బింబిసార మూవీ రివ్యూ..

రివ్యూ :- బింబిసార
తారాగణం :- కళ్యాణ్ రామ్, కేథరీన్ థ్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్‌ రాజ్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్,అయ్యప్ప పి శర్మ తదితరులు
ఎడిటర్ :- తమ్మిరాజు
పాటలు :- చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి
నేపథ్య సంగీతం :- ఎమ్ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫీ :- చోటా కె నాయుడు
నిర్మాత :- కె హరికృష్ణ
దర్శకత్వం :- వశిష్ట్

ఫాంటసీ మిక్స్ అయిన ఫిక్షన్ కథలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కాకపోతే కాస్త జాగ్రత్తగా స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రాసుకోవాలి. అప్పుడే అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయబోతున్నాం అనే నమ్మం కళ్యాణ్ రామ్ అండ్ బింబిసార సినిమా టీమ్ లో బలంగా కనిపించింది. ప్రమోషన్స్ లోనూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కొన్నాళ్లుగా హిట్ మాట ఎరుగని టాలీవుడ్ కు ఈ సినిమా విజయాన్నిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. మరి వారి మాట నిజమైందా.. బింబిసార అంతా అంటున్నట్టుగా ఆకట్టుకుందా అనేది చూద్దాం..

కథ :-
క్రీస్తు పూర్వం 500వ శతాబ్ధానికి చెందిన త్రిగర్తల రాజ్యానికి రాజు బింబిసారుడు(కళ్యాణ్‌ రామ్). అత్యంత క్రూరుడు. బహుళ రాజ్యకాంక్షతో చుట్టూ ఉన్న రాజ్యాలను జయిస్తూ.. అక్కడి రాజులను క్రూరంగా చంపేస్తుంటాడు. విపరీతమైన సంపదను పోగేస్తూ.. ప్రజలను గాలికి వదిలేస్తుంటాడు బింబిసార. అలాంటి అతని రాజ్యంలో ధన్వంతరీ పురం అనే ఊరి జనాలు, తమ శతృదేశ సైనికులకు చికిత్స చేశారని.. వెళ్లి వారిని అంతమొందిస్తాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన ఓ పాపను అత్యంత క్రూరంగా చంపేస్తాడు. దీంతో ఆ ధన్వంతరీశాల పెద్ద(తనికెళ్ల భరణి) బింబిసారుణ్ని శపిస్తాడు. అతన్నీ చంపేస్తాడు. మరోవైపు కథ ఈ కాలానికి వస్తుంది. ఓ పెద్ద డాక్టర్ నిధి కోసం అన్వేషిస్తూ.. బింబిసారుడి రాకకోసం ఎదురుచూస్తుంటాడు. మరి బింబిసారుడు ఈ కాలానికి ఎలా వస్తాడు.. అతనికి పెట్టిన శాపం వల్ల బింబిసారుడి రాజ్యంలో, జీవితంలో కలిగిన మార్పులేంటీ అనేది మిగతా కథ..

