రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బయోగ్రఫీ

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో 80 నుంచి 90 శాతం మంది వారసత్వంగా వచ్చినవారే. అంతటి కాంపిటేటివ్ ఫీల్డ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకోవడమంటే మామూలు విషయం కాదు. ‘అర్జున్ రెడ్డి’తో ఆ ఘనత సాధించాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ మూవీ విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్ల మార్కును సాధించాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో పెడుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు ఈరోజు (మే 9).

మిడిల్ క్లాస్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని ప్రయాణం మొదలుపెట్టిన విజయ్.. తొలుత చిన్న చిన్న పాత్రల్లో మెరిశాడు. 2011లో వచ్చిన రవిబాబు ‘నువ్విలా’లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో స్మాల్ రోల్ దక్కింది. ఇక.. విజయ్ ను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించుకునేలా చేసిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఈ సినిమాలో హీరో నాని. విజయ్ దేవరకొండ కి సెకండ్ హీరో రోల్ దక్కింది. ఈ మూవీలో విజయ్ యాక్టింగ్ చూసిన వారంతా.. ఈ అబ్బాయి ఎవరు? అనే ఆరాలు మొదలుపెట్టారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలోని రిషి పాత్ర విజయ్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

ఇక 2016.. విజయ్ ను హీరోగా నిలబెట్టిన ‘పెళ్లి చూపులు’ విడుదలైన సంవత్సరం. తన మిత్రుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ పోషించిన ప్రశాంత్ పాత్ర.. ప్రతీ యువకుడు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నాడు. ‘పెళ్లి చూపులు’ సినిమాకి రెండు జాతీయ పురస్కారాలు కూడా దక్కాయి. ఆ వెంటనే వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ తర్వాత ‘మహానటి’ సినిమాలో అతిథి పాత్రలో మెరిసి అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి ఫ్లాప్స్ ఉన్నా.. ‘టాక్సీవాలా’ వంటి చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకున్నాడు. ఇక.. ‘లైగర్’తో ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా.. ఏమాత్రం నిరాశచెందకుండా ‘ఖుషి’తో కూల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక.. హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అని చెప్పాలి.

గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన విజయాన్నందించలేకపోయింది. అయినా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్. మొదటిగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి తో సినిమాని పూర్తి చేయనున్నాడు. అసలు చాన్నాళ్ల క్రితమే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్న షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ టీమ్.. ఇప్పుడు వైజాగ్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండకి జోడీగా మమిత బైజు, భాగ్యశ్రీ బోర్సే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మరోవైపు ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత ప్రతిష్ఠాత్మక సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో విజయ్ నటించే సినిమా ఇదే కాబోతుంది.

ఈ రెండు సినిమాలతో పాటు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లోనూ ఒక సినిమాని లైన్లో పెట్టాడు విజయ్. రాహుల్ సంకృత్యాన్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృత్యాన్ సినిమా త్వరలో పట్టాలెక్కనుందట. ఈ సినిమాలతో భారీ విజయాలు సాధించి.. విజయ్ దేవరకొండ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావాలని కోరుకుంటూ రౌడీ స్టార్ కి బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts