రవితేజ మాస్ ర్యాంపేజ్.. టైగర్ నాగేశ్వరరావు రివ్యూ

నటీనటులు: రవితేజ, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, మురళీ శర్మ, రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడీ, అనుకీర్తి వ్యాస్, సుదేవ్ నాయర్, ‘ఆడుకాలం’ నరేన్, ప్రదీప్ రావత్
రచన, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం : ఆర్. మది
విడుదల తేదీ: అక్టోబర్ 20, 2023

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలలోనే భిన్నమైనది ‘టైగర్ నాగేశ్వరరావు‘. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోగ్రాఫికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సర్కిల్స్ లోకి ఎంటరయ్యాడు రవితేజ. ‘దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త‘ సినిమాల ఫేమ్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించారు. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ‘టైగర్ నాగేశ్వరరావు‘ ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమైందా? ఈ విశ్లేషణలో చూద్దాం.

కథ
స్టూవర్ట్ పురంలో నాగేశ్వరరావు (రవితేజ) దొంగతనాలు చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్‌ గా మారతాడు. ఎవరినైనా కొట్టే ముందు, దేనినైనా కొట్టేసే ముందు చెప్పి మరీ చేయడం అతనికి అలవాటు. ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి తల నరకడం నుంచి మొదలు పెడితే.. అక్కడ రాజకీయ పోలీసు అధికారుల ప్రాణాలు తీసే వరకూ సాగిన అతని ప్రస్థానం. మధ్యలో మార్వాడీ అమ్మాయితో ప్రేమాయణం, మరదలితో పెళ్లి.. చివరకు నాగేశ్వరరావు జీవితానికి ముగింపు ఏమిటి? నాగేశ్వరరావు జీవిత లక్ష్యం నెరవేరిందా? అన్నదే ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమా కథ.

విశ్లేషణ
పాన్ ఇండియా మూవీస్ అనగానే భారీ బడ్జెట్ తో.. ప్రతీ సీన్ ఎంతో రిచ్ గా రూపొందాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే… బయోపిక్స్ తెరకెక్కించే విషయంలో మాత్రం కొన్ని పరిధిలు ఉంటాయి. ఆ కాలంలో నిజంగా వాళ్లు అలాగే చేశారా? లేదా? అనే విషయాలను పరిశీలించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంటుంది. అప్పట్లో ‘సైరా‘ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు‘ని చూసినా అదే అనిపిస్తుంది.

అసలు టైగర్ నాగేశ్వరరావు గురించి జనానికి తెలిసిన కథేంటి? నిజంగా టైగర్ నాగేశ్వరరావు ఇలాగే ఉన్నాడా? అనే అనుమానాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాగూ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బయట ప్రచారంలో ఉన్న రూమర్స్ ను బేస్ చేసుకుని తీశానని డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక సినిమా విషయానికొస్తే తాను ఏ దొంగతనం చేసినా ముందే చెప్పి చేసే టైగర్ నాగేశ్వరరావు ఏకంగా ప్రధాన మంత్రి ఇంటిలోనే దొంగతనం చేయడానికి సంకల్పిస్తాడు. అలా.. హై నోట్ లో ప్రారంభమైన ‘టైగర్ నాగేశ్వరరావు‘ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ప్రధాన మంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ (అనుపమ్ ఖేర్)తో ఆంధ్రా పోలీస్ అధికారి (మురళీ శర్మ) సమావేశం. టైగర్ నాగేశ్వరరావు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి ప్రస్తావించడం.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ట్రైన్ ఎపిసోడ్. ప్రచార చిత్రాల్లోనే ట్రైన్ ఎపిసోడ్ గురించి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అయితే సినిమాలో యాక్షన్ పరంగా ఈ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయని చెప్పొచ్చు.

