మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపించనున్నాడట మెగాస్టార్. చిరుకి ఐదుగురు చెల్లెల్లు ఉంటారనే ప్రచారం ఉంది. ఇక.. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. మరో కీలక పాత్రలో ఖుష్బూ కనిపించనుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘విశ్వంభర’.. ప్రస్తుతం అన్నపూర్ణ 7ఎకర్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
రెబెల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడూ లేనంతగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవిధంగా పాన్ ఇండియా లెవెల్ లో మరే హీరో కూడా ప్రభాస్ ఉన్నంత బిజీగా లేరంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు ‘కల్కి’ చిత్రాన్ని విడుదలకు ముస్తాబు చేస్తోన్న ప్రభాస్.. మరోవైపు మారుతి సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్-మారుతి మూవీ ‘రాజా సాబ్’ శంషాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే.. ‘కల్కి’ చిత్రంలోని కొంచెం ప్యాచ్ వర్క్ ను శంకరపల్లిలో చిత్రీకరిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రాబోతోన్న మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ‘పుష్ప 2’. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీకోసం మలేషియాని పోలిన సెట్స్ ను ఫిల్మ్ సిటీలో వేశారట. అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదలకానుంది.
మరోవైపు.. ‘దసరా, హాయ్ నాన్న’ వంటి వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న నాని.. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నానితో ‘అంటే సుందరానికి’ వంటి ఫక్తు ఎంటర్ టైనర్ రూపొందించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈసారి ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘సరిపోదా శనివారం’ రాబోతుంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా హైదరాబాద్ పాత బస్తీ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇటీవలే ‘ది ఫ్యామిలీ స్టార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ 12వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో విజయ్ ను.. ఎంతో సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల రామ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ‘డబుల్ ఇస్మార్ట్’ గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది టీమ్.
ఇక.. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ హైదరాబాద్ బి.హెచ్.ఈ.ఎల్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. గీతా ఆర్ట్స్ నుంచి రాబోతున్న ఈ మూవీని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. డిసెంబర్ 20న ‘తండేల్’ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది.
శర్వానంద్ హీరోగా.. అభిలాష్ కంకర డైరెక్షన్ లో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. ఓ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రాబోతుందట. ఇక.. అజిత్ , అధిక్ రవిచంద్రన్ కాంబోలో తెరకెక్కుతున్న మైత్రీ మూవీ మేకర్స్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. బడా మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ టీజర్ ఈరోజే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విడుదల కాబోతుంది. ఈ సినిమాని మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ప్రభాస్ మొదలుకొని అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.