తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తేజ‌ది ఓ స్పెష‌ల్ పేజ్. ఒకే క‌థ‌ను ఎన్నోసార్లు చెప్పిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అలాగే ఎంతోమంది ఆర్టిస్టుల‌ను ప‌రిచ‌యం చేశాడు. ఆయ‌న చేతుల మీదుగా లాంచ్ అయిన‌వాళ్లు స్టార్స్ గా మారారు. క‌మెడియ‌న్స్ నుంచి హీరోల వ‌ర‌కూ ఆయ‌నతో ప‌రిచ‌యం అయితే మంచి గుర్తింపు వ‌చ్చేస్తుంద‌నే గ్యారెంటీ ఉంది.

అందుకే చాలాకాలంగా హిట్ మొహ‌మే చూడ‌ని తేజ‌ను న‌మ్మి త‌న రెండో కొడుకు అభిరామ్ ను ప‌రిచ‌యం చేసే బాధ్య‌త ఇచ్చాడు సీనియ‌ర్ నిర్మాత డి సురేష్ బాబు. దీంతో కొన్నాళ్ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభించుకుని రీసెంట్ గా పూర్తి చేసుకుందీ సినిమా.

అహింస అనే టైటిల్ కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన అహింస టీజ‌ర్ చాలామందిని మెప్పిస్తోంది. టీజ‌ర్ చూశాక తేజ కూడా క‌థ మార్చినట్టు క‌నిపిస్తోంది. అంటే త‌న పాత జ‌యం ఫార్ములాను దాటిన‌ట్టుగా అనిపిస్తోంది. అలాగ‌ని పూర్తిగా మార‌లేదు కూడా.

అదే ప్లాట్ ను కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు టీజ‌ర్ చూస్తే తెలుస్తుంది. ఓ చిన్న గ్రామంలో మొద‌లైన క‌థ పెద్ద విల‌న్స్ వ‌చ్చే వ‌ర‌కూ తేజ మార్క్ లో ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ హింస అంటే ఇష్టం లేకుండా బుద్దుడిని ఫాలో అయ్యే హీరో త‌న ప్రేమ‌క‌థ‌లోకి విల‌న్స్ వ‌చ్చిన త‌ర్వాత కృష్ణ త‌త్వాన్ని ఫాలో అయిన‌ట్టుగా ఉంది.

అయితే అభిరామ్ గ‌తంలో ఓ ఇష్యూతో జ‌నం నోట్లో నానాడు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌టం యాధృచ్చికమేం కాదు. ఆ ఇష్యూ వ‌ల్లే ప‌రిచ‌యం లేట్ అయింది. అభిరామ్ స‌ర‌స‌న గీతిక అనే అమ్మాయిని హీరోయిన్ గా ప‌రిచయం చేస్తున్నాడు తేజ‌. మ‌రి త‌ను టాలీవుడ్ లో ప్లేస్ సంపాదించుకుంటుందా లేదా అనేది చూడాలి.