Adipurush : ఆదిపురుష్ ను పూర్తిగా హిందువులకే పరిమితం చేస్తున్నారా..?

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్‌. రామాయణంలోని కిష్కింధ కాండ, సుందర కాండల ఆధారంగా రూపొందించినట్టుగా కనిపిస్తోన్న ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ డైరెక్ట్ చేశాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రం మొదటి నుంచి మంచి సినిమాగా వస్తుందీ అనుకుంటే కేవలం హిందువుల సినిమాగా మాత్రమే ప్రోజెక్ట్ చేస్తున్నారు మేకర్స్.

నిజానికి భక్తి రస ప్రధాన చిత్రాలకు మతం పెద్ద అడ్డంకి కాదు. యాభై యేళ్ల క్రితమే వచ్చిన తెలుగు లవకుశను మతాలతో సంబంధం లేకుండా ఊళ్లకు ఊళ్లు బళ్లు కట్టుకుని మరీ వెళ్లి చూశారు. తర్వాత అదే సీన్ కరుణామయుడు చిత్రానికీ కనిపించింది. ఈ చిత్రాన్ని అన్ని మతాల వారకూ విపరీతంగా చూశారు. తర్వాత ఈ తరహాలో అనేక చిత్రాలు ఉన్నాయి. అందుకే అవి అఖండ విజయం సాధించాయి. ఆదిపురుష్ కూడా ఆ కోవలోకే వస్తుంది అనుకుంటే మేకర్స్ మాత్రం కేవలం హిందువులకే పరిమితం చేసేలా ప్రమోషన్స్ చేస్తున్నారు.


కొన్నాళ్ల క్రితం రంజాన్ రోజున ఈ మూవీ సాంగ్ ను విడుదల చేశారు. ఇది కావాలనే చేశారు అంటూ అప్పట్లోనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ మంగళవారం రోజున తిరుపతిలో జరిగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఇదే ఇప్పుడు మరికొన్ని విమర్శలు కారణం అవుతుంది. రాముడి కథ అంటే లోకకళ్యాణం కోసం సాగేదిగా తీశారా లేక ప్రస్తుతం దేశంలో ఉన్న మూడ్ కు తగ్గట్టుగా కొందరిని మెప్పించాలనే ప్రయత్నం చేశారా అనే అనుమానాలూ కలుగుతున్నాయి.

నిజానికి రాముడిని కొలవకపోయినా రామాయణాన్ని గౌరవించే నాన్ హిందూస్ చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. బట్ మేకర్స్ చేస్తోన్న ప్రమోషన్స్ వల్ల ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితం అనేలా కనిపిస్తోంది.

మరోవైపు చిన జీయర్ పై ఒక వర్గం హిందువుల్లోనే కొంత వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యక్తిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలవడం ద్వారా సినిమాను రాజకీయంగానూ వాడుతున్నారా అని చెప్పుకుంటున్నారు కొందరు. ఏదేమైనా ఆదిపురుష్‌ మరో లవకుశలా ఆబాలగోపాలాన్ని మెప్పిస్తుంది అనుకుంటే అలా ఏం కాదు.. మా ఆడియన్స్ వేరే.. వారు చాలు అనేలా ఉంది మేకర్స్ ప్రవర్తన. మరి ఈ విపరీత పోకడ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ రాముడికే తెలియాలి.

Related Posts