ఈ వారం థియేటర్ OTT రిలీస్.. వివరాలు…

వారం వారం కొత్త సినిమాలకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినీ ప్రియులకు.. ఈ వారం సినిమాల జాతర మామూలుగా లేదు. ఇటు థియేటర్లతో పాటు.. అటు ఓటీటీలలోనూ పలు కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.

థియేటర్లలో సినిమాల సందడి
ఈ వారం థియేటర్లలో సందడి చేస్తోన్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఊరు పేరు భైరవకోన‘. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ‘ఊరు పేరు భైరవకోన‘ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది.

అమరావతి రాజధానిగా ఉండాలంటూ రైతులు చేస్తోన్న నిరసన నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‘. ఫిబ్రవరి 15న విడుదలైన ఈ సినిమాకి ఆదిలోనే హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. మార్నింగ్ షోస్ పడిన తర్వాత సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. ఒకరోజు పాటు స్టే విధించింది హైకోర్టు. అయితే.. సెన్సార్ సర్టిఫికెట్ నుంచి సినిమాకి సంబంధించి ప్రతీ రికార్డూ ఖచ్చితంగా ఉండడంతో మళ్లీ ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఓటీటీలో కొత్త చిత్రాలు
ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ కూడా భారీగానే ఉంది. సంక్రాంతి బరిలో సందడి చేసిన కింగ్ నాగార్జున ‘నా సామిరంగ‘ ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘నా సామిరంగ‘ స్ట్రీమ్ అవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సీజన్లలో నాగార్జునకు మంచి హిట్స్ లభిస్తున్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు‘ వంటి హిట్స్ తర్వాత మళ్లీ సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ‘తో మరో హిట్ అందుకున్నాడు కింగ్. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నాగ్ కి జోడీగా ఆషిక రంగనాథ్ నటించింది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ మోస్ట్ అవైటింగ్ ‘డంకీ‘ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది ‘పఠాన్, జవాన్‘లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన షారుక్ ఖాన్ కి ‘డంకీ‘ ఆశించిన స్థాయిలో విజయాన్నందించలేదు. ఒకప్పుడు సక్సెస్ లకు కేరాఫ్ గా నిలిచిన రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న ‘డంకీ‘కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోందట.

వివాదాస్పద చిత్రం ‘కేరళ స్టోరీ‘ విడుదలైన దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇంకా.. ప్రభాస్ ‘సలార్‘ హిందీ వెర్షన్ కూడా లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఇప్పటికే ‘సలార్‘ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఇంగ్లీష్ వెర్షన్స్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ ఫిబ్రవరి 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.

Related Posts