నట ప్రపూర్ణ మోహన్ బాబు బయోగ్రఫీ

భారతదేశం గర్వించదగ్గ నటులలో మోహన్ బాబు ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు మోహన్ బాబు. హీరోగా ప్రస్థానాన్ని ప్రారంభించినా.. మెయిన్ విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా.. మోహన్ బాబు చేయని పాత్రంటూ లేదు. సోషల్ మూవీస్ లోనే కాకుండా.. హిస్టారికల్, ఫోక్ లోర్, మైథలాజికల్ ఇలా.. అన్ని తరహా జానర్స్ లోనూ అదరగొట్టిన ఘనత మోహన్ బాబు సొంతం.

మార్చి 19, 1952తిరుపతి సమీపంలోని మోదుగులపాలెంలో జన్మించారు మోహన్ బాబు. అసలు పేరు భక్తవత్సలం నాయుడు. మధ్య తరగతి కుటుంబం. ఆ కుటంబ బాధ్యతలు పంచుకోవడానిక చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడి నుంచి పరిశ్రమవైపు అడుగులు వేశారు. ఆదిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. ఆనక ఆయన విగ్రహం చూసిన చాలామంది నటనవైపు ప్రోత్సహించారు. అలా చిన్న పాత్రలతో మొదలై.. తనే పెద్ద సామ్రాజ్యంగా మారారు మోహన్ బాబు.

దాసరి పరిచయానికి ముందు కొన్ని ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించారు. బట్ దాసరి రూపొందించిన ‘స్వర్గం నరకం‘ మోహన్ బాబు పెద్ద పాత్రలో కనిపించిన తొలి చిత్రం. అది సూపర్ హిట్ కావడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కూడా దాసరిగారే మోహన్ బాబును బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే ఎప్పటికీ ఆయన్ని గురువుగా సంబోధిస్తూ.. భక్తిని చాటుకుంటారు మోహన్ బాబు. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాల్లో మోహన్ బాబు నటన అసమానంగా ఉంటుంది.

మాటలను తూటాల్ల ప్రయోగిస్తూ నాయకుడైనా, ప్రతినాయకుడైనా శెభాష్ అనిపించడం మోహన్ బాబుకే సొంతమైన ప్రతిభ. మంచు ఆయన ఇంటి పేరు. మాట కరుకు.. మనసు వెన్న. అందుకే మోహన్ బాబు మాటలు కొన్నిసార్లు నొచ్చుకునేలా అనిపించినా.. తరచి చూస్తే తప్పక మెచ్చుకుంటారు. ఓ రకంగా తనతోటి తరం నటులందరి నుంచి మోహన్ బాబును వేరు చేసి చూపించేది ఈ క్రమశిక్షణతో కూడిన స్వభావమే అనుకోవచ్చు..

ఓ దశలో మోహన్ బాబుకు పాత్రల పరంగా కొంత పోటీ ఎదురైంది. అలాగే తన ప్రతిభకు తగ్గ పాత్రలు కూడా పడటం లేదనే అంతర్మథనం మొదలైంది.. దీనికి తోడు తనూ హీరోగా రాణించగలననే నమ్మకం ఉంది. కానీ తనను హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాత కనిపించలేదు. దీంతో ప్రతిభను నిరూపించుకునేందుకు తనే నిర్మాతగా మారారు మోహన్ బాబు. కూతురు పేరు మీదుగా 1982లో తను అన్నగా కొలిచే ఎన్టీ రామారావు చేతుల మీదుగా.. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ను స్థాపించాడు. ఈ బ్యానర్ లోనిర్మించిన తొలి సినిమా ప్రతిజ్ఞ. ఇది సూపర్ హిట్ కావడంతో ఇక హీరోగానే కొనసాగేందుకు డిసైడ్ అయ్యారు.

