రిపబ్లిక్ డే ని టార్గెట్ చేసిన డబ్బింగ్ మూవీస్

సంక్రాంతి తర్వాత మళ్లీ రిపబ్లిక్ డే కానుకగా సినిమాల జాతర మొదలవ్వబోతుంది. అయితే.. ఈసారి రిపబ్లిక్ డే స్లాట్ లో తెలుగు నుంచి పెద్దగా సినిమాలు లేకపోయినా.. అనువాద రూపంలో పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో తమిళం నుంచి ‘తంగలాన్‘, హిందీ నుంచి ‘ఫైటర్‘ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

విలక్షణ నటుడు విక్రమ్ నట విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించబోతున్న చిత్రం ‘తంగలాన్‘. విక్రమ్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో కనిపించబోతున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ నిర్మిస్తోంది. బ్రిటిషర్స్ పాలిస్తున్న సమయంలో జరిగిన కొన్ని ఊహాజనితమైన కథాంశాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడట పా.రంజిత్. ఈ మూవీలో పార్వతి, మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ‘తంగలాన్‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపిక పదుకొనె ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఫైటర్‘. ఈ మూవీలో వీరిద్దరూ ఫైటర్ పైలట్స్ గా కనిపించబోతున్నారు. వీరితో పాటు అనిల్ కపూర్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ‘వార్, పఠాన్‘ మూవీస్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ గత చిత్రం ‘పఠాన్‘ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించింది. దానికి తోడు ఈ సినిమాకి హృతిక్, దీపిక స్టార్ పవర్ కూడా కలిసింది. దీంతో.. ‘ఫైటర్‘ పై తెలుగులోనూ మంచి అంచనాలున్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటు.. సంక్రాంతికే రావాల్సిన అనువాద చిత్రాలు ‘అయలాన్, కెప్టెన్ మిల్లర్‘ కూడా రిపబ్లిక్ డే స్లాట్ నే టార్గెట్ చేస్తాయనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మొత్తంమీద.. రాబోయే రిపబ్లిక్ డే స్పెషల్ గా తెలుగు రాష్ట్రాల్లో అనువాద చిత్రాల జోరు ఓ రేంజులో ఉండబోతుందన్నమాట.

Related Posts