ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్ తర్వాత అంత దమ్మున్న సినిమాలేంటీ..?

ప్రతి ముఫ్ఫైయేళ్లకు బ్రతుకు తాలూకూ ఆలోచన మారుతుంది. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కలా అనుకుంటారు అని చెప్పి సినిమావాళ్లు ట్రెండ్ అంటారు అన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాలోని డైలాగ్ తో. సినిమా వారి విషయంలో మార్పును ట్రెండే అంటారు కానీ.. మరీ ముప్ఫైయేళ్ల వరకూ ఉండదు ఇది. ఓ ఐదారేళ్లు.. మరీ అనుకుంటే ఓ పదేళ్లు. పదేళ్ల క్రితం ఇండియన్ సినిమా రూపు రేఖలు ఇప్పుడు లేవు. దీన్నే కొత్త ట్రెండ్ అంటున్నారు. ఆ ట్రెండ్ ను మొదలుపెట్టింది బాహుబలి. కంటిన్యూ చేసింది.. కెజీఎఫ్, ఆర్ఆర్ఆర్. దీన్ని ఇప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమా అంటున్నారు. పైగా ఎన్నాళ్లుగానో సాధ్యం కానీ.. నార్త్ మార్కెట్ ను ఈ మూడు సినిమాలూ దున్నేస్తున్నాయి. మరి ఇది ఎక్కడి వరకూ వెళుతుంది..? కంటిన్యూ చేసే సత్తా ఉన్న తర్వాతి సినిమాలేంటీ..? అంటే సమాధానం అంత సులవుగా రాదు.

బాహుబలి వచ్చినప్పుడు కూడా ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాదు. రాజమౌళి ఏమనుకున్నా.. దేశం తెలుగు సినిమాగానే చూసింది. కానీ రిలీజ్ తర్వాత సీన్ మారింది. బాహుబలి హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో కంట్రీ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది. అంతే రాజమౌళిన్నామ స్మరణ మొదలుపెట్టింది బాలీవుడ్. ఆ స్మరణను సెకండ్ పార్ట్ తో కలిపి దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు రాజమౌళి. తర్వాత అతను ఆర్ఆర్ఆర్ మొదలుపెట్టాడు. కానీ అంతకు ముందే అతని సలహా మేరకే కన్నడ సీమ నుంచి కెజీఎఫ్ రూపంలో మరో ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ వచ్చింది. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ తో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు రాజమౌళి. దీంతో ప్రతి వాళ్లూ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనే మాటను సులువుగా వాడేస్తున్నారు.

ఇప్పుడు కెజీఎఫ్ కు రెండో భాగం వస్తోంది. ఊహించినట్టుగానే భారీ అంచనాలున్నాయీ ప్రాజెక్ట్ పై. అయితే.. కెజీఎఫ్ సెకండ్ చాప్టర్ తర్వాత ఆ ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను కంటిన్యూ చేసే సత్తా ఉన్న సౌత్ సినిమాలేంటీ అంటే మాత్రం ఖచ్చితంగా సమాధానం స్పష్టంగా రాదు.
అంతా అనుకుంటున్నట్టుగా బీస్ట్ కు ప్యాన్ ఇండియన్ అంత సీన్ లేదు. కేవలం సౌత్ లో సత్తా చాటొచ్చు. దానికి కూడా కెజీఎఫ్ అడ్డుగా ఉంటోంది. ఇక తర్వాత వచ్చేది ఆచార్య. బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆచార్యకు నార్త్ లో ఆదరణ రాదు. ఆ విషయం అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న సైరా చూస్తే తెలుస్తుంది. మన దగ్గర ఆహా ఓహో అన్నా.. అక్కడే కాదు.. ఇతర భాషల్లో కూడా తేలిపోయింది. ఆ ఎఫెక్ట్ ను రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి కాస్త తగ్గినా ఫైనల్ గా కంటెంటే ఇంపార్టెంట్. కొరటాల శివ సినిమాల్లో ఆ రేంజ్ కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయలేం. పైగా ఇది ఓ సంక్లిష్టమైన కథగా కనిపిస్తోంది.

ఇక మే నెలలో వస్తోన్న చిత్రాల్లో సర్కారువారి పాట కనిపిస్తున్నా.. మహేష్ కు ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఇప్పటి వరకూ లేదు. సో.. ఇది కెజీఎఫ్ హవాను కంటిన్యూ చేస్తుందని చెప్పలేం. ఉన్నంతలో మే చివరి వారంలో వస్తోన్న మేజర్ మాత్రం కొంత ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అది రికార్డులు బ్రేక్ చేసే దమ్మున్న సినిమానా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం.

కొంతలో కొంత జూలై 29న మరో ప్యాన్ ఇండియన్ సునామీ వచ్చే అవకాశం ఉంది. అది ప్రభాస్ సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతాయి. ఆల్రెడీ ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. కానీ అంతలోనే సాహో, రాధేశ్యామ్ రూపంలో షాకులు తిన్నాడు. ఆ షాకులు పోయి ఆ తర్వాతి ప్రాజెక్ట్స్ కు మళ్లీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో మంచి బిజినెస్ జరగాలంటే సలార్ సత్తా చాటాలి. లేదంటే ఫ్యూచర్ లో ప్యాన్ ఇండియన్ స్టార్ అనే ట్యాగ్ కు రిపేర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

అటుపై ఆగస్ట్ లో వచ్చే సినిమాల్లో లైగర్ గురించి తెగ చెప్పుకుంటున్నారు కానీ.. విజయ్ దేవరకొండకు తెలుగులోనే ఓ మరీ అంత గొప్ప క్రేజ్ లేదు. బాలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండగా ఉంది కాబట్టి.. ప్రమోషన్స్ వరకూ పనిచేస్తుంది కానీ.. ఓపెనింగ్స్ తెచ్చుకునేంత సత్తా విజయ్ లో ఉందని ఖచ్చితంగా చెప్పలేం. అప్పటి వరకూ వీళ్లది వాపే కానీ.. బలుపు అనుకోలేం.

ఇక మధ్యలో వచ్చే చిత్రాలన్నీ ప్రాంతీయంగా ఆకట్టుకునేవే తప్ప.. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో దుమ్ము రేపుతాయి అనేవి ఒక్కటీ కనిపించడం లేదు. ఒకవేళ కనిపిస్తే అది వారి లక్ అనే చెప్పాలి. లేదా బలమైన యూనివర్సల్ కంటెంట్ మహిమ అవుతుంది.

అందువల్ల.. ఇప్పటి వరకూ చెప్పుకున్న ఈ ప్యాన్ ఇండియన్ సినిమా అనే ట్రెండ్ ను కంటిన్యూ చేసే సినిమాలు ఇకపై రెండు మూడు తప్ప కనిపించడం లేదు. మళ్లీ ఈ ట్రెండ్ కు ఆ ఊపు రావాలంటే రాజమౌళి తప్ప వేరే మార్గం లేదా లేక మరెవరైనా ఈ ట్రెండ్ లైట్ ను ముందుకు తీసుకువెళతారా అనేది చూడాలి. ఒకవేళ లేదూ అంటే మాత్రం ఈ ట్రెండ్ ఆగిపోయి మరో కొత్త ట్రెండ్ కు ఇండస్ట్రీ ప్రిపేర్ అవడం బెటర్ అని చెప్పొచ్చు.

Related Posts