స్వర్ణయుగంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్

తెలుగు సినిమా స్వర్ణయుగంలో అద్భుతమైన సినిమాలను అందించిన నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. దర్శకుడిగానూ పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు రాజేంద్రప్రసాద్. ఈరోజు (నవంబర్ 4న) వి.బి.రాజేంద్రప్రసాద్ జయంతి.

వి.బి.రాజేంద్రప్రసాద్ పూర్తి పేరు వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్. నటుడి కావాలనే కోరికతో మద్రాసు వెళ్లిన రాజేంద్రప్రసాద్ నిర్మాతగా స్థిరపడ్డారు. 1960లో జగపతి సంస్థను స్థాపించి జగ్గయ్య, జమున జంటగా ‘అన్నపూర్ణ’ చిత్రాన్ని నిర్మించారు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత.. ఏయన్నార్ కథానాయకుడిగా జగపతి సంస్థలో వరుస సినిమాలొచ్చాయి. ‘ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు‘ వంటి విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు వి.బి.రాజేంద్రప్రసాద్.

నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు రాజేంద్రప్రసాద్. ‘దసరాబుల్లోడు, బంగారుబాబు, మంచి మనుషులు, రామకృష్ణులు’ సినిమాలు రాజేంద్రప్రసాద్ కు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. కథానాయకుడిగా పలు విజయంతమైన చిత్రాలందుకుని.. ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా పలు భాషలలో దూసుకెళ్తున్న జగపతిబాబు.. రాజేంద్రప్రసాద్ కుమారుడే.

తెలుగు చిత్ర పరిశ్రమలో వి.బి.రాజేంద్రప్రసాద్ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. సినీపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిన తర్వాత ఫిలింనగర్‌ లో వి.బి.రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే దైవసన్నిధానం నిర్మించారు. రాజేంద్రప్రసాద్ తన శేష జీవితాన్ని దైవసన్నిధానికే అంకితం చేశారు. వి.బి.రాజేంద్రప్రసాద్ తన 82 ఏళ్ల వయసులో జనవరి 12, 2015న తుదిశ్వాస విడిచారు.

Related Posts