NBK 109 గ్లింప్స్.. బాలయ్య హంటింగ్ మొదలైంది

నటసింహం నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ NBK 109. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్యతో.. ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలయ్యతో.. యాక్షన్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించే సినిమా ఎలాగుంటోంది? వైలెన్స్ కే బాప్ లా ఉంటుంది. శివరాత్రి కానుకగా NBK 109 నుంచి రిలీజైన గ్లింప్స్ అలాగే ఉంది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘NBK109’నుండి చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేసింది. యాక్షన్ సీక్వెన్స్‌ తో రూపొందించిన గ్లింప్స్ లో నందమూరి బాలకృష్ణ (NBK)కి సరికొత్త అర్థం చెప్పాడు బాబీ. ఎన్.బి.కె అంటే.. నేచురల్ బోర్న్ కింగ్ గా చూపించాడు. ఈ గ్లింప్స్ లో కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టాడు నటసింహం.

బాలకృష్ణ తన టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్‌ ని తీసుకెళ్లడం మనం చూడవచ్చు. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం ఆకట్టుకుంది. “ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?” అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా.. “సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ వేట మొదలుపెట్టడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ ను “కల్ట్ సరుకు” అని పిలవడం మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్ ఇస్తోంది.

మొత్తానికి ‘NBK109’ గ్లింప్స్ అభిమానులను, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో బాలకృష్ణ-బాబీ డియోల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలను మనం ఆశించవచ్చు. సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు

Related Posts