యాక్షన్ మోడ్ లో పరుగెడుతున్న సినిమా నుపుర్ సనన్ తో టైగర్ నాగేశ్వరరావు లవ్ ట్రాక్ మొదలైనప్పటినుంచీ స్లో ఫేజ్ లోకి వచ్చేస్తుంది. ఇలాంటి హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో ఈ ఎపిసోడ్ బాగా సాగతీతగా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కథను ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో మళ్లీ స్టోరీ ట్రాక్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ.. చూపించిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీలింగ్ రావడంతో రెండో భాగంలో కూడా సినిమాతో ఎమోషనల్ కనెక్టివిటీ అంతగా ఉండదు. దానికి ప్రధాన కారణం సినిమా లెంత్. చివరిలో హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ వచ్చిన సన్నివేశాలు కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. ఫైనల్ గా ‘టైగర్ నాగేశ్వరరావు‘ మెస్సేజ్ ఆడయిన్స్ కు కనెక్ట్ అవ్వడంలో క్లారిటీ మిస్సైందని చెప్పొచ్చు.

నటీనట, సాంకేతిక వర్గం
టైగర్ నాగేశ్వరరావు గా టైటిల్ రోల్ లో రవితేజ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఈ సినిమాకోసం మిగతా భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో టెక్నాలజీ సాయంతో టీనేజ్ లుక్ లోనూ రవితేజా మెప్పిస్తాడు. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజా విషయంలో వినిపిస్తున్న డైలాగ్ డెలివరీ కంప్లైంట్ ఇక్కడా ఉంది. ఇక.. హీరోయిన్స్ పాత్రల విషయానికొస్తే నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు. గాయత్రి భరద్వాజ్ కి క్లైమాక్స్ సన్నివేశాల్లో పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సీన్స్ పడ్డాయి. వేశ్య పాత్రలో కనిపించిన అనుకీర్తి వ్యాస్ కూడా ఆకట్టుకుంటుంది.

అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, నాజర్ వంటి వాళ్లు కనిపించింది కాసేపే అయినా వారి పాత్రల్లో తమ సహజమైన ముద్ర వేశారు. అయితే.. ఈ సినిమా ప్రచార సభల్లో చెప్పినంతగా ఈ మూవీలో రేణు దేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర లేదనే చెప్పాలి. ఇంకా.. విలన్ పాత్రల్లో హరీష్ పేరడీ, జిషు షేన్ గుప్తా ఫర్వాలేదనిపిస్తారు.

సాంతకేక వర్గం విషయానికొస్తే డైరెక్టర్ వంశీ ఎంచుకొన్న పాయింట్, బ్యాక్ డ్రాప్ కొత్తగా అనిపించినా.. కథనం విషయంలో ఇంకాస్త కసరత్తులు చేసుంటు బాగుండేది. నిడివి ఈ సినిమాకి పెద్ద సమస్యగా మారింది. వంశీ క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ లో అంతగా బలం లేదు. దాంతో ఆడియన్స్ కి ఆ పాత్రలతో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సైంది. ఇలాంటి పీరియడ్ మూవీస్ కి మ్యూజిక్ అందించడంలో దిట్ట జి.వి.ప్రకాశ్ కుమార్. జి.వి. అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు బలాన్ని తీసుకొచ్చింది. 1970, 80ల కాలం నాటి స్టూవర్ట్ పురం పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ మది, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొళ్ల ప్రతిభను మెచ్చుకోవాలి. మొత్తంమీద.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇలాంటి కథాంశాన్ని ఇంత భారీ కాన్వాస్ లో తీయడానికి నిర్మాణం విషయంలో ఎలాంటి రాజీ పడలేదని విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది.

మొత్తంమీద.. మాస్ మహారాజ సరికొత్త మేకోవర్ తో కొత్తగా కనిపించిన ‘టైగర్ నాగేశ్వరరావు‘ ప్రేక్షకులైతే సరికొత్త అనుభూతిని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. దసరా బరిలో ‘టైగర్ నాగేశ్వరరావు‘ ర్యాంరేజ్ ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాలి.

Related Posts