సంక్రాంతి స్లాట్ ను త్యాగం చేసి.. ఫిబ్రవరిలో సోలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ సీక్వెల్ మూవీ ‘టిల్లు స్క్వేర్‘ను పోస్ట్ పోన్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి బరిలో వస్తోన్న ‘గుంటూరు కారం‘ని నిర్మించిన నిర్మాతల నుంచే ‘టిల్లు స్క్వేర్‘ వస్తోంది. ‘ఈగల్‘ సంక్రాంతి నుంచి తప్పుకున్నందుకు.. దిల్ రాజు చేసిన అడ్జస్ట్ మెంట్ ఇది. అయితే.. ఇప్పటివరకూ ‘టిల్లు స్క్వేర్‘ పోస్ట్ పోన్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
‘టిల్లు స్క్వేర్‘తో పాటు.. మరో సీక్వెల్ మూవీ ‘యాత్ర 2‘ నుంచి కూడా ‘ఈగల్‘కి గట్టి పోటీయే ఎదురుకాబోతుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పొలిటికల్ బయోపిక్ ఫిబ్రవరి 8న విడుదలకానుంది. 2019 ఎన్నికలను టార్గెట్ చేస్తూ.. ఆ యేడాది ఫిబ్రవరి 8న ‘యాత్ర‘ సినిమా రిలీజయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తూ.. ఈ ఫిబ్రవరి 8కి ‘యాత్ర 2‘ వస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు.
ఈ రెండు సినిమాలు చాలవన్నట్టు.. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన‘ చిత్రం కూడా ఫిబ్రవరి 9నే విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. ఈ చిత్రం రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని కరాఖండిగా చెబుతున్నారు. మొత్తంమీద.. సంక్రాంతి నుంచి తప్పుకున్నా.. ‘ఈగల్‘కి సోలో రిలీజ్ అయితే దక్కేలా లేదు.