‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 15న ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలవ్వగా.. హైకోర్టు ఈరోజు (ఫిబ్రవరి 16) వరకూ స్టే విధించిన కారణంగా చిత్ర ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలంటూ న్యాయస్థానం చిత్రబృందాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సినిమా నిర్వహకులు.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్, అన్ని ధ్రువ పత్రాలను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్నీ సక్రమంగానే ఉన్నాయని.. సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చిచెప్పింది.
అసలు విషయమేమిటంటే సీఎం జగన్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ ఫిబ్రవరి 15 మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 16) విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో భాను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్స్ వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. హైకోర్టు ఆదేశాలతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ‘రాజధాని ఫైల్స్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది.