‘సేవ్ ది టైగర్స్ 2’ రివ్యూ

నటీనటులు: ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్‌ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, సీరత్‌ కపూర్‌, దర్శనా బానిక్‌, గంగవ్వ, వేణు యెల్దండి, సత్య కృష్ణ, రోహిణి తదితరులు
సినిమాటోగ్రఫి: ఎస్వీ విశ్వేశ్వర్‌
సంగీతం: అజయ్‌
ఎడిటింగ్‌: శ్రవణ్‌ కటికనేని
క్రియేటర్స్‌: మహి వి. రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతమ్‌
దర్శకత్వం: అరుణ్‌ కొత్తపల్లి
విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

ఈమధ్య కాలంలో సినిమాలకు దీటుగా సిరీస్ లకు కూడా మంచి పేరొస్తుంది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన కొన్ని సిరీస్ లకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విపరీతమైన ఫాలోయింది ఉంది. అలాంటి వాటిలో ముందు వరుసలో నిలిచే సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఆరు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ రిలీజైంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ సిరీస్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సిరీస్ లో సెకండ్ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్స్ తో రెండో సీజన్ సిద్ధమైంది. మరి.. సెకండ్ సీజన్ ఆడియన్స్ ను ఏరీతిన అలరిస్తోంది? అసలు ‘సేవ్ ది టైగర్స్ 2’ కథేంటి? వంటి విశేషాలు ఈ రివ్యూలో చూద్దాం.

కథ
హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) కిడ్నాప్ ఇతివృత్తంతో మొదటి సీజన్ ముగుస్తుంది. అసలు హంసలేఖ ఏమైంది? అనే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులకు ఓ వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో హంసలేఖతో పాటు గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం) కనిపిస్తారు. దీంతో.. వాళ్లే హంసలేఖ ను కిడ్నాప్ చేశారని భావించి వారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు ముగ్గురునీ తమదైన శైలిలో విచారిస్తారు. మరోవైపు హంసలేఖ ను వీరు ముగ్గురూ కిడ్నాప్ చేసి చంపేశారనే వార్తలు టి.వి.లో ప్రసారమవుతుంటాయి. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు.

హంసలేఖ కిడ్నాప్ ఎపిసోడ్ తర్వాత బాగా పాపులారిటీ సంపాదించుకున్న పాల వ్యాపారం చేసే గంటా రవి(ప్రియదర్శి)ని కార్పోరేటర్ చేస్తానని లోకల్ ఎమ్మేల్యే మాట ఇస్తాడు. గేటెడ్ కమ్యునిటీకి వెళ్లడం కోసం దాచుకున్న డబ్బులను ఆ ఎమ్మేల్యేకి ఇస్తాడు గంటా రవి. మరోవైపు విక్రమ్ (చైతన్య కృష్ణ) తన ఆఫీసులో కొత్తగా చేరిన హారిక మాయలో పడిపోయాడనే విషయం.. అతని భార్య రేఖ (దేవయాని) వరకూ వెళుతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ మానేసి చాలా కాలంగా సినిమా కథను రాస్తూ కూర్చున్న రాహుల్ (అభినవ్ గోమఠం) ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో డీలాపడతాడు. ఈనేపథ్యంలో తమ భర్తల విషయంలో ఆ భార్యలు ముగ్గురు ఏం చేస్తారు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ.

విశ్లేషణ
‘సేవ్ ది టైగర్స్’ తొలి సీజన్ చూడకపోయినా.. రెండో సీజన్ కు ఈజీగా కనెక్ట్ అయ్యేలా కథను నడిపించారు క్రియేటర్స్ మహి వి. రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతమ్‌. కథలో పాత్రలన్నింటికీ ఇంటర్ లింక్ పెడుతూ సిరీస్ ను ఎక్కడా బోర్ లేకుండా నడిపించడంలో క్రియేటర్స్, దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను అల్లుకుంటూ వచ్చిన తీరు ఆకట్టుకుంటుంది.

