‘ప్రతినిధి 2‘ సినిమా రివ్యూ

నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, తనికెళ్ల భరణి, ఇంద్రజ, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి తదితరులు
సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
విడుదల తేది: 10-05-2024

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి వచ్చిన అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’. ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. విలక్షణమైన పాత్రలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ నటించిన ఈ చిత్రానికి ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించడంతో ‘ప్రతినిధి 2‘పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి.. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘ప్రతినిధి 2‘ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
నిజాలను వెలికితీస్తూ సంచలన కథనాలతో తన వృత్తి పట్ల దూకుడుగా ఉండే జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సైన జర్నలిస్ట్ అతను. మరోవైపు.. సమాజం పట్ల బాధ్యతగా ఉండే జర్నలిస్ట్ ఉదయభాను (ఉదయభాను).. లాభాలు ఆశించకుండా NNC ఛానల్‌ ని ప్రారంభిస్తుంది. ఆ ఛానల్‌ కి చే ని సీఈవో ని చేస్తుంది. ఆ ఛానెల్ ద్వారా తన సంచలనాత్మక కథనాలతో రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తుంటాడు చే. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (స‌చిన్ ఖేడేక‌ర్‌)పై హ‌త్యాయ‌త్నం జరుగుతుంది. ఆయన మరణం తర్వాత కొడుకు విశ్వం (దినేష్ తేజ్) తదుపరి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటారు. మరి విశ్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడా? అసలు ముఖ్యమంత్రి హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ ప‌రిశోధ‌న‌లో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి? నారా రోహిత్‌ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
నిజం చెప్పడం కోసం ప్రాణాలని సైతం తెగించే ఓ నిజాయితీ గల జర్నలిస్ట్ కథ ఇది. నిజ జీవితంలోని సామజిక, రాజకీయ అంశాలకు ఫిక్షన్ ని జోడించి ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథని రాసుకున్నారు జర్నలిస్ట్ మూర్తి. వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా ‘ప్రతినిధి 2‘ చిత్రం తెర‌కెక్కింది.

ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ వచ్చినప్పుడు.. మరీ ముఖ్యంగా ఇలాంటి ఎన్నికల సమయంలో ఈ సినిమాలు విడుదలైనప్పుడు.. ఈ చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను.. వాస్తవ జీవితానికి ముడిపెడుతూ చూస్తుంటారు. ‘ప్రతినిధి 2‘ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కూడా గ‌తంలో తెలుగు రాజ‌కీయాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేస్తాయి. అయినా.. వాటికి ఫక్తు కమర్షియల్ హంగులు జోడించి తనదైన శైలిలో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు మూర్తి.

సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంతో కథ ప్రారంభమౌతోంది. తర్వాత హీరో చేతన్ పాత్రని నిజాయితీ గల ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పరిచయం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆరంభ స‌న్నివేశాలు క‌థానాయ‌కుడి పాత్ర నైజాన్ని.. జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి. మంత్రి గ‌జేంద్ర (అజ‌య్ ఘోష్‌) అరాచ‌కాల్ని ప్రశ్నించి అత‌ని ప‌ద‌వి పోయేలా చేయ‌డం.. ఓటు విలువ‌ని చాటి చెబుతూ తీర్చిదిద్దిన స‌న్నివేశాలూ ‘ప్రతినిధి 2‘కి బలం చేకూర్చుతాయి.

ఏ ఒక్క పార్టీకో ఉప‌యోగ‌ప‌డే సినిమాలా కాకుండా.. జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మూర్తి. ఫస్టాఫ్ మొత్తం తన కలంతో జర్నలిజ విలువలను పెంచిన హీరో.. సెకండాఫ్ లో కత్తి పట్టి కదనరంగంలోకి దూకుతాడు.

విరామ సమయానికి ముందు వచ్చే ట్విస్ట్ రెండో అర్థ భాగంపై మరింత ఆస‌క్తిని పెంచుతుంది. అయితే.. అప్పటిదాకా స‌హ‌జంగా సాగుతున్నట్టు అనిపించిన సినిమా.. సెకండాఫ్ లో నాటకీయత పెరిగినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ మూసలో కథ, కథనాలు మరీ నాటకీయంగా మారిపోతాయి. పాట‌లు, ఫైట్లతో ఫక్తు మసాలా మూవీని గుర్తు తెచ్చేలా ‘ప్రతినిధి 2‘ సెకండాఫ్ సాగుతోంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడంలో నారా రోహిత్ మేటి అని ఇది వరకే నిరూపించుకున్నాడు. ఇప్పటికే ‘ప్రతినిధి‘ సినిమాలోనూ ఇలాంటి తరహా పాత్రలో అదరగొట్టాడు. ఇక.. సీక్వెల్ ‘ప్రతినిధి 2‘లో జర్నలిస్ట్ గా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు నారా రోహిత్. జర్నలిస్ట్ గా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం ఆకట్టుకుంటాయి. హీరోయిన్ సిరీ లెల్లా సినిమాలో ఎక్కువ భాగం కనిపించినా.. ఆమె పాత్ర అంతగా ప్రభావం చూపించదు. ఇంకా.. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా, అజయ్ ఘోష్, ఉదయభాను.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఈ సినిమాలో జర్నలిజం, రాజ‌కీయ వ్యవస్థల్ని త‌న‌దైన‌ శైలిలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ మూర్తి. ‘దేశాన్ని కాపాడ‌టానికి సైనికుడు, క‌డుపు నింప‌డానికి రైతు ఎంత ముఖ్యమో.. స‌మాజానికి జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం’ వంటి డైలాగ్స్ జర్నలిజం గొప్పతనాన్ని చాటిచెబుతాయి. ఇంకా.. నాని చ‌మిడిశెట్టి కెమెరా ప‌నిత‌నం, మ‌హ‌తి స్వర సాగర్ నేప‌థ్య సంగీతం బాగున్నాయి. అయితే.. కథలో కొత్తదనం లేకపోవడంతో వారి పనితనానికి పెద్దగా గుర్తింపు వచ్చే అవకాశం లేదు.

చివరగా
జర్నలిజం గొప్పదనం, ఓటరుని చైతన్యవంతం చేసేలా తీర్చిదిద్దిన సన్నివేశాలు, కథలో మలుపులు, నారా రోహిత్ నటన ఈ సినిమాకి ప్లస్ అయితే.. ద్వితియార్థంలో పెరిగిన నాటకీయత ‘ప్రతినిధి 2‘కి పెద్ద మైనస్. ఓవరాల్ గా వ్యవస్థలోని లోపాలను ప్రశించడంలో ‘ప్రతినిధి 2‘ కొంత వరకూ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు.

రేటింగ్ : 3/ 5

Related Posts