జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ బయోగ్రఫీ

ప్రకాష్ రాజ్.. ఈ ఐదక్షరాలు చాలు నటనలోని విభిన్న పార్శ్వాలను పరిచయం చేయడానికి. ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే.. ఓ విలక్షణ నటుడు మన కళ్లముందు సాక్షాత్కరిస్తాడు. పేరుకు కన్నడ వాడైనా.. తెలుగు వారు ప్రకాశ్ రాజ్ ను తమ వాడే అనుకునేంతగా టాలీవుడ్ లో పాతుకుపోయాడు. అలాగే.. తమిళులు కూడా ప్రకాష్ ను అంతగానే ఓన్ చేసుకున్నారు. ఇక.. హిందీలోనూ తనదైన మార్క్ చూపించాడు. ఏ భాషలో నటించినా.. ఆ భాషలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఆయా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు ప్రకాష్ రాజ్.

యాక్టింగ్ పవర్ హౌస్ ప్రకాష్ రాజ్.. 1965, మార్చి 26న బెంగళూరులో జన్మించాడు. తండ్రి తుళువ, తల్లి కన్నడ. ప్రకాష్ రాజ్ సోదరుడు ప్రసాద్ రాజ్ కూడా నటుడు. సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్‌ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ప్రకాష్ రాజ్.. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. బెంగళూరులోని కళాక్షేత్రలో స్టేజ్ షోలలో నటించాడు. అప్పుడు అతనికి నెలకు రూ.300 వచ్చేవి. ప్రకాష్ రాజ్ దాదాపు 2,000 స్ట్రీట్ థియేటర్ ప్రదర్శనలు ఇచ్చాడంటే ఆశ్చర్యం కలగకమానదు.

ముందుగా టెలివిజన్ లో యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత ‘రామాచారి , రణధీర , నిష్కర్ష, లాకప్ డెత్’ వంటి కన్నడ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఆ సినిమాలలో చేసినవి చిన్న పాత్రలే అయినా.. ప్రకాష్ రాజ్ నటన, డైలాగ్ డెలివరీకి మంచి పేరొచ్చింది. ఈకోవలోనే కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ నటించిన ‘హరకేయ కురి’లో అద్భుతమైన పాత్ర దక్కింది. ఈ సినిమాలే ప్రకాష్ ని తమిళ వెటరన్ డైరెక్టర్ కె. బాలచందర్‌ దృష్టిలో పడేటట్టు చేశాయి.

కన్నడ చిత్రాలలో ప్రకాష్ రాజ్ పేరు ప్రకాష్ రాయ్ అని పడేది. అయితే.. బాలచందర్ ‘డ్యూయెట్’ సినిమాకోసం ప్రకాష్ రాయ్ ని కాస్తా ప్రకాష్ రాజ్ గా మార్చారు. 1997లో మణిరత్నం తీసిన పొలిటికల్ బయోపిక్ ‘ఇద్దరు’లో కరుణానిధి పాత్రకు ఎంపికయ్యాడు ప్రకాష్ రాజ్. ఎమ్.జి.ఆర్, కరుణానిధి కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ పోషించిన కరుణానిధి పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలోని నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.

మరోవైపు అదే సమయంలో మలయాళం చిత్ర పరిశ్రమకు, తెలుగు ఇండస్ట్రీకి సైతం ప్రకాష్ ఎంట్రీ ఇచ్చాడు. 1996లో అనేక మలయాళ చిత్రాలలో నటించాడు. ఇక.. 1995లోనే ఎ.ఎమ్.రత్నం దర్శకత్వంలో రూపొందిన ‘సంకల్పం’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఆలీ హీరోగా నటించిన ‘గన్ షాట్’ చిత్రంతో ప్రకాష్ రాజ్ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘పవిత్రబంధం, సుస్వాగతం, హిట్లర్’ ఇలా తెలుగులో తన సినిమా ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగించాడు.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ‘అంతఃపురం’లో ప్రకాష్ రాజ్ పోషించిన నరసింహ పాత్రకు వచ్చిన అప్లాజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని తన నటనకు గానూ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు. ‘అంతఃపురం’ తర్వాత అప్పటి యంగ్ డైరెక్టర్స్ కి మొదటి ఆప్షన్ గా మారాడు ప్రకాష్ రాజ్. తెరపై ఎలాంటి తరహా పాత్ర పోషించాలన్నా.. ప్రకాష్ రాజ్ వాళ్లకు ఓ ఆయుధంలా దొరికాడు. ఆ దర్శకులు ఊహించుకున్న పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసే నటుడిగా ప్రకాష్ రాజ్ నిలిచాడు.

