Featured

‘లవ్ మీ‘ రివ్యూ

నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య, సిమ్రాన్‌ చౌదరి, రవికృష్ణ, సంయుక్త తదితరులు
సినిమాటోగ్రఫి: పిసి శ్రీరామ్‌
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్‌: సంతోష్ కామిరెడ్డి
నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి
దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు
విడుదల తేది: 25-05-2024

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్, రొమాంటిక్ లవ్ స్టోరీస్. అయితే.. గత చిత్రాలకు భిన్నంగా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా ‘లవ్ మీ‘. ఘోస్ట్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన హారర్ థ్రిల్లర్ ఇది. ‘లవ్ మీ.. ఇఫ్ యూ డేర్’ అనే టైటిల్ తో అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి, పి.సి.శ్రీరామ్ వంటి లెజెండరీ టెక్నిషియన్స్ ఈ మూవీకి పనిచేశారు. ఓ విభిన్నమైన కథా చిత్రంగా ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన ‘లవ్ మీ‘ ఎలా ఉంది? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
కథ విషయానికొస్తే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్ (రవికృష్ణ) ఇద్దరూ అన్నదమ్ములు. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే.. అర్జున్‌ కు దేవుడు, దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాల గురించి ప్రస్తావన వస్తే చాలు.. అక్కడ ప్రత్యక్షమై దెయ్యాలు లేవని సాక్ష్యాధారాలతో నిరూపిస్తుంటాడు. అలాగే.. అందరూ అద్భుతాలు, మూఢనమ్మకాలు అని భావించే వాటిని వీళ్ళు ఈజీగా క్లియర్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.

ఈకోవలోనే ప్రతాప్ తన ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) నుంచి దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఆమె తెలంగాణ, కర్ణాటక బోర్డర్లో ఒక అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెబుతోంది ప్రియ. ఆ కథ విన్నాక అర్జున్‌ ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాడు. మరి.. దెయ్యమైన దివ్యవతితో అర్జున్ ప్రేమలో పడ్డాడా? అసలు దివ్యవతి కథను అర్జున్‌, ప్రతాప్ ల దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది? వంటి విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
తెలుగు చిత్ర పరిశ్రమ ఒకప్పుడు దెయ్యం కథలపై పెద్దగా ఆసక్తి చూపించేది కాదు. కానీ.. ఇప్పుడు అన్ని వుడ్స్ లోనూ హారర్ ట్రెండ్ జోరుగానే సాగుతుండడంతో.. టాలీవుడ్ లోనూ ఇలాంటి సినిమాల జోరు పెరిగింది. ‘విరూపాక్ష‘ వంటి హారర్ థ్రిల్లర్ తర్వాత మళ్లీ తెలుగులో అంత హైప్ తెచ్చుకున్న మూవీ ‘లవ్ మీ‘.

ఓ యువకుడు దెయ్యాన్ని ప్రేమలో దింపాలని ప్రయత్నించడం అనే విభిన్నమైన పాయింట్ తో ‘లవ్ మీ‘ రూపొందింది. కథగా చెప్పుకోవడానికి సులువుగానే ఉన్నా.. ఆ పాయింట్ ను వెండితెరపై ఆవిష్కరించడం అంటే కత్తిమీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే.. దెయ్యాన్ని మనిషి ప్రేమించడమన్నది కన్విన్సింగ్‌గా చెప్పడం ఎంతో సవాల్ తో కూడుకున్న విషయం.

దెయ్యమే తన కథను నేరేట్ చేసిన విధంగా ఈ మూవీ స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ గురించి.. దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం.. ఆ తర్వాత దెయ్యంతో అర్జున్ సన్నివేశాలు వంటివి ఫస్టాఫ్ లో ఆకట్టుకుంటాయి. ఒక విధంగా ఈ సన్నివేశాలన్నీ సెకండాఫ్ పై అంచనాలు పెంచడంలో బాగా ఉపయోగపడ్డాయి.

కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి.. ముగ్గురు అమ్మాయిలు మిస్సవ్వడం.. ఆ ముగ్గురు అమ్మాయిల గురించి.. దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ వంటి వాటితో కథనం బాగా కన్ఫ్యూజన్ గా తయారవుతోంది. కొన్ని ట్విస్ట్స్ ముందే ఊహించినట్టుగా ఉండడం కూడా ‘లవ్ మీ‘ స్క్రీన్ ప్లే లోపంగా చెప్పొచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
తొలి సినిమా ‘రౌడీ బాయ్స్‘లో కాలేజ్ కుర్రాడిగా అదరగొట్టిన ఆశిష్.. ఈ సినిమాలో అర్జున్ పాత్రలో సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమాకి ఈ చిత్రానికీ తన నటనలో మెచ్యూరిటీ కనబర్చాడు ఆశిష్. ఇక.. వైష్ణవి చైతన్యకి ఈ సినిమాలోనూ మంచి రోల్ దొరికింది. ఒక విధంగా.. ‘బేబి‘ తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరిని ప్రేమించే అమ్మాయిగా వైష్ణవి కనిపించింది. మొదట ప్రతాప్ ప్రియురాలిగా పరిచయం అవ్వడం.. ఆ తర్వాత అతని సోదరుడు అర్జున్ ని లవ్ చేయడం వంటివి ‘బేబి‘ సినిమాని గుర్తుకు తెస్తాయి. ‘విరూపాక్ష‘ తర్వాత రవికృష్ణకు మంచి ప్రాధాన్యత గల పాత్ర ఈ సినిమాలో దక్కింది. ఇంకా.. సిమ్రాన్ చౌదరి వంటి వారు తమ పాత్రల మేరకు నటించారు.

సినిమా చూస్తున్నప్పుడు.. హారర్ లవ్ స్టోరీ అనే పాయింట్ ను తీసుకుని.. అందులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జానర్ ను కలిపి.. కథను దర్శకుడు అరుణ్ గందరగోళం చేశాడా? అనే డౌట్స్ రాక మానవు. తాను రాసుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని లాజికల్‌గా ప్రేక్షకులు కన్విన్స్‌ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు. ఇక.. ఆస్కార్ విజేత కీరవాణి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే. ఇక.. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ విజువల్స్ ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చివరగా
మొత్తానికి.. కథా నేపథ్యం, ట్విస్టులు బాగున్నా.. కథకు తగ్గట్టు ఆసక్తి రేకెత్తించే స్క్రీన్ ప్లే లేకపోవడం ‘లవ్ మీ‘ చిత్రానికి పెద్ద మైనస్.

Telugu 70mm

Recent Posts

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

1 hour ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

3 hours ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

3 hours ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

4 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

4 hours ago