కోట్లకీ కూలీకి లింక్ లు పెడతారా ..?

కోట్లకీ పారితోషికం వర్సెస్ వేతనం అనే మాటలతో ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో సమ్మె చేస్తోన్న కార్మికులను ఉద్దేశించి కొందరు సినిమా పెద్దలు మాట్లాడుతున్నారు. కానీ కోట్లలో పారితోషికం తీసుకునే స్టార్స్ కు, వందల్లో కూలీ తీసుకునే కార్మికులకు ఎలా లింక్ పెడతారు అనేది వారే ఆలోచించుకోవాలి. కరోనాకు ముందు చాలా సినిమాల షూటింగ్ లు జరిగాయి. కానీ ఈ మహమ్మారి రాకతో ఏ మాత్రం ఉద్యోగ భద్రత లేని సినీ కార్మికలోకం అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది చనిపోయారు. కొంతమందిని పరిశ్రమ ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఆఖరు స్థాయి వరకూ వెళ్లలేదు అనేది నిజం. మరోవైపు కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడ్డా.. దానితో మాకేం పనిలేదు అన్నట్టుగా చాలామంది హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ పెంచారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు కనీస వేతనం కావాలంటూ కార్మికులు సమ్మెలు చేస్తుంటే మాత్రం లేస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో కార్మికులదే తప్పు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతోన్న సోకాల్డ్ సినిమా పెద్దలను చూస్తే సామాన్యులకు కూడా అసహ్యం వేస్తుంది.

నిజానికి కార్మికులు ఇప్పుడు అడుగుతున్నది కూడా భారీ అమౌంట్ కాదు. ఇప్పటి వరకూ తమకు ఇస్తోన్న వేతనంలో ఓ ముప్ఫైశాతం పెంచమంటున్నారు. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు కోట్లలో పెంచిన వారు ఇప్పుడు వందల వరకూ వచ్చేసరికి “అయ్యో పరిశ్రమ నష్టాల్లో ఉంది. మీకు బాధ్యత లేదా” అంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ చేస్తున్న కార్మికుల్లో ఎవరూ కనీసం రోజుకు రెండు వేలు కూడా తీసుకునేవారు కాదు. అంతా కలిపినా 1400లోపు వారే ఉన్నారు. మరి రోజుకు 1400 అంటే మాటలా అనే ఫీలింగ్ రావొచ్చు కొందరికి. మామూలుగా అయితే కాదు. కానీ సినిమా పరిశ్రమలో ప్రతి రోజూ పని దొరకదు కదా..? నెలలో ఓ పది పదిహేను రోజులు పని ఉండే అదే గొప్ప. పైగా ఉండేది మహా నగరంలో. ఖర్చులూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇప్పుడు సమ్మెలో ఉన్నవాళ్లలో 70శాతం వరకూ సొంత ఇళ్లు కూడా లేనివారే ఉంటారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీళ్లేమీ సడెన్ గా సమ్మెకు దిగలేదు. చాలా రోజుల క్రితమే ఫెడరేషన్ కు లెటర్ ఇచ్చారు. దానికి స్పష్టమైన సమాధానం రాలేదు కాబట్టే.. ఇలా చేయాల్సి వస్తుందంటున్నారు. సరే.. మధ్యే మార్గంగా వాళ్లు ముఫ్ఫైశాతం అడిగారు కాబట్టి.. ఓ ఇరవైశాతం పెంచుతాం అనే తరహా చర్చల ఊసే రాలేదు. అందుకే సమ్మె జరుగుతోంది. దీన్ని పరిశ్రమ బాగుకు ముడిపెట్టి మాట్లాడటం అంటే పీకలదాకా మెక్కిన వాడు ఆకలితో ఉన్నవాడికి నీతులు చెప్పడం లాంటిదే అవుతుంది.

Related Posts