1995లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు.. ఇప్పటికీ అదే స్పీడుతో ఎన్నో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు ప్రకాష్ రాజ్. తరాలు మారుతున్నా తరగని ప్రేక్షకాభిమానంతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే ఉన్నాడు. ఓవైపు సినిమా, మరోవైపు వెబ్ దునియా రెండింటిలోనూ తన సత్తా చాటుతూనే ఉన్నాడు.

ప్రకాష్ రాజ్ మల్టీటాలెంటెడ్ పర్సన్.. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగానూ సినీ ఇండస్ట్రీకి ఆయన చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 2002లో తమిళ చిత్రం ‘దయా’తో నిర్మాతగా మారిన ప్రకాష్ రాజ్.. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల వరకూ నిర్మించాడు. ఇక.. డైరెక్టర్ గానూ అరడజను సినిమాలు ప్రకాష్ రాజ్ కిట్టీలో ఉన్నాయి.

అవార్డుల విషయానికొస్తే తన మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు ప్రకాష్ రాజ్ ని వరించాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎనిమిది సార్లు నంది అవార్డులు అందుకున్నాడు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు.. ఉత్తమ సహాయ నటుడిగా, స్పెషల్ జ్యూరీ, స్పెషల్ మెన్షన్ అంటూ ఐదు జాతీయ అవార్డులను తన కిట్టీలో వేసుకున్నాడు.

SINGAPORE – JUNE 09: Prakash Raj wins the award for Performance for Negative Role at the 2012 International India Film Academy Awards at the Singapore Indoor Stadium on June 9, 2012 in Singapore. (Photo by Suhaimi Abdullah/Getty Images)

ప్రకాష్‌ పలు వివాదాల్లో సైతం చిక్కుకున్నాడు. ఆయనపై గతంలో ఆరుసార్లు తెలుగు సినీ నిర్మాతలు నిషేధం విధించారు. పవన్ కళ్యాణ్ ‘జల్సా ‘, ఎన్టీఆర్ ‘కంత్రి’, అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాల షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ పై కంప్లైంట్స్ వచ్చాయి. అలాగే ‘ఒంగోలు గిత్త’ సినిమాలోని ఓ సీక్వెన్స్‌లో నగ్నంగా కనిపించడంపైనా వివాదం నెలకొంది. అజయ్ దేవగన్ తో నటించిన హిందీ చిత్రం ‘సింగమ్’లోని ఒక సన్నివేశంలో ప్రకాష్ చెప్పిన కొన్ని డైలాగ్‌ లు కన్నడిగులను కించపరిచేలా ఉన్నాయని భావించినందుకు అనేక కన్నడ సంస్థలు థియేటర్ల ముందు నిరసనలు తెలిపాయి .

ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడు కూడా. 2017లో తన స్నేహితురాలు గౌరీ లంకేష్ హత్య ఘటన తర్వాత సోషల్ మీడియాలో #justasking అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రకాష్ రాజ్ తన క్రియాశీల రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాడు . 2019 భారత సాధారణ ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు . అయితే.. ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పటికీ సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ, సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు.

ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 1994లో లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు మేఘన, పూజ. సిద్ధు అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే.. అతను ఐదు సంవత్సరాల వయస్సులో గాలిపటం ఎగురవేస్తుండగా కిందపడిపోవడంతో మరణించాడు. ప్రకాష్ రాజ్ – లలిత కుమారి జంట 2009లో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను వివాహం చేసుకున్నాడు. వీరికి 2015లో వేదాంత్ జన్మించాడు. ఈ ఏడాది తెలుగులో ‘గుంటూరు కారం’లో కనిపించిన ప్రకాష్ రాజ్.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ఎన్టీఆర్ ‘దేవర’, ధనుష్ ‘రాయన్’ వంటి పలు క్రేజీ మూవీస్ తో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నాడు. ఇంకా.. పలు భాషల నుంచి మరెన్నో సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.

Related Posts