మీడియాని హెచ్చరించిన తెలుగు ఫిలిం ఛాంబర్

కొన్ని సోషల్ మీడియా వెబ్ సైట్స్, ఇతర మీడియా కావాలనే సంక్రాంతి టైములో వాళ్ల రేటింగ్స్, టి.ఆర్.పి. ల కోసం ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య, హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఓ ప్రెస్ నోట్ జారీ చేసింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు, థియేటర్ల వివాదాలపై 15 రోజుల క్రితమే మీటింగ్ పెట్టామని.. అప్పుడు సహృదయంతో.. సంక్రాంతి బరిలో పోటీని తగ్గించేందుకు ‘ఈగల్‘ సినిమాని వాయిదా వేయడం జరిగిందని ఈ నోట్ లో పేర్కొన్నారు. ‘ఈగల్‘ తో పాటు సంక్రాంతి బరిలోనే రావాల్సిన అనువాద సినిమాలు ‘లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, అయలాన్‘ లను కూడా వాయిదా వేయించామని తెలిపింది ఫలిం ఛాంబర్ .

అయితే.. ఇండస్ట్రీలోని హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ సహకరిస్తోన్న ఈ సమయంలో కొన్ని వెబ్ సైట్స్, ఇతర మీడియా వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఆర్టికల్స్ రాసే ముందే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ని సంప్రదించి.. నిజానిజాలు తెలుసుకుని వార్తలు రాయాల్సిందిగా ఈ ప్రెస్ నోట్ లో ప్రస్తావించింది ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.

ఈ లేఖను ప్రతి జర్నలిస్ట్ అసోసియేషన్ కి, మీడియా అసోసియేషన్ కి వారి యాజమాన్యాలకు పంపడం జరుగుతుందని.. పరిశ్రమ పుట్టినప్పటి నుండి తెలుగు సినీ పరిశ్రమకు మీడియాతో అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకమీదట ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసే వారి పైన తెలుగు జర్నలిస్ట్, మీడియా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా యావత్ తెలుగు సినీ పరిశ్రమ తరపున కోరడమైందని ఈ లేఖలో ప్రస్తావించారు.

Related Posts