ఫైట్ తో ప్రారంభమైన బాలకృష్ణ-బాబీ చిత్రం

సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకోవడం అంటే నటసింహం బాలకృష్ణకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేస్తాడు. ‘భగవంత్ కేసరి‘ ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూనే ఉంది. మరోవైపు తాజాగా తన 109వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది.

బాలకృష్ణ అంటేనే ఊరమాస్ యాక్షన్ స్టార్. అందుకే.. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ బాబీ. ఈ చిత్రాన్ని ఈ రోజు నుంచి ఓ ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభించారట. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్టు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దారు. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాని సమర్పిస్తోంది.