‘బాహుబలి‘కి మించిన రీతిలో ‘పుష్ప 2‘

వెండితెరపై భారీతనం అనే పదానికి అసలు సిసలు నిర్వచనం ‘బాహుబలి‘. యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా, సన్నివేశాల చిత్రీకరణ పరంగా.. పాటల పరంగా ‘బాహుబలి‘తో దర్శకధీరుడు రాజమౌళి ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ‘బాహుబలి‘ సిరీస్ తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన మరో చిత్రం ‘పుష్ప‘. ‘బాహుబలి‘ తరహాలోనే రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ‘పుష్ప 1‘ సూపర్ హిట్ అవ్వడంతో ‘పుష్ప 2‘పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

లేటెస్ట్ గా ‘పుష్ప 2‘కి సంబంధించి ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ మొదలయ్యిందట. ఈ షెడ్యూల్ లో ఓ జాతర పాటతో పాటు.. ఫైట్, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇక.. ఈరోజు నుంచి ‘పుష్ప ది రూల్‘కి సంబంధించి పాట చిత్రీకరణ మొదలైనట్టు తెలుస్తోంది. వంద మందికి పైగా డ్యానర్స్, దాదాపు నాలుగు వందల మంది జూనియర్స్.. ఇంకా.. వివిధ ప్రాంతాల నుంచి జాతర వేషాల్లో వచ్చిన ఆర్టిస్ట్స్ కలిపి.. ఈ పాట వెండితెరపై కనీవినీ ఎరుగని జాతరను తలిపించే విధంగా ఉండబోతుందట.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన ట్యూన్ కి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడట. ‘పుష్ప‘ పార్ట్ 1 లోని గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన ‘దాక్కో దాక్కో మేక‘ పాట సృష్టించిన సంచలనం ఎలాంటిదో చూశాం. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు.. ముఖ్యంగా ‘బాహుబలి‘ పార్ట్ 1 లోని ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ కి మించిన రీతిలో ఈ పాటను తీర్చిదిద్దుతున్నారట. ఈ పాటలో డ్యాన్సర్స్, జూనియర్స్ తో పాటు పుష్పరాజ్ వేసే స్టెప్పులు థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయట. వచ్చే యేడాది ఆగస్టు 15న, ‘పుష్ప ది రూల్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts