మాసూ, క్లాసూ.. మంచి ఓపెనింగ్సే బాసూ

చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త కళ కనిపిస్తోంది. కొన్ని వారాలుగా వస్తోన్న సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి. దీంతో ఇయర్ ఎండింగ్ అంతా సందడి లేకపోయింది. అయితే ఈ వారం వచ్చిన రెండు సినిమాలూ కాస్త ఫర్వాలేదు అనిపించుకునేలా ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ఈ యేడాది ఆల్రెడీ రెండు డిజాస్టర్స్ చూసిన మాస్ మహరాజ్ రవితేజ ధమాకాకు తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చాయి.

నిజానికి రెండు డిజాస్టర్స్ తర్వాత కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది రవితేజ కేపబిలిటీ అని చెప్పొచ్చు. సినిమాగా ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా.. రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా మంచి మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా ఫ్యాన్స్ కు ధమాకా పండగలాంటి సినిమా అవుతుందని చెబుతున్నారు.

ఇక మాస్ రాజాతో పాటు కుర్ర బ్యూటీ శ్రీ లీల హైపర్ యాక్టివ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది. దర్శకుడు త్రినాథరావు టేకింగ్, రైటర్ ప్రసన్నకుమార్ ప్రతిభ మరో హైలెట్ గా నిలిచాయి. అలా ఈ వారం అంచనాలతోనే వచ్చిన ధమాకా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మరి ఈ ఓపెనింగ్స్ కు హిట్ టాక్ వరకూ నిలబెట్టుకుంటుందా లేదా అనేది సోమవారినికి తెలుస్తుంది.


ఇక కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ జంట మరోసారి తెరపై కనిపిస్తూ వచ్చిన 18పేజెస్. సుకుమార్ అందించిన కథతో వచ్చిన ఈ చిత్రానికి అతని శిష్యుడు కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ చిత్రంపై కూడా కొన్ని అంచనాలున్నాయి. వాటిని అందుకోవడానికి వీళ్లూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నారు. ధమాకా అంత మాస్ గా లేకపోయినా.. టైటిల్ తో పాటు సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే క్లాస్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.


ఇలా ఈ రెండు చిత్రాలకు ముందు విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు కనెక్ట్, లాఠీ పోయినా.. తెలుగు సినిమాలు మాత్రం సత్తా చాటాయి. మరి ఈ యేడాదికి ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ టాక్ తో సెండాఫ్ ఇస్తే కొత్త యేడాదిలోకి మంచి జోష్‌ గా ఎంటర్ అయిపోవచ్చు.

Related Posts