లైగర్ ఈ టెస్ట్ లో పాసవుతాడా

మరికొన్ని గంటల్లోనే లైగర్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెంచారు. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల తర్వాత వస్తోన్న సినిమా ఇది. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీ. అనూహ్యంగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా టర్న్ అయిన లైగర్ కు బాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను క్యాష్‌ చేసుకుంటే విజయ్ అండ్ పూరీ రికార్డులు సెట్ చేస్తారు.. లేదంటే.. మరో సినిమాకు వెళతారు. బట్ ఈ ఇద్దరికీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఇదో లిట్మస్ టెస్ట్ లాంటిది. మరి ఈ టెస్ట్ లో వీళ్లు పాస్ అవుతారా లేదా..?

లైగర్.. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ తో పూర్తిగా పూరీ జగన్నాథ్ టైప్ టేకింగ్ తో కనిపిస్తోన్న సినిమా. అతి తక్కువ టైమ్ లోనే యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరో కావడం.. అతని యాటిట్యూడ్ కు తగ్గట్టుగానే ఈ చిత్ర కథ కనిపిస్తుండటంతో లైగర్ పై అంచనాలు కూడా పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం ఎంటైర్ టీమ్ చాలా కష్టపడింది. మూవీ మేకింగ్ లోనే కాదు.. ప్రమోషన్స్ లో సైతం ఓ రేంజ్ లో తిరిగారు. దాదాపు 20 రోజులకు పైనే ప్రమోషన్స్ కు కేటాయించారు. ఆ కష్టానికి తగ్గట్టు కథ కూడా బావుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారు.

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇంకా చెబితే కథలోని మెయిన్ పాయింట్ తన చుట్టూనో లేదా తన కోసమో సాగుతుంది అనిపిస్తోంది. మైక్ టైసన్ ఉన్నాడు కానీ.. అతనిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. చిన్న పాత్రే అంటున్నారు. అయినా అతని క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమా పూరీ కంటే విజయ్ కి చాలా కీలకం. ఒకవేళ బ్లాక్ బస్టర్ అనే మాట వింటే అతని కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళుతుంది. లేకపోయినా ఇబ్బందేం ఉండదు.. బట్ అనూహ్యంగా వచ్చిన ప్యాన్ ఇండియన్ క్రేజ్ తగ్గుతుంది. ఏదేమైనా పెద్దగా పోటీ కూడా లేని టైమ్ లో వస్తోన్న ఈ లైగర్ టీమ్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది గంటల్లోనే తేలిపోతుంది.