నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బయోగ్రఫీ

వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే సడెన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ‘విరాటపర్వం’ సినిమా తర్వాత అసలు సినిమాలు చేస్తోందా? లేదా? అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే.. అలాంటి అపొహలన్నీ పటాపంచలు చేస్తూ మళ్లీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అవుతోంది ఈ నేచురల్ బ్యూటీ. ఈరోజు (మే 9) సాయిపల్లవి పుట్టినరోజు.

హీరోయిన్ కుండే లెక్క‌లు మార్చిన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి. హీరోయిన్ ఇలాగే ఉండాలి అనే కొల‌త‌లను ఒక న‌వ్వుతో మాయం చేసి స‌హాజ‌త్వానికి మించిన అందం ఉంటుందా అని ప్ర‌శ్నించిన బ్యూటీ సాయి ప‌ల్లవి. అందుకే సాయి ప‌ల్ల‌వి ఉంటే ఆ సినిమాకి అద‌న‌పు గౌర‌వం ద‌క్కుతుంది. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఆ నాట్యానికి తాళం వేయ‌ని మ‌న‌సు లేదు.

మ‌ళ‌యాళంలో ‘ప్రేమమ్’ రిలీజ్ అయి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తే.. కుర్రాళ్ళందరూ మ‌ల‌ర్ క్యారెక్టర్ లో నటించిన సాయపల్లవితో ప్రేమ‌లో ప‌డిపోయారు. ఆ ‘ప్రేమమ్’ మానియా తెలుగు ప్రేక్ష‌కుల‌కు తాకింది. సాయి ప‌ల్ల‌వి క్రేజ్ అంత‌లా పెరిగింది. చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చినా శేఖ‌ర్ క‌మ్ముల చెప్పిన క‌థ కు త‌లూపింది సాయిప‌ల్ల‌వి. అలా ‘ఫిదా’ వంటి అంద‌మైన ప్రేమ‌క‌థ‌లో భానుమ‌తిలా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమాలో ఈ హైబ్రీడ్ పిల్ల న‌ట‌న‌కు, నృత్యానికి యూత్ ఫిదా అయ్యింది.

‘ఫిదా’ త‌ర్వాత ‘ఎమ్.సి.ఎ’ మూవీతో మ‌రో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం త‌న ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నానీ ని ఏడిపిస్తూ ప్రేమించే పల్ల‌వి చేసే అల్ల‌రి ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ఆ తర్వాత చేసిన ‘ప‌డిప‌డిలేచే మ‌న‌సు’ క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కాక‌పోయినా సాయి ప‌ల్ల‌వి పాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రెగ్యుల‌ర్ క‌థ‌ల‌లో క‌నిపించిడానికి సాయి ప‌ల్ల‌వి పెద్ద‌గా ఆస‌క్తి చూప‌దు. అందుకే కొన్ని ప్ర‌యోగాల‌ను చేసింది. ఈకోవలోనే వచ్చిన ‘క‌ణం’ న‌టిగా సాయిపల్లవికి మంచి తీసుకొచ్చింది. ‘కణం’తో పాటు తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన ‘మారి-2, ఎన్.జి.కె’ ఈ నేచురల్ బ్యూటీకి పరాజయాల్ని మిగిల్చాయి.

అలాంటి సమయంలో సాయిపల్లవిని ఆదుకుంది మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమే. తనకు ‘ఫిదా’ వంటి హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల ఈసారి ‘లవ్ స్టోరీ’ ఇచ్చాడు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటకు మంచి పేరొచ్చింది. ఈ మూవీలో మౌనిక రాణి పాత్రలో తన సహజ నటనతో మెప్పించింది. ‘ఎమ్.సి.ఎ’ తర్వాత నానితో నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ పీరియడ్ డ్రామాలో సాయిపల్లవి చేసిన నృత్యాలను ఎప్పటికీ మరువలేం.

రానాతో నటించిన ‘విరాట పర్వం’ తర్వాత సినిమాలు చేస్తోందా? లేదా? అనే సస్పెన్స్ మొదలైంది. చాలా రోజుల పాటు సాయిపల్లవి కొత్త సినిమాలను ఒప్పుకోలేదు. అయితే.. శివ కార్తికేయన్ తో ‘అమరన్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం తమిళంలో ‘అమరన్’ సినిమాతో పాటు.. తెలుగులో ‘తండేల్’ సినిమాలో నటిస్తుంది.

ఆన్ స్క్రీన్ పై నాగచైతన్య, సాయిపల్లవి క్యూట్ పెయిర్. ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని ప్రేమలోకంలో విహరింపజేసిన ఈ జంట.. మరోసారి ‘తండేల్’ కోసం జోడీ కట్టారు. ఈ సినిమాలో చైతన్య రాజు పాత్రలో జాలరిగా కనిపించబోతుండగా.. అతని ప్రియురాలిగా బుజ్జి పాత్రలో సాయిపల్లవి అలరించబోతుంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి రాబోతున్న ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ‘తండేల్’ రెడీ అవుతోంది.

మరోవైపు.. హిందీలోనూ రెండు సినిమాలతో బిజీ అయ్యింది సాయి పల్లవి. వాటిలో ఒకటి రణ్‌బీర్ తో నటిస్తున్న ‘రామాయణ్’. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీలో సీత పాత్రలో కనిపించబోతుంది సాయిపల్లవి. అలాగే.. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తోనూ హిందీలో ఓ సినిమాలో నటిస్తుంది సాయిపల్లవి. ఈ చిత్రం ఆమధ్య జపాన్ లో ఓ కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మొత్తంమీద.. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Related Posts