మనసు లను బరువెక్కించే నెంజిక్కు నీది..

మనసు వెండితెరపై సందేశం ఇవ్వడం అంటే అంత సులువు కాదు. బలమైన కంటెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా కథనం రాసుకోవాలి. వీటన్నిటికీ మించి అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇన్ని కుదిరితే కానీ.. సందేశాత్మక చిత్రం అనిపించుకోదు. కానీ కొంతమంది ప్రయత్నం నిజాయితీగా ఉంటుంది. ఎంచుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పేస్తారు. దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దడం అనేది ఉండదు.జ అలాంటి సినిమాలు అత్యంత అరుదు. ఆ అరుదైన కోవలోకే వస్తుంది ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతోన్న నెంజిక్కు నీది అనే తమిళ్ సినిమా. ఓటిటిలో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీని చూడ్డం అంటే.. మనలోని మనిషితనాన్ని ఓ సారి తడిమి చూసుకోవడమే.రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థలోని ఆర్టికల్ 15 ప్రకారం మన దేశంలో న్యాయం కుల,మత, ప్రాంత, జాతి, పుట్టుకలను బట్టి కాక అందరికీ సమానంగా వర్తించాలి. కానీ నిజంగా అలా జరుగుతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అందుకు వ్యవస్థలోని అనేక కారణాలు కనిపిస్తాయి. అలాగే సామాజిక సమీకరణలూ దోహదం చేస్తాయి. ఈ సమీకరణల్లో అట్టడుగున ఉండే ప్రజలకు న్యాయం దొరకడం అత్యంత దుర్లభం. ఈ విషయాలన్ని బలమైన కథ, కథనాలతో చర్చించి చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించే సినిమా నెంజిక్కు నీది. అంటే హృదయానికో నీతి అని అర్థం.కొన్నాళ్ల క్రితం ఆయుష్మాన్ ఖురానా హీరోగా అనుభవ్ సిన్హా డైరక్ట్ చేసిన సినిమా ఆర్టికల్ 15. ఈ చిత్రాన్నే తమిళ్ లో నెంజిక్కు నీతిగా రీమేక్ చేశారు. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించాడు.

అరుణ్ రాజా కామరాజ్ తమిళ్ ఆడియన్స్ కు తగ్గట్టుగా మార్పులు చేసి డైరెక్ట్ చేశాడు. నెంజిక్కు నీది సినిమాను కథగా చూస్తే.. ఓ కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో పనిచేసే దళిత కమ్యూనిటీకి చెందిన ముగ్గురు అమ్మాయిలు తమకు 30 రూపాయలు కూలీ ఎక్కువ పెంచమని యజమానిని అడుగుతారు. ఫ్యాక్టరీ యజమాని చాలా పెద్దవాడు. చిన్నకులం వాళ్లంటే చిన్నచూపూ ఉన్న బలిసిన వ్యక్తి. దీంతో ఆ ముగ్గురినీ కిడ్నాప్ చేస్తాడు. ఒకమ్మాయి తప్పించుకుని పారిపోతే మిగిలిన ఇద్దరిపై లైంగిక దాడి చేసి చంపేసి వారి గూడెంలోనే చెట్టుకు ఉరి వేస్తారు. ఆ కేస్ ను విచారించడానికి వచ్చిన ఏఎస్పీకి సమాజంలో ఉన్న అసమానతలన్నీ కనిపిస్తుంటాయి. అనేక అవరోధాలు ఎదురవుతాయి. అన్నీ దాటుకుని ఆ అమ్మాయిలను హత్య చేసినవారికి చట్ట పరంగా శిక్షించాడా లేదా అనేది కథ.ఒక చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే అయినా కథనం కట్టిపడేస్తుంది. అడుగడునా సమాజంలోని అసమానతలు ఎంత దారుణంగా ఉన్నాయో చూపిస్తారు. అయితే ఇదంతా కావాలని చేసినట్టుగా కాక ప్రతి మనిషికీ ఏదో ఒక సందర్భంలో ఏదో రకంగా తెలిసిన విషయంగానే ఉంటుంది. ఇదే ఈ సినిమా స్క్రీన్ ప్లేలోని మ్యాజిక్. పైగా ప్రేక్షకుల్లోనూ చాలామంది భుజాలు తడుముకునేలా ఉంటుంది. ప్రతి కులంలోనూ బాధలుంటాయి. కానీ కులం వల్లే బాధలు వచ్చే జాతి కూడా ఉండటమే మన దగ్గర అసలు సమస్య అంటూ బలమైన డైలాగ్స్ కూడా కదిలిస్తాయి. మొత్తంగా తమిళ్ సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులకూ వందశాతం కనెక్ట్ అయ్యేలా కథనం ఉంటుంది. ఆ మధ్య వచ్చిన జై భీమ్ కు ఏ మాత్రం తగ్గని సినిమాగా ఈ నెంజిక్కు నీది చిత్రాన్ని చెప్పొచ్చు. సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీని చూస్తే మనిషితనం విలువల అర్థం అవుతుంది.

Related Posts