విశ్లేషణ :-
కొన్ని కథలను ముందుకు తీసుకువెళ్లే కీలకమైన పాయింట్ ఒకటి ఉంటుంది. అది వీలైనంత వరకూ లాజిక్ గా ఉంటే ఓకే. లేదంటే కనెక్షన్ దెబ్బతింటుంది. లేదూ చూసేవాళ్లు ఆ పాయింట్ ను సీరియస్ గా తీసుకోకపోతే ఈ కథనంలో లీనమైపోతారు. బింబిసార సినిమా కూడా అంతే. భూత, వర్తమాన కాలాలు ఒకేసారి జరుగుతుండటం.. ఈ రెండిటి మధ్య కనిపించే కనెక్షన్ సిల్లీగా ఉండటం మైనస్. అయినా ఆ ఒక్క పాయింట్ ను లైట్ తీసుకుంటే(ఇది ఫిక్షన్ స్టోరీ కాబట్టి తీసుకోవచ్చు కూడా) బింబిసార ఎంటర్టైన్ చేస్తాడు. చాలామంది ఇది పునర్జన్మల కథ అనుకున్నారు. కానీ కాదు. క్రీస్తు పూర్వం 500వ శతాబ్ధానికి చెందిన బింబిసారుడు తన సోదరుడైన దేవదత్తుడి వల్ల ఈ కాలానికి వస్తాడు. ఈ కాలంలో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ఫన్నీగా ఉంటూనే కథనూ ముందుకు తీసుకువెళుతుంది. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను వాడుకుంటూ ఏదో ఎలివేషన్స్ ఇచ్చేస్తారు అనుకుంటే.. అతను కథతోనే ముందుకు వెళ్లాడు. కథలోనే అన్నీ భాగం చేశాడు. ఇదే సినిమాకు ప్రధాన బలం. అందుకే ఎక్కడా బోర్ కొట్టదు. చూస్తున్నంత సేపూ కంప్లీట్ ఎంగేజింగ్ గానే ఉంటుంది. రెండు కాలాల్లోనూ చిన్న పాప పాత్ర కీలకం కావడంతో ఫస్ట్ పార్ట్ లో క్రౌర్యంగా కనిపించిన సీన్స్, సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ల్ గా కనెక్ట్ అయ్యి బింబిసారుడి మార్పుకు కారణం అవుతాయి. రాజుగా ఉన్నప్పుడు ఎంతమందిని చంపి అయినా తను విస్తరించాలి అనుకున్న అతను, ఈ కాలానికి వచ్చిన తర్వాత తను చనిపోయినా ఫర్వాలేదు అందరినీ బ్రతికించాలి అనుకుంటాడు. ఆ మార్పుకు మధ్య సాగే సంఘర్షణ కూడా బాగా కలిసొచ్చింది.
ఈ సినిమా కళ్యాణ్‌ రామ్ ఒన్ మేన్ షోగా చెప్పాలి. రెండు భిన్నమైన ఎమోషన్స్ ను అద్భుతంగా పలికించాడు. రాజు బింబిసారుడుగా క్రూరత్వాన్ని, ఈ కాలంలో కనిపించే బింబిగా మార్పులను అలవోకగా నటించాడు. సినిమాలో విలన్ అంటూ పెద్దగా కనిపించరు. ఉన్న వ్యక్తి “లక్ష్యం” పురాతన సినిమాల నుంచీ కనిపిస్తున్నదే. కానీ అసలు విలన్ వ్యక్తిత్వం. దాన్ని సరిగ్గా మలచుకుంటే తప్ప మనిషి కాలేడు అనే పాయింట్ ను ఎలివేట్ చేయడానికి బింబిసారుడి వ్యక్తిత్వాన్ని రెండు విధాలుగా ఆవిష్కరించాడు. అదే సినిమాకు ప్రధానమైన పాయింట్. మిగతా అంతా కమర్షియల్ సినిమా ఫార్మాట్ కు తగ్గ ఎలిమెంట్స్.


హీరోయిన్ల పాత్రలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. యువరాణిగా కేథరీన్, ఎస్ఐగా సంయుక్త అస్సలు సూట్ కాలేదు. ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ అస్సలు బాలేదు. మిగతా పాత్రల్లో ప్రకాష్‌ రాజ్ కు ఇలాంటివి కొట్టిన పిండి. తనికెళ్ల భరణి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్ ల పాత్రలూ రొటీన్. విలన్ గా చేసినతను అస్సలు రిజిస్టర్ కాలేదు కానీ.. మాంత్రికుడుగా నటించిన అయ్యప్ప ఆకట్టుకుంటాడు. చిన్న పాపగా నటించిన బేబీ పాత్ర, నటన సినిమాలో కీలకం కావడం విశేషం.

టెక్నికల్ గా బింబిసారకు మెయిన్ హీరో కీరవాణి. అతని నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఓ బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన రేంజ్ లో ఆర్ఆర్ కనిపిస్తుంది. సింపుల్ గా ఆర్ఆర్ అద్భుతం అనేయొచ్చు. పాటలకు చిరంతన్ భట్ సంగీతం అందించాడు. అయితే ఓ తేనె పలుకులా చిన్నారి అనే పాటను రాసింది కంపోజ్ చేసింది మాత్రం వరికుప్పల యాదగిరి. వాసుదేవ్ మునెప్పగారి మాటలు బావున్నాయి. సెట్టింగ్స్,ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఎడిటింగ్ అన్నీ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఎక్కడా రాజీపడలేదు. లావిష్ గా ఉంది. దర్శకుడుగా వశిష్ట్ కు ఇది ఫస్ట్ మూవీ. కానీ అలా అనిపించదు. చాలా ఎక్స్ పీరియన్స్ డ్ డైరెక్టర్ లా హ్యాండిల్ చేశాడు. టేకింగ్, మేకింగ్, షాట్ డివిజన్ డైరెక్షన్.. ఇలా అన్ని అంశాల్లో ఓ కమాండ్ ఉంది. ఇంకాస్త ఫోకస్ చేస్తే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చాలా ఫాస్ట్ గా చేరతాడు అని చెప్పొచ్చు.

ఫైనల్ గా :- బింబిసార లాజిక్స్ వదిలేస్తే.. లవబుల్ మూవీనే..

రేటింగ్ :- 3/5

            -యశ్వంత్ బాబు.కె

Related Posts