ఏప్రిల్ నుంచి మొదలవ్వనున్న ‘సలార్ 2’

‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు పొందాడు. మళ్లీ ‘బాహుబలి’ రేంజ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందా? అంటూ అతని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ సమయం ‘సలార్’తో వచ్చింది. రెబెల్ స్టార్ ప్రభాస్ ను మళ్లీ ఫుల్ ఫామ్ లో నిలిపింది ‘సలార్‘. ఒకవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ విజయ దాహాన్ని ‘సలార్‘ తీర్చింది.

ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా ఊర మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు. అయితే.. ‘సలార్‘లోని అసలు సిసలు విజువల్ ఫీస్ట్ ను ఆస్వాదించాలంటే సెకండ్ పార్ట్ వచ్చే వరకూ ఆగాల్సిందే. మరి ‘సలార్ 2‘ ఎప్పుడు మొదలవుతోంది? ప్రశాంత్ నీల్ కి ఉన్న ప్రయర్ కమిట్ మెంట్స్ తో ఇప్పట్లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా? అనే ఊహాగానాలు చాలానే వినిపించాయి.

లేటెస్ట్ గా ‘సలార్ 2’ షూటింగ్ పై హింట్ ఇచ్చాడు ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్న బాబీ సింహా. తెలుగు వాడే అయిన బాబీ సింహా తమిళంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ‘సలార్’లో భారవ అనే పవర్ ఫుల్ రోల్ లో బాబీ సింహా కనిపించాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్యూలో ‘సలార్ 2’ ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుంటుంది అని తెలిపాడు బాబీ సింహా.

మరోవైపు.. ప్రశాంత్ నీల్ కమిటైన ఎన్టీఆర్, యష్ ‘కె.జి.యఫ్ 3‘ చిత్రాలు ‘సలార్ 2’ కంటే ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఎలాగో ‘దేవర‘తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ‘వార్ 2‘ లైన్లో ఉంది. యష్ కూడా ‘టాక్సిక్‘ అనే కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఈనేపథ్యంలో త్వరలోనే ‘సలార్ 2‘ పనులు ప్రారంభించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉండడంతో ఇదే వేడిలో ‘సలార్ 2‘ని ఫినిష్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Related Posts