Featured

తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్

తెలుగువారి కీర్తిబావుటాను ఖండఖండంతరాలలో ఎగరేసిన అద్వితీయ కళామూర్తి.. తెలుగు జాతి పౌరుషం.. తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం.. ఆయనే నందమూరి తారక రామారావు. ఈరోజు (మే 28) ఎన్టీఆర్ జయంతి.

నందమూరి తారక రామారావు 1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది.

1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరవాతే రామారావు బి.ఎ. పూర్తిచేశారు. తొలి సంతానం కలిగిన తరవాత ఆయన రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ, ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మద్రాసు పట్టణానికి బయలుదేరి వెళ్లారు.

తెలుగునాట రంగస్థలంమీద ప్రతిభావంతుడైన నటుడిగా అందరి మన్ననలను పోగు చేసుకుని, తెలుగుచిత్రసీమలో తొలి అడుగువేసిన ఎన్టీఆర్ ‘మనదేశం’ చిత్రంలో ఓ చిన్న పోలీసు పాత్రతో ప్రేక్షకులకు పరిచయ్యారు. కంచుఘంటలాటి కంఠం, నిలువెత్తు స్ఫురద్రూపం, ఉంగరాల జుత్తు, కోటేరులాంటి ముక్కు వెరసి నందమూరి రాబోయే సంచలనవిజయాల పర్వానికి ముఖచిత్రంలా అందరినీ ఆకర్షించడంతో చిత్రపరిశ్రమ తనకు తానై ఆయనకు వెండితెర వైభవం దిశగా వెండి తివాచి పరచింది.

తర్వాత రోజులలో ‘పెళ్ళిచేసిచూడు’ వంటి సాంఘిక చిత్రాలు, ‘పాతాళభైరవి’ వంటి జానపదచిత్రాలతో ఆయన జైత్రయాత్ర ధ్వజస్తంభపు జేగంటల ప్రతిధ్వనుల నేపధ్యంలో విజయదుందుభిలు మ్రోగించింది. అయన ఏ పాత్ర పోషించినా, ఏ చిత్రానికి తెరరూపం కల్పించినా తిరుగులేని ప్రతిభతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో విరాజిల్లి అడుగులన్నీ పిడుగులై, మలుపులన్నీ గెలుపులై నందమూరి తెరజీవన ప్రయాణం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఫలించి, విస్తరించి, విశృంఖలంగా విహరించింది.

చిత్రపరిశ్రమలో మెలకువలను అవపోశన పట్టిన నందమూరి అనతికాలంలోనే నిర్మాతగా, దర్శకుడిగా రూపాంతరం చెంది ‘జయసింహ’, ‘పాండురంగమహాత్యం’, ‘సీతారామకళ్యాణం’ వంటి పౌరాణిక చిత్రరాజాలను తనను ఆరాధించే ప్రేక్షకులకు చిరస్థాయిగా నిలిచిపోయే బంగారుకానుకలుగా అందించారు.

ఒకవైపు సంవత్సరానికి అరడజను సినిమాల చొప్పున నటిస్తూనే.. దర్శకుడిగానూ రాణించారు ఎన్టీఆర్. నటరత్న ఏకంగా 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ‘సీతారామకళ్యాణం’, ‘గులేభకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘తల్లా పెళ్లామా’, ‘తాతమ్మ కళ’, ‘దాన వీర శూర కర్ణ’ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.

?????????????????????????????????????????????????????????????????????

అలనాడు నందుడి ఇంట వెలసిన శ్రీకృష్ణపరమాత్మ మళ్ళీ, నందమూరి వారి ఇంట జన్మించాడా అన్నట్టుగా, ఆయోధ్యలో పుట్టిన రాముడు మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఊపిరి పోసుకున్నాడా అనిపించేటట్టుగా నందమూరి ధరించిన శ్రీకృష్ణ, శ్రీరామ పాత్రలు ఆబాలగోపాలాన్ని మురిపించి, అలరించి, ఆనందడోలికలలో ఊయలలూగించాయి. పురాణాల పరంగా దుష్టపాత్రలుగా పేరుపడ్డ దుర్యోధన, రావణ పాత్రలను తనదైన విలక్షణరీతిలో పోషించి, చిత్రీకరించి ఆయా పాత్రలకు ఆజరామరమైన కీర్తిప్రతిష్టలను కట్టపెట్టిన చారిత్రకప్రాధాన్యతకి ఆయన జీవితమే ఒక నిలువెత్తు నిదర్శనం. ఎన్నటికీ చెరిగిపోని సంతకం.

