కార్తికేయ2 మూవీ రివ్యూ

రివ్యూ :- కార్తికేయ
తారాగణం :- నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, సత్య, ప్రవీణ్‌, తులసి, ఆదిత్య మీనన్ తదితరులు
సంగీతం :- కాలభైరవ
సినిమాటోగ్రఫీ :- కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు :- అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వ ప్రసాద్
దర్శకత్వం :- చందూ మొండేటి

కార్తికేయ.. 2014లో వచ్చిన సూపర్ హిట్ మూవీ. చందూ మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ నటించిన సినిమా. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా కార్తికేయ2 అంటూ ఇవాళ వచ్చారు. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఈ చిత్రంపైనా ఆసక్తి ఉంది. ప్రమోషన్స్ పరంగానూ టీమ్ చాలా కష్టపడింది. అయితే ట్రైలర్స్ చూసిన తర్వాత ఇది శ్రీకృష్ణజన్మస్థానం ద్వారకతో ముడిపడి ఉన్న కథ అని తెలిసింది. మరి ఈ కథను ఆడియన్స్ కు ఎలా చెప్పారు. ఆ చెప్పడంలో సక్సెస్ అయ్యారా లేదా అనేది చూద్దాం.

కార్తీక్ శాస్త్రియ దృక్పథం ఉన్న డాక్టర్. చూస్తే కానీ ఏదీ నమ్మడు. ఓ పెద్ద హాస్పిటల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డాక్టర్ అతను. అలాంటి వ్యక్తి తన ధోరణి వల్లే సస్పెండ్ అవుతాడు. ఓ మొక్కు తీర్చకపోవడం వల్లే కార్తీక్ సస్పెండ్ అయ్యాడని అతని తల్లి బలవంతంగా కార్తీక్ ను ద్వారక తీసుకువెళుతుంది. మరోవైపు ద్వారక నేపథ్యంగా ప్రపంచంలోని అనేక రకాల రుగ్మతలకు, రాబోయే ఎన్నో విపత్తులకు సంబంధించి పరిష్కారం ఉన్న కడియం కోసం శతాబ్దాల తరబడీ సాగుతోన్న అన్వేషణ ఈ కాలంలోనూ సాగుతుంది. వారి అన్వేషణలో తెలియకుండానే కార్తీక్ ఇరుక్కుంటాడు.ఓ ఆర్కియాలజిస్ట్ వల్ల కార్తీక్ ఆ కడియం సాధించే వ్యక్తిగా బలవంతంగా నెట్టివేయబడతాడు. అదే టైమ్ లో అభీరులు అనే ముఠా ఈ కడియం కోసం చూసేవారిని చంపేస్తూ ఉంటుంది. మరి వీళ్లెవరు..? కార్తీక్‌ తన దృక్పథంతోనే కడియాన్ని సాధించడా లేదా అనేది మిగతా కథ.

కార్తికేయ2 .. కార్తికేయ ఫార్మాట్ లోనే సాగే కథ. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి మరణానికి ముందు తనకు నమ్మకమైన ఒక వ్యక్తికి ఓ కడియం ఇస్తాడు. దీన్లో రాబోయే రోజుల్లో సంభవించే అనేక విపత్తులకు పరిష్కారం ఉంటుంది. అర్హుడైన వ్యక్తి వచ్చే వరకూ దీన్ని భద్రపరచాలని చెబుతాడు. ఆ కాలం నుంచి ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ కడియాన్ని చేరుకోవాలంటే అనేక అవాంతరాలు దాటాల్సి ఉంటుంది. దైవానుగ్రహం ఉండి.. చావుకు కూడా భయపడని వ్యక్తి వల్ల అది సాధ్యం అవుతుంది. ఆ వ్యక్తి హీరోనే అవుతాడు కాబట్టి.. నిఖిల్ ఆ బాధ్యత తీసుకుంటాడు. మొదట ఇష్టం లేకపోయినా.. తనకు ఎదురవుతోన్న ఒక్కో ప్రశ్నా అతనిలో ఆసక్తిని పెంచుతుంది. అలా ఆ ప్రశ్నలకు పరిష్కారం వెదుకుతూ తను లోక రక్షకుడుగా మారి ఆ కడియాన్ని సాధిస్తాడు. ఈ క్రమంలో ముగ్ధగా అనుపమ, సదానందగా శ్రీనివాసరెడ్డి, అండగా నిలుస్తారు. వారి సాయంతో ఎన్నో సమస్యలను ప్రాణాలకు తెగించి ఎదుర్కొంటాడు.

మన దేవుళ్లది పురాణం కాదు. చరిత్ర అని నిరూపించే క్రమంలో సాగే కథ ఇది. ఈ క్రమంలో దర్శకుడు చాలా లిబర్టీస్ తీసుకున్నాడు. అద్భుతం అని చెప్పలేం కానీ.. ఆద్యంతం బోర్ లేకుండా సాగుతుంది సినిమా. ముఖ్యంగా హిందువులకు మరింత బాగా నచ్చుతుంది. ఈ సినిమా కమర్షియల్ విజయానికి వారే ప్రధాన బలంగా నిలుస్తారని చెప్పొచ్చు. నిఖిల్ ఒన్ మేన్ షోలా చేశాడు. సినిమా మొత్తాన్ని తనే మోశాడు. అనుపమ హీరోయిన్ గా కంటే ఓ ప్రధాన పాత్ర చేసింది అంటే బెటర్. శ్రీనివాస రెడ్డి, వైవా హర్షలు నవ్విస్తారు. ద్వాపర యుగం నుంచి కొనసాగుతున్న అభీరుల ముఠాకు సంబంధించి డీటెయిలింగ్ బావుంది. దర్శకుడుగా చందు మొండేటి చాలా రీసెర్చ్ చేసినట్టు కనిపించినా.. అనేక కీలకమైన అంశాలను వదిలేశాడు. దీంతో ఒక్కోసార కృతకంగా, మరోసారి అసహజంగా కనిపిస్తుందీ సినిమా. ఈ పని చేయడానికి కార్తీక్ నే ఎందుకు ఎంచుకున్నారు అనేదానికి సరైన రీజన్ ఉండదు. అలాగే చాలా సీన్స్ పాతకాలం నాటి హాలీవుడ్ సినిమాల నుంచి లేపేసినట్టు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇండియానా జోన్స్ లాంటి చిత్రాల నుంచి. దర్శకత్వ లోపాల్లోని మరో ప్రధానమైనది ఈ కడియం తీసుకుని రావడానికి బలమైన కారణం ఏంటీ అనేది అస్సలు ఎలివేట్ చేయలేదు. కరోనా వంటి విపత్తుల నుంచి రక్షిస్తుందా లేక ఇంకేదైనా రీజన్ ఉంటుందా అనేదానికి సరైన జస్టిఫికేషన్ లేదు.
అయినా లోక కళ్యాణం కోసం దైవం నిర్దేశించిన మనిషి సాగించిన ఈ ప్రయాణం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ హైలెట్. సంగీతం ఓకే అనిపించుకుంటుంది. మాటల్లో ఎక్కువ శాతం హిందూ ఆడియన్స్ ను శాటిస్ ఫై చేయడానికే అన్నట్టుగా అఖండ సినిమా లైన్ లో సాగుతాయి. సైన్స్ ను, మతాన్ని మిక్స్ చేసి తీసిన కార్తికేయ2కు కూడా సీక్వెల్ ఉందని చెప్పేశారు.

ఫైనల్ గా :- ఆకట్టుకునే ద్వారక కథ

రేటింగ్ :- 2.75/5

                        - యశ్వంత్ బాబు. కె

Related Posts