మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ బర్త్ డే ..

సినిమా పరిశ్రమలో ఎందరో ఆర్టిస్టులున్నారు. కానీ కొందరిని మాత్రమే ఉత్తమ నటులుగా గుర్తిస్తాం. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు రావు రమేష్. ఎలాంటి పాత్రైనా అలవోకగా చేసి మెప్పించే సత్తా ఉన్న అరుదైన నటుడు. ఆయన నటనే కాదు.. వ్యక్తిత్వమూ విలక్షణమే. క్యారెక్టర్ ఏదైనా రావు రమేష్ దాన్ని ఓన్ చేసుకునే విధానం కొత్తతరం నటులు నేర్చుకోవాల్సిన విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయొస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలుగుతోన్న సలక్షణ నటుడు రావు రమేష్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా రావు రమేష్ కెరీర్ ను బ్రీఫ్ గా చూద్దాం..

రావు గోపాలరావు.. ఈ పేరు లేకుండా తెలుగు సినిమా చరిత్ర పూర్తికాదు. విలన్ పాత్రలకే వన్నె తెచ్చిన వైవిధ్యమైన నటనతో అలరించిన అంత గొప్ప నటుడుకి వారసుడుగా వచ్చాడు రమేష్. కానీ వారసత్వం ఆయనకు అవకాశాలు తేలేదు. అవకాశాలు వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చిన నటన నిలబెట్టింది. విశేషం ఏంటంటే.. రావు రమేష్ ఏనాడూ తెర ముందుకు రావాలనుకోలేదు. తెర వెనకే కెమెరా వర్క్ లేదంటే దర్శకత్వం చేయాలనుకున్నాడు. కానీ ఆయన తల్లిగారు నటన వైపే ప్రోత్సహించారు. రావు గోపాలరావుగారబ్బాయ్ గా గుర్తింపు ఉన్నా.. అది అవకాశాలు తేలేదు.
తొలినాళ్లలో టివి సీరియల్స్ లో నటించారు. 2002లో సీమసింహం సినిమాలో చిన్న అవకాశం. కానీ డైలాగ్స్ లేని పాత్ర అది. కట్ చేస్తే మళ్లీ 2007లో ఒక్కడున్నాడు సినిమాలో ఛాన్స్ వచ్చింది. దీన్ని బట్టే పరిశ్రమలో నటుడుగా ఎదగడానికి ఆయనెంత కష్టపడ్డాడో అర్థమౌతుంది. ఈసినిమా కూడా ప్రత్యేకగా ఏ గుర్తింపూ తేలేదు. ఆ టైమ్ లో ఒక సినిమా తీయడానికి మూడేళ్లుగా ఇబ్బంది పడుతూ వస్తోన్న క్రిష్ పరిచయం.. రావు రమేష్ నట ప్రస్థానానికి సరికొత్త గమ్యాన్ని నిర్దేశించింది. గమ్యం సినిమాలో నక్సలైట్ పాత్రలో రావు రమేష్ కమాండింగ్ చూసిన తర్వాతే తెలుగు సినిమాకు అర్థమైంది. ఇన్నాళ్లూ ఇంత గొప్ప నటుడినా తను మిస్ చేసుకుంది అని.

గమ్యంతో ఓవర్ నైట్ రావు రమేష్ గమనం మారిపోయింది. అతని జీవితంలో కొత్త బంగారులోకం ఒకటి మొదలైంది. కలలు కన్న పరిశ్రమ కదా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్నాడు. తనకే సొంతమైన వైవిధ్యమైన డిక్షన్ తో ప్రతి పాత్రకూ ఓ కొత్త కలర్ తెచ్చాడు. టివి సీరియల్స్ లో పనిచేస్తున్నప్పుడు సినారె కవిత వ్యాఖ్యానం చేసేవాడట. అందుకే డిక్షన్ పై రావు రమేష్ కు అంత కమాండ్ ఉంటుంది . మొత్తంగా కాస్త ఆలస్యమైనా చాలా త్వరగానే తెలుగు సినిమాకు ఓ ఆణిముత్యం దొరికింది అని పరిశ్రమ మొత్తం ఫీలయ్యేలా నిరూపించాడు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే చాలు అనుకున్న వాడు కాస్తా.. అతి తక్కువ టైమ్ లోనే తెలుగు సినిమాకు ఖచ్చితంగా అవసరమైన నటుడుగా మారిపోయాడు. చాలామంది దర్శకులు రావు రమేష్ ను దృష్టిలో పెట్టుకుని కథలూ రాసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పాత్రైనా రావు రమేష్ చేస్తే దానికో పర్ఫెక్షన్ వస్తుంది అన్న ముద్రా పడిపోయింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా చాలా సందర్భాల్లో కొన్ని ఇమేజ్ చట్రాల్లోనూ ఆగిపోతారు. కానీ రావు రమేష్ వాటికి భిన్నం. అతను ఏ పాత్రలో నటిస్తే ఆ ఇమేజ్ మాత్రమే ఎలివేట్ అవుతుంది. అందువల్ల ఇలాంటి పాత్రలు మాత్రమే చేయగలడు అనేందుకు ఆస్కారం లేకుండా అన్ని పాత్రల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అన్నగా, తండ్రిగా, ఫ్రెండ్ గా, విలన్ గా ఇలా పాత్రేదైనా అతను చేస్తే దాని రేంజ్ మారిపోయింది. నిజానికి తెలుగువారైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల కొరత ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాడు రావు రమేష్. అతని ఎంట్రీతో ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే వంటి పరభాషా నటులకు పనిలేకుండా పోయింది అంటే అతిశయోక్తి కాదు. ఏ నటుడికైనా ఇది అత్యంత గర్వించే విషయం. కానీ అది రావు రమేష్ లో అణువంత కూడా కనిపించదు.

