మెగా గ్యాంగ్ లీడర్ మళ్లీ వస్తున్నాడు

మెగాస్టార్ చిరంజీవి టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్ చెప్పమంటే ఎవరు ఎన్ని చెప్పినా.. అన్ని లిస్ట్ ల్లోనూ ఖచ్చితంగా ఉండే సినిమా గ్యాంగ్ లీడర్. ఈ మూవీలో ఆయన మాస్ లుక్ కు మెస్మరైజ్ కాని వారు లేరు. ఓ పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలంటే గ్యాంగ్ లీడర్ ఫస్ట్ బెస్ట్ మూవీగా చెప్పేయొచ్చు. ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిన సినిమా ఇది. బప్పీలాహిరి పాటలు నేటికీ సెన్సేషనే. అలాంటి సినిమాను మళ్లీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది..? తెలియని ఓ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది కదూ.. యస్.. గ్యాంగ్ లీడర్ మళ్లీ వస్తున్నాడు. అది కూడా ఈ కాలపు టెక్నాలజీకి అప్డేట్ అయ్యి..


గ్యాంగ్ లీడర్.. ఈ మూవీ గురించి ఎప్పుడు ఎంత చెప్పుకున్నా తక్కువే అనేలా ఉంటుంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మ్యూజిక్, రొమాన్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని అంశాలూ హండ్రెడ్ పర్సెంట్ సెట్ కావడం అనేది ఏ ఇండస్ట్రీలో అయినా అత్యంత అరుదుగా జరుగుతుంది. అది ఈ సినిమాలో జరిగింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 1991 మే 9న విడుదలైంది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. ఇక చిరంజీవి, విజయశాంతి మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. చిరంజీవి అన్నలుగా మురళీ మోహన్, శరత్ కుమార్ నటించారు. వీరి భార్య పాత్రల్లో సుధ, సుమలత కనిపిస్తారు. నాయనమ్మ పాత్రలో నిర్మలమ్మ నటన ఎప్పట్లానే అదిరిపోతుంది. విలన్స్ గా రావుగోపాలరావు, ఆనంద్ రాజ్ లు భయపెట్టేస్తారు.

చిరంజీవి ఫ్రెండ్స్ గా నటించిన వారితో సహా .. ప్రతిపాత్రకూ గుర్తింపు, ప్రత్యేకత ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించినా.. మెగాస్టార్ అప్పటికే తెచ్చుకున్న మాస్ ఇమేజ్ ను త్రిబుల్ చేసిందీ చిత్రం. ఆయన డ్యాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అలాగే చెయ్యి చూశావా ఎంత రఫ్‌ గా ఉందో.. రఫ్ఫాడిస్తా అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అయితే ఈ మూవీకి మరో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలాహిరిని చెప్పాలి. అప్పటికే బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఆయన ఈ మూవీకి అన్ని పాటలూ హిట్ అనే ఆల్బమ్ ఇచ్చాడు.

చిరంజీవి కూడా రామ్ చరణ్‌ రీమేక్‌ చేయాలంటే తన చిత్రాల నుంచి ఈ మూవీనే సజెస్ట్ చేయడం విశేషం. మొత్తంగా ఓ గొప్ప కమర్షియల్ సినిమా అనదగ్గ ఈ చిత్రాన్ని ఈ నెల 11న మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఆ తరానికి ఈ మూవీ గ్రేట్ నెస్ తెలుసు. ఇక ఈ తరానికి మెగాస్టార్ ఇప్పుడు ఈ స్టేజ్ లోకి రావడానికి కారణం ఏంటో మారోసారి అర్థం అవుతుందీ మూవీ చూస్తే. ఇంతకు ముందే సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ డేట్ ను ఫిబ్రవరి 11గా ఫిక్స్ చేశారు. మరి రీ రిలీజ్ లో ఈ గ్యాంగ్ లీడర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related Posts