ఆస్కార్ ను గెలిచిన తెలుగువాడి నాటు దనం

తెలుగు సినిమా.. ఎన్ని మైలురాళ్లు దాటింది. ఎన్ని అపురూప విజయాలు చూసింది. ఎన్ని రికార్డులు, రివార్డుల కొల్లగొట్టింది..? వందేళ్ల తెలుగు సినిమా చరిత్రకు ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఇంకా చెబితే 1931లో వచ్చిన భక్త ప్రహ్లాద నుంచి మొదలైన నేపథ్య గానం, గేయరచనల స్ఫూర్తి నేడు ఆ చంద్ర తారార్కం నిలిచే కీర్తిని గడించింది. ఇన్నాళ్లూ.. ఇన్నేళ్లూ.. ఇది మనది కాదు..

ఇది మనకు దక్కదు అని భారతీయ సినిమా భావించిన ఆస్కార్ అవార్డ్ ఇవాళ తెలుగు వాడి వాణికి, బాణీకి తలవంచక తప్పలేదు. ఒక్క పాటతోనే ఎన్నో సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకున్న చరిత్రను చూశాం. సినిమాలు ఎలా ఉన్నా.. ఆ పాట కోసం రిపీటెడ్ ఆడయన్స్ నూ మన థియేటర్స్ చూశాయి. అప్పుడు అవి మనకే పరిమితం. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట దేశాన్ని దాటి ఖండాంతరాలను ఊపేసింది. పాటలోని సాహిత్యం అందరికీ అర్థం కాకపోయినా..

ఆ పాటకు కట్టిన బీట్ కు తెలియకుండానే అడుగులు కదిపింది ప్రపంచం. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు భాషతో పనిలేకుండా.. ఏ దేశం అన్న భేదం కనిపించకుండా ప్రతి ఒక్కరూ చిందులు వేశారు. థియేటర్ లో ఆ పాటను సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటి పాటకు ఇవాళ ప్రపంచమంతా గర్వంగా చెప్పుకునే.. ఇంకా చెబితే.. ప్రపంచ సినిమాకు ఇదే అత్యుత్తమ అవార్డ్ గా భావించే ఆస్కార్ రావడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ ఈ పాట వెనక కృషి, సాహిత్యంతో పాటు బాణీ కోసం, ఆ బాణీని సార్వజనీనం చేయడంలో సంగీత దర్శకుడి ప్రతిభ, గాయకుల పర్ఫెక్షన్.. ఈ మొత్తాన్ని ఆబాలగోపాలం అలరించేలా సినిమా దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా నృత్యాలు సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ ప్రతిభ, ఇప్పటికే ది బెస్ట్ డ్యాన్సర్స్ అనిపించుకున్నా..

కేవలం దర్శకుడి ఆలోచన కోసం 17సార్లు ఆ పాట కోసం ఒళ్లంతా హూనమయ్యేలా స్టెప్పులు వేసి థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేసిన నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సహనం.. వెరసి ఒక ఆస్కార్ అవార్డ్. అందుకే ఇది కేవలం పాటకు వచ్చిన అవార్డ్ గా కాదు.. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తో పాటు తెలుగువాడికి దక్కిన పురస్కారంగానే చూడాలి. ఇన్నాళ్లూ మన సినిమా దక్షిణాదినే దాటలేకపోయింది. ఆ మాటను దాటించి దక్షిణాది కూడా మన సినిమా తర్వాతే అనేలా చేసిన దర్శకుడు రాజమౌళి.

మగధీర నుంచి మొదలైన ఆయన దండయాత్ర ఈగ, బాహుబలి నుంచి నేడు ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ వరకూ చేరింది. అందుకే ఈ అవార్డ్ కేవలం తెలుగు సినిమాకు కాదు.. భారతీయ సినిమాకే దక్కిన గౌరవంగా చూడాలి. ఈ ఘనతను సంగీత దర్శకుడు కీరవాణి సాధించడం యాధృచ్చికమో కాకతాళీయమో కాదు.. సందర్భం. ఆ సందర్భం కోసం కొన్ని నెలలుగా కోట్లమంది ప్రజలు, అభిమానులు ఎదురుచూశారు. వారి ఎదురు చూపులు ఫలించిన వేళ.. దేశమంతా నాటు నాటు అంటూ ప్రేమగా స్పందిస్తోంది. అన్ని పరిశ్రమల నుంచీ ప్రశంసల వెల్లువ కురుస్తోంది.


నాటు నాటు పాటకు ప్రపంచం అంతా వింటోన్న సాహిత్యాన్ని కూర్చడానికి చంద్రబోస్ 18 నెలలు కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితమే ఇది. ఆ సాహిత్యానికి అద్బుతమైన బాణీని కూర్చేందుకు కీరవాణి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.. దానికి దక్కిన గౌరవం ఇది. కవి సాహిత్యానికి పట్టం కట్టి, సంగీతకారుడి బాణీకి ప్రాణం పోసి స్వరమంతా భాస్వరం నింపుకుని పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల సమ్మోహన గానానికి జరిగిన సన్మానం ఇది. సందర్భానుసారంగా వచ్చే ఈ పాటలోని బీట్స్ ను ఇద్దరు టాప్ హీరోల అభిమానుల నుంచి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకునేలా దర్శకుడు రాజమౌళి చేసిన సూచనను తూ.చా తప్పకుండా పాటించి అద్భుతమైన స్టెప్పులు కూర్చేందుకు వందలాది రిహార్సల్స్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కృషికీ దక్కిన గుర్తింపు ఇది.

అయితే నేడు భారతదేశం అంతా జరుపుకుంటోన్న ఈ సంబురానికి కారణం ఒకే ఒక్కడు. ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి షాట్ కు యాక్షన్ చెప్పిన నాటి నుంచి నేడు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ఎనౌన్స్ కావడం వరకూ అన్నీ తానే అయిన ఆ కెప్టెన్ రాజమౌళి. సినిమాను ప్రేమించేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ శ్వాసించే వాళ్లే అరుదు. ఆ అరుదైన వారిలో దేశం మొత్తం ఒకే ఒక్కడు అనే బిరుదాంకితుడైన ఎస్ఎస్ రాజమౌళితో పాటు మన సినిమా మరెన్నో అంతర్జాతీయ వేదికలపై అవార్డులు రివార్డులూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ఎంటైర్ ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు హార్టీ కంగ్రాట్యులేషన్స్..

Related Posts