అందుకే.. బ‌న్నీ, సుక్కుల‌కు ఓ ద‌ణ్ణం పెట్టేశాను – చంద్ర‌బోస్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఇందులో మొదటి భాగం పుష్ప (ది రైజ్‌) క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో సంచలనం అయ్యింది. ఈ చిత్రంలోని దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దుమ్ము రేపుతున్న ఈ పాటల వెనుక సుకుమార్ చంద్రబోస్ దేవిశ్రీల సూపర్‌ కాంబో ఉందనేది మనకు తెలిసిందే. పుష్పలోని సాంగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులనీ మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడుతే.. పుష్ప అనే కాదు.. ప్రతి సినిమా సవాల్‌లాగే ఉంటుంది. సుకుమార్‌ స్వతహాగా కవి. చక్కటి కవిత్వం రాస్తుంటారు. కాబట్టి ఆయన సినిమాకి పాటలు రాయడమంటే అది మరింత సవాల్‌లా అనిపిస్తుంది. ఆయన్ని ఒప్పించేలా కాకుండా ప్రతి సందర్భంలోనూ మెప్పించేట్లు రాయాలని బలంగా నిర్ణయించుకుంటాను. అది ఆర్య నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా పూర్తి చేస్తూ వస్తున్నాను. రంగస్థలం తర్వాత నుంచి మా కలయికకు బాధ్యత పెరిగింది.

ఈ చిత్రంలోని ఓ మూడు సీన్లు సుకుమార్‌ నాకు చూపించారు. అది చూసి.. సుక్కుకు, అల్లు అర్జున్‌కు దణ్ణం పెట్టేశాను. ముఖ్యంగా పుష్ప పాత్ర కోసం బన్నీ ఎంతటి అంకిత భావంతో పని చేశాడో చూసి ఆశ్చర్యమేసింది. చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగిన ఆయన చిత్తూరు యాసను అంత అనర్గళంగా మాట్లాడుతుంటే నిర్ఘాంతపోయాను అన్నారు సాహిత్య చిచ్చ‌ర‌పిడుగు చంద్ర‌బోస్. అయితే.. ఆ మూడు సీన్లు ఏంటి అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

Related Posts