పూరీకి హీరో, విజయ్ కి దర్శకుడు కావలెను

ఒక్క ఫ్లాప్ ఎంత పని చేసింది. ఏకంగా ఇద్దరు స్టార్స్ ను సరికొత్త వేటలో పడేసింది. మొన్నటి వరకూ స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు డిజాస్టరస్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెబితే అతను ఎప్పుడో ఫామ్ కోల్పోయాడు. మధ్యలో వచ్చిన టెంపర్ కాస్త ఫర్వాలేదనిపించుకుంది అంతే. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా అది అతని మార్క్ స్టఫ్ కాదు. ఆ విజయాన్ని చూపించుకునే లైగర్ తో భారీ సినిమాకు ప్లాన్ చేసి.. తలా తోక లేని కథ, కథనంతో ఆడియన్స్ ను చిరాకు పెట్టి హీరోకూ డిజాస్టర్ ఇచ్చాడు. ఈ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ పరిస్థితి మరీ దారుణం అయింది.

అతను ఇప్పటికే మూడు ఫ్లాపులతో ఉంటే ఇది నాలుగోది అయ్యింది. దీనికి తోడు ఈ సినిమా టైమ్ లో చేసిన ఓవరాక్షన్ కూడా తోడై మరింత ఇబ్బంది పెడుతోంది. అతని చేతిలో ప్రస్తుతం ఖుషీ సినిమా మాత్రమే ఉంది. అదీ అటూ ఇటైనా దిల్ రాజు బ్యానర్ కు ఓ సినిమా బాకీ ఉన్నాడు. ఇక ఈ సినిమానే విజయ్ కి పెద్ద దిక్కవుతుంది. ఖుషీ హిట్ అయినా.. మేజర్ షేర్ సమంతకే వెళుతుంది. దర్శకుడు శివ నిర్వాణ సినిమా అంటే మాగ్జిమం తెలుగు ఆడియన్స్ కే పరిమితం అవుతుంది.


విజయ్ దేవరకొండకు దిల్ రాజు రూపంలో నిర్మాత ఉన్నాడు. కానీ అతనికి సాలిడ్ హిట్ ఇచ్చే దర్శకుడు లేడు. కథ కూడా సిద్ధంగా లేదు. ప్రస్తుతం హరీశ్ శంకర్ తో సినిమా చేయించేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు అని వినిపిస్తోంది. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేం. సో.. ఇప్పటికీ విజయ్ దేవరకొండ కోసం దర్శకుడి వేట సాగుతోంది.


ఇక ఇటు పూరీ జగన్నాథ్ పరిస్థితి మరీ దారుణం. దర్శకుడుగానే కాదు.. నిర్మాతగానూ లాస్ అయ్యాడు. దీంతో ఆ మధ్య హడావిడీగా మొదలుపెట్టిన జనగణమన ఆగిపోయింది. అర్జెంట్ గా ఇప్పుడు చిన్న సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తే తప్ప పనవదు. బట్ చిన్న సినిమా చేయడానికైనా ఓ హీరో కావాలి కదా..? ఒకప్పుడు పూరీ డైరెక్షన్ లో నటిస్తే చాలు అనుకున్న స్టార్ హీరోల తరం ఉంది. ఇప్పుడు అతనితో సినిమా అంటే అంతే సంగతులు అనుకుంటోన్న నవతరం కనిపిస్తోంది. అందుకే పూరీ కూడా హీరోకోసం చూస్తూ ఖాళీగా ఉన్నాడు. ఇక కథంటారా.. పూరీ కథలు చెప్పడం మానేసి చాలా రోజలవతోంది కదా.. ఏదో ఒకటి నెట్టుకొస్తాడు. కానీ హీరోనే ఇప్పుడు అసలు ప్రాబ్లమ్.


ఏదేమైనా లైగర్ ఇచ్చిన షాక్ కు హీరోకు దిమ్మ తిరిగితే దర్శకుడికి బొమ్మ కనబడింది. ఇక మరో నిర్మాతైతే అసలు కనిపించకుండా పోయింది. అదీ లైగర్ పంచ్.

Related Posts