మంచి నటులు వేరు గొప్ప నటులు వేరు. మంచి నటుల వల్ల పాత్రలు హైలెట్ అవుతాయి. గొప్ప నటుల వల్ల సినిమాలకు వెయిట్ పెరుగుతుంది. రావు రమేష్ ఈ రెండు కోవలకూ చెందిన నటుడు. అతను చేసిన కొన్ని పాత్రలు చూస్తే వెరీ ఛాలెజింగ్ అనిపిస్తుంది. కానీ అతను చేస్తున్నప్పుడు ఈ పాత్ర ఇంత సింపులా అనిపిస్తాడు. ఒకప్పుడు రావు గోపాలరావుగారి నటనలోనూ ఈ లక్షణం కనిపించింది. కానీ తండ్రికి మించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రమేష్ కు రావడం అతని అదృష్టం మాత్రమే కాదు.. ప్రతిభ కూడా కారణం. రావు రమేష్ నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ అతని పాత్రలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కావు కూడా అనే నమ్మకం ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఉంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో చాలా పాత్రలకు ఔచిత్యం కనిపించదు. కానీ రావు రమేష్ కు రాసే ఏ పాత్రకైనా అది కనిపిస్తుంది. ఎందుకంటే అతను మాత్రమే ఆ ఔచిత్యాన్ని ఆడియన్స్ కు అర్థమయ్యేలా ప్రదర్శిస్తాడు. ఇందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. సీరియస్ క్యారెక్టర్స్ లో ఎంత క్రూయల్ గా ఉంటాడో కామెడీ రోల్స్ లోనూ అంతే ఫన్నీగా ఉంటాడు. దువ్వాడ జగన్నాథమ్ లో తండ్రిని ఇమిటేట్ చేస్తూ చేసిన పాత్ర ఎంత గొప్పగా పండిందో.. సరిలేరు నీకెవ్వరులో తండ్రి పాత్ర అంత ఫన్నీగానూ ఉంటుంది. ఓ బేబీలో సమంత కొడుకు పాత్రలో ఎంత హుందగా ఉంటాడో.. ఆర్ఎక్స్ 100 లో తండ్రిగా అంత అద్భుతంగా కనిపిస్తాడు.

అప్ కమింగ్ హీరోల సినిమాలకు రావు రమేష్ పెద్ద ఎస్సెట్ గా మారి చాలా రోజులే అయింది. అతనుంటే సినిమాకు వెయిట్ పెరుగుతుంది. మజిలీ, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాల్లోని నట వైవిధ్యానికి రావు రమేష్ కాక మరెవరు న్యాయం చేస్తారు అనిపిస్తుంది. పాత్ర చిన్నదైనా ఏదో స్పార్క్ తో ఆ కాసేపూ వెలిగిపోతాడు రమేష్. పుష్ప, భీమ్లా నాయక్, కెజీఎఫ్2 లాంటి చిత్రాల్లో ఈ స్పార్క్ కనిపిస్తుంది. ఏదేమైనా తెలుగు సినిమాకు తెలుగువాడుగా దొరికిన నట ఆణిముత్యం రావు రమేష్. తెలుగులోనే కాక రాబోయే రోజుల్లో బహుభాషా నటుడుగా తెలుగు వాడి సత్తాను చాటాలని కోరుకుంటూ ఈ విలక్షణ వ్యక్తిత్వం ఉన్న సలక్షణ నటుడికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది టివి5.

Related Posts