కామెడీయే అల్టిమేట్ టార్గెట్ గా రూపొందిన ఈ సిరీస్ లో మొదటి సీజన్‌లాగే కామెడీకి ఏమాత్రం కొదవలేదు. కామెడీతో పాటు ఎమోషన్స్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదనే సందేశాన్ని కూడా సెకండ్ సీజన్ లో చెప్పారు మేకర్స్. లీడ్ పెయిర్స్ ముగ్గురికీ సమన్యాయం చేస్తూ.. మిగతా పాత్రలను కూడా అదే త్రాటిపైకి తీసుకొచ్చి కథను ముందుకు తీసుకెళ్లడంలో క్రియేటర్స్ సక్సెస్ అయ్యారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
మొదటి సీజన్ తరహాలోనే రెండో సీజన్ లోనూ లీడ్ పెయిర్స్ ముగ్గురూ ప్రియదర్శి-జోర్దార్ సుజాత, అభినవ్-పావని, చైతన్య కృష్ణ-దేవయాని పోటీపడి నటించారు. సెకండ్ సీజన్ లో ప్రియదర్శి పాత్రలో ఎక్కువ షేడ్స్ కనిపించాయి. హంసలేఖతో సాన్నిహిత్యం, కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడే ఎమోషనల్ సీన్స్ వంటివి ఆకట్టుకుంటాయి. ప్రియదర్శి-జోర్దార్ సుజాత మధ్య వచ్చే సంభాషణలన్నీ తెలంగాణ మాండలికంలో ఎంతో సహజంగా ఆకట్టుకుంటాయి.

అభినవ్ గోమఠం, పనిమనిషి లక్ష్మీ (రోహిణి) మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఈ సిరీస్ కే హైలైట్. గేటెడ్ కమ్యూనిటీలో పెట్స్ గురించి ప్రత్యేకంగా సాగే ఎపిసోడ్ నవ్వులు పండిస్తుంది. చైతన్య కృష్ణ-దేవయాని ఎపిసోడ్ ఎక్కువగా ఎమోషనల్ గానే సాగుతుంది.

మిగతా పాత్రల విషయానికొస్తే.. ఆరంభంలో శ్రీకాంత్ అయ్యంగార్, బలగం వేణు, లక్ష్మీ, ముక్కు అవినాష్ పాత్రలు నవ్వులు పండించడంలో విజయవంతమయ్యాయి. ముగ్గురు హీరోయిన్లకు భర్తల గురించి సందేశాలు ఇచ్చే కీలక పాత్రలో నటీమణి సత్య కృష్ణ సరిగ్గా సరిపోయింది. గంగవ్వ పాత్ర కూడా బాగుంది.

టెక్నికల్ సపోర్ట్ గురించి వస్తే.. ఈ కథపై ప్రదీప్ అద్వైతం, విజయ్, ఆనంద్ కార్తీక్ బాగా కసరత్తు చేశారు. కథలో ఎక్కడా ఎవరి పాత్ర వైపు నుంచి గ్యాప్ రాకుండా అన్నింటినీ కవర్ చేస్తూ నడిపించడంలో వీరు విజయవంతమయ్యారు. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి కథపై, పాత్రలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాడు. కామెడీతో పాటు ఎమోషన్స్ ను క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అజయ్ నేపథ్య సంగీతం, విశ్వేశ్వర్ ఫొటోగ్రఫీ కథకి మరింత బలాన్నిస్తూ సాగాయి.

చివరగా
‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 లో 10000 బి.సి కాన్సెప్ట్ తో క్రియేట్ చేసిన ఎపిసోడ్ కాస్త ఓవర్ డోస్ అనిపించింది. అలాగే మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్లో ఎంటర్టైన్మెంట్ తక్కువ అయ్యిందనే చెప్పొచ్చు.

Related Posts