలామందే ఉంటారు. అయితే.. అకుంటిత దీక్షతో అనుకున్నది సాధించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో సుహాస్ ఒకడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన సుహాస్ తొలుత యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యాడు.

ఛాయ్ బిస్కెట్ నిర్మించిన పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. తనదైన డైలాగ్ డిక్షన్, నేచురల్ యాక్టింగ్ తో తొందరగానే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. ‘ది అతిథి, కళాకారుడు, రాధిక, నందన్, బంగారం, నేనోరకం’ వంటి షార్ట్ ఫిల్మ్స్ నటుడిగా సుహాస్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. మరోవైపు ఓటీటీలోనూ ‘నేను మీ కళ్యాణ్, షిట్ హ్యాపెన్స్, యాంగర్ టేల్స్‘ వంటివి సుహాష్ నటనలోని కొత్త యాంగిల్ ను ఆవిష్కరించాయి.

షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. తొలుత కమెడియన్ గా మంచి రోల్స్ చేశాడు. శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలోని చిన్న పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే‘ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం నటుడిగా సుహాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక.. కమెడియన్ నుంచి కథానాయకుడిగా మారే సమయం ఆసన్నమైంది. 2020లో ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోగా మారాడు సుహాస్. తన మిత్రుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన పీరియడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘కలర్ ఫోటో‘ మంచి విజయాన్ని సాధించింది. 1990ల బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ పీరియడ్ లవ్ స్టోరీలో బిలో మిడిల్ క్లాస్ బాయ్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. డైరెక్ట్ ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీలో నటనకు సుహాస్ కి మంచి పేరొచ్చింది. అంతేకాదు.. 68వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో‘ నిలిచింది.

‘కలర్ ఫోటో’తో కథానాయకుడిగా మారినా యదావిధిగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ తోనూ మురిపించాడు. ఈ లిస్టులో ‘రంగ్ దే, అర్థ శతాబ్దం, హెడ్స్ అండ్ టేల్స్‘ వంటివి ఉన్నాయి. ఇక.. 2021లో సోనీ లివ్ లో విడుదలైన ‘ఫ్యామిలీ డ్రామా‘ ఫిల్మ్ సుహాస్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది. ఈ నియో-నాయిర్ ఫిల్మ్ లో సీరియల్ కిల్లర్ గా సుహాస్ తన నటనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టాడనే చెప్పొచ్చు.

ఫ్యామిలీ డ్రామా‘ ప్రభావంతోనే నాని నిర్మాణంలో అడవి శేష్ హీరోగా రూపొందిన ‘హిట్: ది సెకండ్ కేస్‘లోనూ నెగటివ్ రోల్ లో దుమ్మురేపాడు. ‘హిట్ 2’కి గానూ బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ నెగటివ్ రోల్ లో సైమా అవార్డు కూడా అందుకున్నాడు. మళ్లీ కథానాయకుడిగా సుహాస్ కి మంచి విజయాన్నందించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పక్కింటబ్బాయి తరహా పాత్రలో అదరగొట్టాడు సుహాస్.

హీరోగా సుహాస్ ని మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు‘. ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో పీరియడిక్ లవ్ స్టోరీగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడు మల్లి పాత్రలో.. సహజమైన మేకోవర్, మ్యానరిజమ్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.

ఇదే ఊపులో ఇప్పుడు వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. వీటిలో ‘శ్రీరంగనీతులు, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, ఆనంద్ రావు అడ్వెంచర్స్, ప్రసన్న వదనం‘ వంటి చిత్రాలున్నాయి. సుహాస్ కెరీర్ ను పరిశీలిస్తే.. ఈ ఐదారేళ్ల షార్ట్ పీరియడ్ లోనే ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించాడు. హీరోగా, విలన్ గానూ మెప్పించాడు. మొత్తంమీద.. షార్ట్ ఫిల్మ్స్ తో మొదలై సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరుపిస్తూ సాగుతున్న సుహాస్.. మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.

Related Posts