దశాబ్దాల తరబడి వెండితెర వేంకటేశ్వరుడిగా, రంగులతెర రాముడిగా అశేషాంధ్ర ప్రేక్షక జననీరాజనాలను అవిశ్రాంతంగా కైవశం చేసుకుని, ప్రజాశ్రేయస్సుకు తిరుగులేని పట్టం కట్టి, అఖండాంధ్ర ప్రదేశ్ ఆరాధ్యముఖ్యమంత్రిగా చరిత్రకే సరికొత్తచరిత్రను అలవరిచిన మాననీయుడు, మహనీయుడు నందమూరి తారకరామారావు.

స్యయంగా నిర్మించి, నటించిన సాంఘిక చిత్రాలను సైతం సామాజికరుగ్మతలను ప్రశ్నిస్తూ, మానవసంబంధాలను ప్రతిబింబిస్తూ, కుటుంబానుబంధాలను ప్రతిఫలిస్తూ సామాజికప్రయోజనాల పరంగా, సాంఘికాచారాలకు అనుగుణంగా మాత్రమే రూపోందించిన ఘనత, సమగ్రత, వ్యక్తిత్వ పరిపక్వత భారతీయ చిత్రపరిశ్రమలో కేవలం నందమూరికి మాత్రమే సొంతం. ‘వరకట్నం’, ‘తల్లాపెళ్ళామా’, ‘ఉమ్మడికుటుంబం’, ‘కోడలు దిద్దిన కాపురం’ వంటి చిత్రాలే అందుకు వెండితెర సాక్షిగా వాస్తవిక నిదర్శనాలు. యావత్తు తెలుగుజాతి ఒక్కటే అనే సహృదయభావంతో తల్లాపెళ్ళామా చిత్రంలో నందమూరి పొందుపరిచిన తెలుగుజాతి మనది పాట తెలుగువారు ఎక్కడ ఉన్నా నిరంతరం గుండెలను కుదిపేస్తుంది.

కుటుంబ సంబంధాలు, ధర్మం, న్యాయం, చట్టం అన్నిటినీ తన సినిమా పాటల్లో స్పృశించారు. ఏదైనా సినిమాలో ఎన్టీఆర్ సోలో సాంగ్ అందుకున్నారంటే థియేటర్లు ప్రేక్షకుల విజిల్స్‌తో దద్దరిల్లేవి. ఆ పాటలు చదువురాని సామాన్యుడిలో కూడా ఆలోచనలు రగిలించేవి. ఆ పాటలు పాడేది తెర వెనుక గాయకులే అయినా వాటికి తెరపై ప్రాణ ప్రతిష్ఠ చేసేవారు ఎన్టీఆరే. తన అభినయంతో ఆ పాటలను తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిపారని ఆయన అభిమానులు భావిస్తారు.

నందమూరి తారకరామారావు జీవితం క్రమశిక్షణకు, అకుంఠితదీక్షాదక్షతలకు, ఆహర్నిశల అవిశ్రాంత పోరాటానికి అద్దం పడుతుంది.. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచ్ లో అభ్యాసం చేసేవారు. ‘నర్తనశాల’ సినిమా కోసం నటరత్న 40 ఏళ్ల వయసులో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. వృత్తిపట్ల తారకరాముడు నిబద్ధత అటువంటిది.

ప్రధమార్ధంలో అభినయకళే పరమార్ధంగా, ద్వితీయార్ధంలో సమాజమే దేవాలయం అనే పవిత్రాశయమే నినాదంగా. కంటిమీద కునుకులేకుండా కదలిన ఓ నిత్యచైతన్యరథం ఎన్టీఆర్ జీవనచరితం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నందమూరి తారక రామారావు ఆగమనం ఓ పెను సంచలనం. చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి.. 9 నెలల రికార్డు సమయంలో ముఖ్యమంత్రిగా విజయకేతనం ఎగురవేశారు ఎన్టీఆర్. ముప్పై మూడేళ్ళ తెర జీవితంలోనూ, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయులు. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. అతిసామాన్యుడు నుంచి అసామాన్యుడుగా నందమూరి తారకరామారావు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం.

Telugu70mm

Recent Posts

Global star completed the ‘Game Changer’.

The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…

18 hours ago

‘Kalki’ looted Rs.800 crore worldwide

Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…

18 hours ago

రామ్-సంజయ్ దత్ పోరాటానికి ఇక 40 రోజులే..!

సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…

19 hours ago

‘గేమ్ ఛేంజర్‘ను పూర్తిచేసిన గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‘. అసలు ఈ…

20 hours ago

ప్రపంచ వ్యాప్తంగా రూ.800 కోట్లు కొల్లగొట్టిన ‘కల్కి‘

పదో రోజు లోకి ప్రవేశించినా ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి‘ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. విడుదలైన 9 రోజుల్లో ఈ సినిమా…

20 hours ago

Taapsee Pannu

22 hours ago