లెజెండరీ క్లాష్.. పదోసారి సంక్రాంతి పోటీకి చిరంజీవి-బాలకృష్ణ

సంక్రాంతి సీజన్లలో కోడిపుంజుల్లా పోటీపడ్డ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి – బాలకృష్ణ. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి స్టార్ వార్ కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పలుమార్లు పోటీలో ఉన్నా.. సంక్రాంతి సీజన్ లో అయితే ఇప్పటివరకూ తొమ్మిది సార్లు తలపడ్డారు. తొలిసారి చిరు-బాలయ్య మధ్య సంక్రాంతి వార్ 1985లో జరిగింది. బాలకృష్ణ ‘ఆత్మబలం’ సినిమాతో చిరంజీవి ‘చట్టంతో పోరాటం’ పోటీలో నిలిచి పైచేయి సాధించింది. ఆ తర్వాత 1987 సంక్రాంతికి మరోసారి బాక్సాఫీస్ వార్ కొనసాగించారు. 1987లో సంక్రాంతికి మూడు రోజుల ముందుగానే వచ్చిన చిరంజీవి ‘దొంగ మొగుడు’ సూపర్ హిట్ అవ్వగా.. జనవరి 14 న విడుదలైన బాలకృష్ణ ‘భార్గవ రాముడు’ ఆశించిన విజయాన్నందుకోలేకపోయింది.

1987వ సంవత్సరంతో పాటు.. ఆ తర్వాతి సంవత్సరమైన 1988 సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ పోటీపడ్డారు. చిరంజీవి నటించిన ‘మంచి దొంగ‘, బాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ చిత్రాలు ఆ యేడాది సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. అయితే.. ఈసారీ చిరంజీవిదే పైచేయి అయ్యింది. తొమ్మిదేళ్ల పాటు సంక్రాంతి సమరానికి దూరంగా ఉన్న బాలయ్య-చిరు.. మళ్లీ 1997లో సంక్రాంతి బరిలో కోడిపుంజుల్లా తలపడ్డారు. వరుస ఫ్లాపులతో సతమతమైన చిరంజీవి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని.. 1997 సంక్రాంతికి ‘హిట్లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే యేడాది సంక్రాంతి బరిలో ‘పెద్దన్నయ్య’తో బాక్సాఫీస్ సమరానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ఇద్దరు చిత్రాలూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

1997 తర్వాత మరోసారి 2000వ సంవత్సరం సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య లు పోటీ పడ్డారు. 2000వ సంవత్సరం జనవరి 7న చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రంతోనూ.. బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ సినిమాతోనూ పోటీపడ్డారు. అయితే.. ఆ ఏడాది చిరంజీవి ‘అన్నయ్య‘ మంచి విజయాన్ని సాధించగా.. బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 2000వ సంవత్సరం సంక్రాంతి తర్వాత మళ్లీ 2001 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. అయితే.. 2001 సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి ‘మృగరాజు’ ఫ్లాపవ్వగా.. బాలకృష్ణ ‘నరసింహానాయుడు’ టాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టింది. ‘నరసింహనాయుడు’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చిరంజీవి కెరీర్ లోనే ఎక్కువ సంవత్సరాలు చిత్రీకరణలో ఉన్న సినిమా ‘అంజి’. ఆద్యంతం గ్రాఫిక్స్ మాయాజాలంతో రూపొందిన ఈ సినిమా 2004 సంక్రాంతి బరిలో విడుదలై కాస్ట్ ఫెయిల్యుర్ గా మిగిలింది. అదే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’ మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించాయి. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో మళ్లీ బాలయ్య-చిరు మధ్య సంక్రాంతి క్లాష్‌ కి పదమూడేళ్లు సమయం పట్టింది. 2004 తర్వాత మళ్లీ 2017లో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’.. బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. ఒక్కరోజు గ్యాప్ లో వచ్చిన ఈ రెండు సినిమాలూ ఘన విజయాలు సాధించాయి.

గత ఏడాది సంక్రాంతి బరిలో తొమ్మిదో సారి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఒక్కరోజు గ్యాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇక.. ఇప్పుడు వచ్చే సంక్రాంతి బరిలో పదోసారి పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు ఈ లెజెండరీ యాక్టర్స్. ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతి కానుకగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. లేటెస్ట్ గా బాలకృష్ణ కూడా బోయపాటితో చేయబోయే సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట.

Related Posts