అదే యేడాది చిరంజీవితో కలిసి చేసిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా’ కూడా సూపర్ హిట్ గా నిలిచి.. ఆడియన్స్ కు మోహన్ బాబులోని హీరో యాంగిల్ ను చూపించాయి.. చాలా వరకూ బయటి చిత్రాల్లో చేస్తూనే సొంత బ్యానర్ లోనూ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. దీంతో నటుడిగానే కాదు.. అభిరుచి ఉన్న నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్నారు.

సొంత బ్యానర్ లో వరుసగా ‘ధర్మపోరాటం, పద్మవ్యూహం, భలేరాముడు, రగిలే గుండెలు, ఏడడుగుల బంధం, నా మొగుడు నాకే సొంతం‘ వంటి విజయవంతమైన సినిమాలు చేసి నిర్మాతగానూ నిరూపించుకున్నారు. అయితే అప్పటి వరకూ మోహన్ బాబులోని విలనీ యాంగిల్ ఎక్కడో ఆయన్ని పెద్ద హీరోగా అంగీకరించేందుకు ఇబ్బంది పడేలా చేసింది.. అయినా తనదైన శైలిని వీడక తనూ పెద్ద హీరోనే అనే నమ్మకాన్ని వదలక ప్రయాణాన్ని సాగించారు.

నిర్మాతగా మారి హీరో అయ్యారు.. హీరోగా చేస్తూనే విలన్ గానూ చేశారు.. అయినా మోహన్ బాబు స్టార్ హీరో అంటే కొందరికి డౌట్ గానే ఉండేది. ఆ డౌట్స్ పటాపంచలు చేసిన సినిమా ‘అల్లుడుగారు‘. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీతో మోహన్ బాబు స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. అద్భుతమైన నటనకు తోడు రాఘవేంద్రుని కథన మాయాజాలం ఈ సినిమాను అఖండ విజయం చేశాయి. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టి టాలీవుడ్ నయా కలెక్షన్ కింగ్ గా అవతరించారు.

మోహన్ బాబులోని డైనమిజాన్ని.. డైలాగ్ పవర్ ను నెక్ట్స్ లెవెల్ లో ఉపయోగించుకున్న దర్శకుడు బి. గోపాల్. కామిక్ యాంగిల్ ను చూపుతూనే డైనమిక్ హీరోగా మాస్ పాత్రలో మోహన్ బాబు చేత వండర్ అనిపించే పాత్ర చేయించాడు.. అది ఆయన కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. అదే ‘అసెంబ్లీ రౌడీ‘. మోహన్ బాబు గురించి మాట్లాడితే ‘అసెంబ్లీ రౌడీ‘ లేకుండా ఆ ప్రస్థావన ఎప్పటికీ పూర్తి కాదు. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ మాటలకు తనదైన మ్యానరిజాన్ని జోడించి మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ కు ఆ రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి..

అదే యేడాది మరో బ్లాక్ బస్టర్ ‘రౌడీగారి పెళ్లాం‘ ఆ తర్వాతి యేడాది ‘బ్రహ్మ‘ సూపర్ హిట్.. ఇలా తన కెరీర్ ను తనే నిర్మించుకుని స్వయంకృషితో శిఖరానికి చేరారు మోహన్ బాబు. ఓ రకంగా చెప్పాలంటే తనే నిర్మాతగా కెరీర్ ను నిర్మించుకుని ఆ స్థాయికి చేరిన హీరోలు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. కనిపించినా వారంతా మోహన్ బాబు తర్వాతే ఉంటారు.

మోహన్ బాబు కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే స్పెషల్ గా నిలిచిన మరో సినిమా ‘మేజర్ చంద్రకాంత్‘. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే ఆయన్నే ప్రధాన పాత్రలో తీసుకుని చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైమ్ లో చేసిన ఈ సినిమా సాధించిన విజయం టాలీవుడ్ ను మెస్మరైజ్ చేసింది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన మేజర్ చంద్రకాంత్ చాలా కేంద్రాల్లో 175రోజులు ఆడింది. అన్నగారికి కూడా ఇదే చివరి బ్లాక్ బస్టర్ కావడం మరో విశేషం..

అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు ఫేస్ చేసిన తర్వాత ‘పెదరాయుడు‘తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. తర్వాత అడవిలో అన్న, కలెక్టర్ గారు వరుస హిట్లు కొట్టారు. అయితే అప్పటికే కొత్తతరం హీరోల వెల్లువ ప్రారంభమైంది. ఇండస్ట్రీలోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అసలే ఆలస్యంగా హీరో అయిన ఈ నట ప్రపూర్ణుడి కెరీర్ కొంత ఇబ్బంది పడింది. అందుకే ఆయన కెరీర్ లో పెదరాయుడే లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పక తప్పదు. మధ్యలో ఎన్ని సినిమాలు హిట్ అయినా.. దాన్ని మించే విజయం ఇంత వరకూ రాలేదు.

అప్పుడప్పుడూ తనూ నటిస్తూ.. కొన్ని సార్లు తనయుల సినిమాల్లో మెరుస్తూ.. వచ్చారు. ఓ దశలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు కూడా. అయినా కింది నుంచి విచ్చిన వాడు కదా.. మళ్లీ పైకి లేవడం ఎలాగో తెలుసు. అందుకే కాస్త ఓపిగా అన్ని పనులు సెట్ చేసుకుని తనయులిద్దరినీ సెటిల్ చేశారు. ఆ టైమ్ లో పూరీ జగన్నాథ్, రాజమౌళిల ‘బుజ్జిగాడు, యమదొంగ’ సినిమాలతో సరికొత్త టర్న్ తీసుకుని ప్రేక్షకుల్ని మురిపించారు.

మేస్త్రి, ఝుమ్మంది నాదం, రౌడీ, పాండవులు పాండవులు తుమ్మెద, మామ మంచు అల్లుడు కంచు, గాయత్రి, సన్ ఆఫ్ ఇండియా‘ ఇలా ఈ రెండు దశాబ్దాలలో కొన్ని సినిమాలు చేశారు మోహన్ బాబు. కానీ.. అవేమీ అంత భారీ విజయాలు సాధించలేదు. ప్రస్తుతం ఆయన తనయుడి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఉన్నది ఉన్నట్టుగా.. ముక్కు సూటిగా చెప్పేయడం మోహన్ బాబు నైజం.. ఈ నైజం ఆయనకు ఎన్ని ఇబ్బందులు తెచ్చినా క్రమశిక్షణ వీడని కమిట్మెంట్ ఉన్న నటుడు మోహన్ బాబు. వెండితెరపై ఎన్నో పాత్రలు చేసిన ఆయన నిర్మాతగానూ ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఐదువందల పై చిలుకు సినిమాల్లో నటించిన ఈ కలెక్షన్ కింగ్.. నిర్మాతగానూ తిరుగులేని విజయాలు అందుకున్నారు.

మోహన్ బాబు ప్రతిభ హిట్లూ ఫ్లాపులతో కొలిచేది కాదు. నటుడిగా ఆయన ప్రతిభ శిఖరమంత. ఏ పాత్రనైనా నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లగల నట వైదుష్యం ఆయన సొంతం. అయితే తెలుగు సినిమా పరిశ్రమ ఆయన ప్రతిభను వాడుకోవడం లేదు అనే చెప్పాలి. లేదంటే ఆయన స్థాయి క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా ఈ కలెక్షన్ కింగ్ కు దూరంగా వెళ్లారేమో. బట్.. ఇవాళా రేపూ వస్తోన్న చాలా సినిమాల్లో మోహన్ బాబు స్థాయి పాత్రలైతే కనిపించడం లేదు. ఓ రకంగా ఇది తెలుగు సినిమా స్థాయిని కూడా సూచిస్తుంది.

Related Posts