ఎనర్జిటిక్ స్టార్ కు అంత ఎనర్జీ ఉందంటారా..?

బడ్జెట్.. ఇది ఎప్పుడైనా హీరో మార్కెట్ ను బట్టే ఉంటుంది. పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవడంలో ఫస్ట్ ఫేస్ హీరోదే ఉంటుంది. కొన్నిసార్లు దర్శుడు కనిపిస్తాడు. ఈ ఇద్దరూ ఒకే సినిమాకు పనిచేస్తే నిర్మాత మరీ భయం పడకుండా బడ్జెట్ పెట్టేస్తుంటాడు. కానీ ఇప్పటి వరకూ యాభై కోట్ల సినిమా ఒక్కటి మాత్రమే ఉన్న హీరో కోసం ఏకంగా 180కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారంటే ఆశ్చర్యమే మరి. ఆశ్చర్యం సంగతి సరే.. ఇంతకీ అసలా హీరో ఎవరూ అంటారా..? రామ్.. ఎనర్జిటిక్ స్టార్ గా మంచి క్రేజ్ ఉన్న హీరో. కానీ కెరీర్ లో ఎప్పుడూ అతనికి విజయాలు స్థిరంగా లేవు. ఓ దశలో వరుస ఫ్లాపులు చూస్తాడు. ఆ వెంటనే అన్ని మర్చిపోయేలా ఓ సాలిడ్ హిట్ కొడతాడు. అతని రేంజ్ ఎప్పుడో మారాల్సి ఉన్నా.. ఇంకా మారలేదు అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా ఇస్మార్ట్ శంకర్ తో రెచ్చిపోయాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఊరమాస్ కుర్రాడిగా ఫస్ట్ టైమ్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ.. అదరగొట్టాడు. పూరీ స్టోరీ మరీ కొత్తది కాకపోయినా.. ఆ పాత కథలో కొత్త హీరో చేరాడు కాబట్టి ఏకంగా ఈ సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేసింది.

ఇస్మార్ట్ శంకర్ విజయం రామ్ కే కాదు.. పూరీకీ ధైర్యాన్నిచ్చింది. అతను ఏకంగా ప్యాన్ ఇండియన్ సినిమా లైగర్ చేసుకుంటున్నాడు. ఇటు రామ్ ఆ వెంటనే చేసిన రెడ్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో వారియర్ అనే బై లింగ్వుల్ మూవీ చేస్తున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే.. ఈచిత్రానికి ఇప్పటికే 70కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారట. ఇంకా కొంత షూటింగ్ ఉంది. అదో ఐదారు కోట్ల వరకూ ఉంటుందంటున్నారు. ఆపై ప్రమోషన్స్ ఉన్నాయి. ఎంత బై లింగ్వుల్ అయినా.. రామ్ కోసం ఇంత ఖర్చుపెట్టారంటే కంటెంట్ పై నమ్మకమా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది సినిమా వస్తే కానీ తెలియదు.కానీ ఇంతకంటే షాకింగ్ సినిమా మరోటి ఉంది.

వారియర్ తర్వాత రామ్ చేయబోయే సినిమా బోయపాటి శ్రీనుతో. రీసెంట్ గా అఖండతో అద్భుత విజయం అందుకున్నాడు బోయపాటి. ఈ సినిమా వంద కోట్లు దాటేసింది. ఆ నమ్మకం వల్లేనేమో.. రామ్ సినిమాకు ఏకంగా వంద కోట్ల వరకూ బడ్జెట్ కేటాయించారట. పైగా ఇది ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్ అంటున్నారు. మరి రామ్ సోలోగా ఆ మొత్తాన్ని రాబట్టడం కాస్త కష్టం అనుకుంటే.. బోయపాటి మిగతా కష్టం నుంచి గట్టెక్కిస్తాడనేది నిర్మాతల నమ్మకం కావొచ్చు. ఏదేమైనా బడ్జెట్ కథా పరిమితుల్లో ఉంటే ఇలాంటివి రాబట్టడం కష్టమేం కాదు. కానీ కేవలం భారీ బడ్జెట్ అనే మాట కోసం వాడితే ఆ తర్వాత నిర్మాతలు ఫైనాన్సియర్స్ నుంచి మాటలు పడాల్సి ఉంటుంది..

Related Posts