‘శ్రీమంతుడు’ వివాదం.. కొరటాలకు సుప్రీంలో చుక్కెదురు

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఊరు దత్తత అనే కాన్సెప్ట్ తో రూపొందిన ‘శ్రీమంతుడు‘ 2015లో విడుదలైంది. సినిమా వచ్చి ఎనిమిదేళ్లయినా.. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి కథ విషయంలో వివాదం ఓ కొలిక్కి రాలేదు.

‘శ్రీమంతుడు’ కథని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ‘శ్రీమంతుడు’ కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్‌ చంద్ర సమర్పించారు. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో శివ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

కొరటాల దాఖలు చేసిన పిటిషన్‌ పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ డిస్మిస్‌ చేస్తామని లేదా వెనక్కి తీసుకుంటారా అని నిరంజన్‌ రెడ్డిని ప్రశ్నించిన ధర్మాసనం. తాను పిటిషన్‌ వెనక్కి తీసుకుంటా అని చెప్పగా… అనుమతించిన ధర్మాసనం.

Related Posts