బాలకృష్ణ ట్రెండ్ సెట్టింగ్ మూవీకి పాతికేళ్లు

తెలుగులో ఫ్యాక్షన్ కథాంశాలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. బి.గోపాల్ దర్శకత్వంలో చెంగల వెంట్రావు నిర్మించిన ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. పరుచూరి బ్రదర్స్ మాటలు సమకూర్చారు. 1999, జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సమరసింహారెడ్డి’ అఖండ విజయాన్ని సాధించింది.

‘సమరసింహారెడ్డి’ సినిమాలోని కథాంశాన్ని రాయలసీమ ముఠాకక్షలు నేపథ్యంగా తీసుకున్నారు. తొలుత ఈ సినిమాను కథారచయిత విజయేంద్రప్రసాద్ బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాద్దామని భావించారట. అయితే.. విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా చేసుకున్నారు.


ఒకసారి విజయవాడ రైల్వేస్టేషన్లో స్థానికంగా బలం ఉండి.. గ్రూపు కక్షలు ఉన్న దేవినేని, వంగవీటి కుటుంబాల వారు ఒకేసారి రైలు దిగే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారి కోసం వచ్చిన ఇరువర్గాల వారు ఎదురుపడి ఉద్రిక్తత నెలకొనడం, దానివల్ల పోలీసుల్లో టెన్షన్ కలగడం ఈ సినిమాకి రచనా సహకారం చేసిన రత్నం నిజజీవితంలో స్వయంగా చూశారట. ఆ సంఘటన స్ఫూర్తిగానే ఈ సినిమాలోని ప్రధానమైన రైల్వే సీన్ రూపొందిందట. ఆ రైల్వే స్టేషన్ సీన్ అయితే సినిమాలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

‘సమరసింహారెడ్డి’ బాటలోనే తెలుగులో ఆ తర్వాత అనేక ఫ్యాక్షన్ కథాంశాలు రూపొందాయి. ఆ విధంగా ఇదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పార్శ్వాలున్న పాత్రలో అదరగొట్టాడు. ఒకవైపు పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా.. మరోవైపు ఒక మామూలు యువకుడిగా బాలకృష్ణ అభినయానికి ప్రశంసలు లభించాయి. బాలయ్యకి జోడీగా సిమ్రాన్, అంజలా జవేరి నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, పృథ్వీరాజ్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు వంటి వారు నటించారు. మణిశర్మ సంగీతంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి’ ఆల్బమ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఎక్కడా విన్నా.. ఈ పాటలే మారుమ్రోగేవి. వసూళ్ల పరంగా ‘సమరసింహారెడ్డి’ తెలుగులో సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

Related Posts