‘దేవర‘ టీజర్ అద్భుతం అంటోన్న అనిరుధ్

2024లో రాబోయే క్రేజీ మూవీస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘ ఒకటి. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ‘దేవర‘ ఫస్ట్ పార్ట్ వచ్చే యేడాది ఏప్రిల్ లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘దేవర‘ నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇటీవల ‘డెవిల్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ‘దేవర’ టీజర్ త్వరలో రాబోతుందని తెలిపాడు. లేటెస్ట్ గా ఆ టీజర్ ఎప్పుడు వస్తోంది అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. దాన్ని బట్టి జనవరి 8న ‘వరల్డ్ ఆఫ్ దేవర’ పేరుతో టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. ఆ తర్వాత సంక్రాంతి బరిలో రానున్న సినిమాలతో పాటు థియేటర్లలోనూ టీజర్ ను ప్రదర్శించనున్నారనే టాక్ కూడా జోరుగా వినిపిస్తుంది.

‘దేవర‘ టీజర్ పై అంచనాలను మరింత రెట్టింపు చేసేలా.. టీజర్ కేక అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ‘దేవర‘ టీజర్ కోసం తాను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నానంటూ.. హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ ను ట్యాగ్ చేస్తూ.. ‘ఆల్ హెయిల్ ది టైగర్‘ అంటూ తన ట్వీట్ కి ఓ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. మొత్తంమీద.. ‘దేవర‘ టీజర్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts