సీనియర్ వంశీకి జన్మదిన శుభాకాంక్షలు

తెలుగు చిత్ర పరిశ్రమలో విశ్వనాథ్, బాపు వంటి విలక్షణ తరహా దర్శకుల జాబితాలో చేరే మరో డైరెక్టర్ వంశీ. వంశీ అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. 1956, నవంబర్ 20న తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో జన్మించాడు వంశీ. రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీ.. తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. 1982లో తన 26 ఏళ్ల వయసులో ‘మంచు పల్లకి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే.. డైరెక్టర్ గా వంశీకి తొలి విజయాన్నందించిన చిత్రం ‘సితార’. వంశీ తానే రాసుకున్న ‘మహల్లో కోకిల’ నవల ఆధారంగా ‘సితార’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ద్వారానే భానుప్రియ కథానాయికగా పరిచయం అయ్యింది.

థ్రిల్లర్ జానర్స్ లో స్పెషలిస్ట్
తెలుగులో థ్రిల్లర్స్ తీయడంలో తనదైన మార్క్ వేశాడు వంశీ. అలా.. వంశీ దర్శకత్వంలో తొలిసారి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించిన చిత్రం ‘అన్వేషణ’. కార్తీక్, భానుప్రియ జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకి ఇళయరాజా అందించిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరాయి. ‘అన్వేషణ’ తర్వాత వంశీ నుంచి థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘అనుమానాస్పదం’ వంటి చిత్రాలు మంచి ప్రశంసలు పొందాయి.

రాజేంద్రప్రసాద్ ను కథానాయకుడిగా నిలిపిన వంశీ
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ను కథానాయకుడిగా నిలబెట్టిన ఘనత వంశీదే. వంశీ దర్శకత్వంలో ‘మంచు పల్లకి’, ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాలలో నటించిన రాఉఏంద్రప్రసాద్ ను హీరోగా నిలబెట్టిన చిత్ర ‘లేడీస్ టైలర్’. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా వంశీ తీర్చిదిద్దిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత ‘ఏప్రిల్ 1 విడుదల’తో మరో హిట్ అందుకుంది వంశీ-రాజేంద్రప్రసాద్ కాంబినేషన్.

గోదావరి నేపథ్యంలో సినిమాలు
తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన వంశీకి గోదావరి అంటే ఎంతో అభిమానం. అందుకే.. తన సినిమాల్లో ఏదొక రూపంలో గోదావరిని చూపిస్తూనే ఉంటాడు. అంతేకాదు.. గోదావరి జిల్లాల యాసతో.. తన సినిమాల్లో కామెడీకి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటాడు. ఇక.. రీ-ఎంట్రీలో వంశీ తీసిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి సినిమాలు రొమాంటిక్ టచ్ తో ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్స్ గా ఆడియన్స్ ను అలరించాయి. ‘లేడీస్ టైలర్’ సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్’ సినిమాని తీశాడు వంశీ. అయితే.. ఈ చిత్రం విజయాన్నందించలేకపోయింది. ఇక.. అప్పట్నుంచీ కొత్త సినిమాని ప్రకటించలేదు. ఇక.. గోదావరి పరివాహక ప్రజల కథలతో సాగే ‘పసలపూడి కథలు’, ‘మా దిగువ గోదావరి కథలు’ వంటి పుస్తకాలతో సాహిత్య రంగంలో వంశీకి మంచి పేరుంది. ఆ గోదావరి కథలను వెబ్ సిరీస్ గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడట ఈ సీనియర్ డైరెక్టర్. త్వరలోనే.. వంశీ వెబ్ సిరీస్ పై క్లారిటీ రానుంది.

Related Posts