రేపు బాక్సాఫీస్ వద్ద ముక్కోణపు పోరు

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సినిమాల సందడి లేదు. మహాశివరాత్రి కానుకగా రేపు బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర జరగబోతుంది. ముచ్చటగా మూడు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు మహారంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు.

కటౌట్ ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ మ్యాచో హీరో గోపీచంద్ కి కూడా వర్తిస్తుంది. యాక్షన్ స్టార్ అనే పదానికి అసలుసిసలు నిర్వచనంలా ఉండే గోపీచంద్ కి సరైన హిట్ వచ్చి చాలాకాలమే అయ్యింది. నటుడిగా వంద శాతం తన పాత్రలకు న్యాయం చేసినా.. కథలు సరిగా సెట్ అవ్వక విజయాలకు దూరమవుతున్నాడు ఈ యాక్షన్ స్టార్. అయితే.. గోపీచంద్ లోని మాస్ యాంగిల్ కి తోడు డివోషనల్ టచ్ తో ‘భీమా’ సినిమా రూపొందింది.

కన్నడలో పలు విజయవంతమైన సినిమాలను రూపొందించిన ఎ.హర్ష డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్. ఇప్పటికే ప్రచార చిత్రాలతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘భీమా’ భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు గోపీచంద్. మహాశివరాత్రి కానుకగా రేపు భారీ స్థాయిలో థియేటర్లలోకి దిగుతోంది గోపీచంద్ ‘భీమా’ చిత్రం.

‘భీమా’తో పాటు మరో మూవీ ‘గామి’ కూడా మహాశివరాత్రి కానుకగా వస్తోంది. విశ్వక్ సేన్ నుంచి అసలెవరూ ఊహించని తరహా పాత్ర ఈ సినిమాలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో హ్యూమన్ టచ్ పడని అఘోరాగా అలరించబోతున్నాడు విశ్వక్. తక్కువ బడ్జెట్ లోనే విజువల్ వండర్ లా రూపొందిన ‘గామి’ చిత్రం ప్రచారంలోనూ చాలా దూకుడు చూపించింది. మహాశివరాత్రి కానుకగా హాట్ ఫేవరెట్ గా రేపే థియేటర్లలోకి వస్తోంది ‘గామి’.

డివోషనల్ టచ్ తో రూపొందిన రెండు క్రేజీ తెలుగు సినిమాల మధ్య.. అనువాద రూపంలో అలరించడానికి వస్తోంది మలయాళం డబ్బింగ్ మూవీ ‘ప్రేమలు’. టైటిల్ దగ్గర నుంచి ప్రచార చిత్రాల వరకూ ఓ తెలుగు సినిమాకి ఉన్నంత పాజిటివిటీ ఈ మూవీలో కనిపిస్తుంది. ఈ సినిమా ఇతివృత్తం హైదరాబాద్ కావడం ఈ మూవీకి మరో అడ్వాంటేజ్. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. మొత్తంమీద.. మహాశివరాత్రి పర్వదినాన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్న ఈ మూడు సినిమాలలో ఏ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తాయో చూడాలి.

Related Posts