కరోనా సమయంలో థియేటర్లు లేని లోటును తీర్చాయి ఓటీటీలు. ఆ సమయంలోనే అగ్ర కథానాయకులు, కథానాయికలు సైతం వెబ్ సిరీస్ లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. థియేటర్లు ప్రారంభైన తర్వాత కూడా వెబ్ సిరీస్ ల హవా కొనసాగుతూనే ఉంది. ఇక.. తెలుగులో అగ్ర కథానాయకుల విషయానికొస్తే దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ఇప్పటికే ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో మెరిసారు. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ నుంచి నాగచైతన్య ‘ధూత’ సిరీస్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
అక్కినేని ఫ్యామిలీ హీరోలతో పలు సినిమాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ధూత’ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. లేటెస్ట్ గా ఈ సిరీస్ రిలీజ్ డేట్ సెట్ అయ్యిందట. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ‘ధూత’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోందట. రూ.40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ లో 40 నిమిషాల చొప్పున 8 ఎపిసోడ్స్ ఉంటాయట. ఈ సిరీస్ లో నాగచైతన్యతో పాటు పార్వతి తిరువోత్తు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.