సర్కారువారి పాట వాళ్లు కూడా దండుకోవచ్చు..

టాప్ స్టార్స్ సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పుడు ప్రేక్షకులంతా సంబరంగా ఎదురుచూసేవారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు చూడాలా అని రిలీజ్ కు చాలా ముందు నుంచే ప్లాన్స్ వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ఆసక్తి తగ్గింది. పైగా ఇష్టమైన హీరోల సినిమాలు వస్తున్నాయంటే కొందరు భయపడుతున్నారు కూడా. అందుకు కారణం టికెట్ రేట్లు. యస్.. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే టికెట్ రేట్లను ఎంత పెంచుతారో అనే భయంతో ఉండిపోతున్నాడు ప్రేక్షకుడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పేరుతో ఫ్యామిలీక మూడు వేలకు పైగా దండుకున్నారు. తర్వాత వచ్చిన ఆచార్యకు సైతం భారీగానే పెంచారు. ఇక ఇప్పుడు సర్కారువారి పాట వంతు వచ్చింది. అలాగని సినిమాను మనమేం అనడం లేదు. భారీ బడ్జెట్ చిత్రాల పేరు చెప్పి.. బలమైన కంటెంట్ లేకున్నా.. కేవలం బడ్జెట్ రికవరీస్ కోసం ప్రభుత్వాల దగ్గర బతిమాలుకుని జనాల జేబుకు చిల్లులు పెడుతున్నారు.

లేటెస్ట్ గా సర్కారువారి పాటకు కూడా పది రోజుల పాటు ఒక్కో టికెట్ పై 45 రూపాయల పాటు పెంచుకోవచ్చని ఆంధప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా ఉత్తర్వులు ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అడక్కపోయినా ఎలాగూ ఇలాంటి ఉత్తర్వులు ఇస్తుంది. దీనికి తోడు అదనంగా ఓ షో కూడా వేసుకునే వెసులు బాటు ఇచ్చినా మళ్లీ టికెట్ రేట్లను పెంచడం ద్వారా క్రమంగా సినిమా అభిమానులను కూడా వాటికి దూరం చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నా.. ఇంకా టికెట్ ధరలను పెంచుకుంటూ పోవడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడం లాంటిదే అనుకోవచ్చు.

ఇప్పటికే చిన్న సినిమాలకు విపరీతమైన గడ్డు రోజులు వచ్చాయి. ఇలా ఇష్టానుసారం టికెట్ ధరలను పెంచడం ద్వారా పెద్ద సినిమాలకు సైతం క్రమంగా ప్రేక్షకులు దూరం అవుతారు.. అప్పుడు మొత్తం పరిశ్రమ మనుగడే ఇబ్బందుల్లో పడుతుందని వీళ్లెందుకు గుర్తించడం లేదో కానీ.. ఆ మధ్య ఆంధ్రలో రాజకీయంగా జరిగిన రగడను మరోసారి గుర్తు చేసుకుంటే.. భారీ బడ్జెట్ అనే మాటలో మూడొంతులకు పైగా రెమ్యూనరేషన్స్ కే వెళుతుంది. ఆ మొత్తాన్ని సామాన్య సినీ ప్రేక్షకుల నుంచే దండుకోవాలనుకోవడం మాత్రం నైతికం కాదు.

పి.ఎస్ : ఇప్పుడు సర్కారువారి పాటకు పెంచారు కాబట్టి ఇదంతా రాయలేదు. ఓవరాల్ గా పెద్ద సినిమాల విషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు పరిశ్రమ అనుసరిస్తోన్న విధానాల గురించి మాత్రమే మాట్లాడ్డం జరిగింది. అంచేత మహేష్ బాబుగారి అభిమానులు మరీ బట్టలు చించుకోవాల్సిన అవసరం లేదు.

Related Posts