సెప్టెంబర్ 23న అవతార్ రిలీజ్

అవతార్.. ఈ ప్రపంచం మొత్తాన్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లిన సినిమా. జేమ్స్ కేమరూన్ దర్శకత్వ మాయాజాలానికి ప్రపంచం మైమరచిపోయింది. అత్యధిక కలెక్షన్లు, రికార్డులు, రివార్డులూ, అవార్డులూ అంటూ బోలెడంత క్రేజ్ తెచ్చుకుందీ చిత్రం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రతి ఒక్కరూ పండోరా గ్రహంలోనే ఉండిపోయారు. ఆదివాసుల జీవనాన్ని, వారి భూమిని లాగేసుకోవాలనుకున్న ప్రపంచ పెద్దన్న అమెరికా ఆధిపత్యానికి ఎదురుతిరిగి తమ భూమిని దక్కించుకునేందుకు అమాయకులైన ఆదివాసులు చేసే పోరాటమే కథగా వచ్చిన ఈ సినిమా నచ్చని వారు దాదాపు లేరు అనే చెప్పాలి.

అలాంటి సినిమాకు రెండు సీక్వెల్స్ ఉన్నాయని ముందే ప్రకటించాడు జేమ్స్. అందుకు తగ్గట్టుగానే అవతార్2 ఈ డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. అయితే ఈ ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు 13యేళ్లవుతోంది. అంటే ఓ కొత్త తరం వచ్చింది. ఈ తరానికి రెండో భాగం అర్థం కావాలని.. లేదంటే ఆల్రెడీ చూసిన వారికి మరోసారి కథలోకి కనెక్ట్ చేయడానికి ఫస్ట్ పార్ట్ ను మళ్లీ రిలీజ్ చేస్తున్నాడు జేమ్స్. పైగా దీనికి ఈ సారి అప్డేట్ అయిన టెక్నాలజీని జోడిస్తున్నాడు. సౌండ్ సిస్టమ్ తో పాటు విజువల్ గానూ ఈ సారి నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. అందువల్ల అవతార్ ను నాలుగైదు సార్లు చూసినవాళ్లు కూడా ఈ కొత్త టెక్నాలజీ వల్ల సరికొత్త అనుభూతి వస్తుంది.

అవతార్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. పండోరా అనే గ్రహం, అందులోని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ చూసిన తర్వాత జేమ్స్ కేమరూన్ ఊహలకు ప్రపచం అంతా ఫిదా అయిపోయింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా ఉన్నాయి అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దానికంటే ముందు మరోసారి అవతార్ ను చూడండి.. అప్పుడు మరింత క్లియర్ గా సీక్వెల్ అర్థం అవుతుంది అని చెప్పడానికే ఈ సెకండ్ రిలీజ్ అనేది జేమ్స్ చెబుతోన్న మాట. ఇక అవతార్ ను 2009 డిసెంబర్ 18న విడుదల చేశాడు జేమ్స్. దాని సీక్వెల్ అవతార్ ద వే ఆఫ్ వాటర్ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నాడు. మరి ఈ సారి పాత అవతార్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Posts