బాలీవుడ్ మరింత ఏడిపించబోతున్న సౌత్

బాలీవుడ్లో సౌత్ సినిమాల హంగామా గత ఆరు నెలలుగా ఓ రేంజ్ లో కనిపించింది. అల్లు అర్జున్ పుష్పతో మొదలైన ఈ హడావిడి, కెజిఎఫ్ ఛాప్టర్ 2తో తారా స్థాయికి చేరింది. మధ్యలో ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ సినిమాల సక్సెస్ తో బాలీవుడ్ చాలా ఇరకాటంలో పడింది. ఓ దశలో అక్కడి స్టార్స్ లో అసహనం కూడా కనిపించింది. అయితే జూన్ లో మళ్ళీ బాలీవుడ్ మీద దండయాత్రం చేయబోతున్నాయి కొన్ని సౌత్ సినిమాలు.

ఐదేళ్ళ క్రితం వచ్చిన బాహుబలితో బాలీవుడ్ మీద సౌత్ సినిమాల దాడి మొదలైంది. రీజనల్ ఫిల్మ్ గా తెరకెక్కిన బాహుబలి… అక్కడ గత రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేయడం బాలీవుడ్ కి మింగుడుపడలేదు. ఆ తర్వాత సౌత్ నుంచి కన్నడ సినిమా కెజిఎఫ్ బాలీవుడ్ కి వెళ్ళి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే వంద కోట్ల షేర్ బాలీవుడ్ స్టార్స్ కు నైట్ మేర్ గా మారింది. ఈ సినిమా టైమ్ లో ప్రతీ హిందీ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ లలోనూ బాలీవుడ్ మీడియా పుష్ప వసూళ్లని ప్రస్తావించడంతో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కూడా ఆత్మరక్షణలో పడి అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ సాధించిన వసూళ్లపై స్పందించడానికే బాలీవుడ్ స్టార్లు ఇబ్బందిపడుతుంటే. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా వచ్చిన రాధేశ్యామ్ నిరాశపరచింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మరోసారి బాలీవుడ్ ని ఇరకాటంలో పెట్టింది. ఆల్ రెడీ బాహుబలి సిరీస్ తో బాలీవుడ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన రాజమౌళి, ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో మళ్ళీ వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. అక్కడి స్టార్స్ కూడా ఈ సినిమా మీద, ఇందులో నటించిన తారక్, చరణ్ ల మీద, అలాగే రాజమౌళి మీద ప్రశంసలు కిరిపించారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన కెజిఎఫ్ ఛాప్టర్ 2 అయితే ఒక్క బాహుబలి పార్ట్2 రికార్డ్స్ మినహా… మిగిలిన రికార్డ్స్ ని మొత్తం బ్రేక్ చేసేసింది. ఇప్పటికే ఈ సినిమా 430 కోట్ల నెట్ వసూళ్ళు సాధించిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అంటే బాహుబలి2 తర్వాత కెజిఎఫ్ 2దే రికార్డ్. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 సినిమాలు ధియేటర్లలో ఉండగా రిలీజైన హిందీ సినిమాలన్నీ సరైన విజయాలు సాధించలేదు. ఇంకా చెప్పాలంటే సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. అంతగా ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ని ఇబ్బంది పెట్టాయి. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీస్ సౌత్ సినిమాల మీద అక్కసు వెళ్ళగక్కడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్లో సందడి చేయబోతున్నాయి. వాటిల్లో మేజర్ ఒకటి. 2008 లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ ఎటాక్ నేపథ్యంలో… మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంపై సౌత్ తో పాటు బాలీవుడ్లోనూ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి అక్కడ కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా మేజర్ నార్త్ మార్కెట్ లో సక్సెస్ అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

జూన్ 3న కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ కూడా విడుదల కాబోతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తమిళ హీరో విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో విక్రమ్ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కొంత విరామం తరువాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కావడం, విజయ్ సేతుపతి, ఫహజ్ ఫాజిల్ నటించడం సినిమాకి చాలా ప్లస్ అవుతోంది. అయితే ఈ సినిమాని ఇంకా హిందీలో రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా ప్రకటన ఏది రాలేదు. అలాగే కన్నడ సినిమా “777 ఛార్లీ” కూడా హిందీలో రిలీజ్ కాబోతుంది. రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 10న ఈ సినిమా విడుదలకాబోతుంది. ఈ సినిమాలు కూడా హిందీలో సక్సెస్ అయితే…బాలీవుడ్ వర్గాల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి…

Related Posts